ఇల్లు.. ఆఫీసు.. రెండూ కావాలి!

9 Nov, 2022 02:41 IST|Sakshi

కొద్ది రోజులు అక్కడా.. ఇక్కడా!!

హైబ్రిడ్‌ పద్ధతే ముద్దంటున్న ఉద్యోగులు!

వారంలో 2–3 రోజులు ఆఫీసుకు ఓకే

హెచ్‌పీ సర్వే వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారి పీడ వదలి కొన్ని నెలలవుతోంది. ఇంతకాలం ఇంట్లోంచే పనిచేసుకునే సౌకర్యం అనుభవించిన వారు మళ్లీ ఆఫీసుల బాట పడుతున్నారు. బాగానే ఉంది కానీ.. ఇంతకీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాలని అనుకుంటున్నారా? లేక రెండేళ్లుగా ఉన్నట్లే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కొనసాగితే బాగుండు అనుకుంటున్నారా? అంటే.. రెండూ కొంత ఉంటే మేలని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్లు కంప్యూటర్‌ తయారీ సంస్థ హెచ్‌పీ చెబుతోంది!

ఉద్యోగుల మనసు తెలుసుకునేందుకు హెచ్‌పీ ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం భారతీయ ఉద్యోగులు కనీసం 92 శాతం మంది ఉద్యోగులు హైబ్రిడ్‌ మోడల్‌ అంటే వారంలో కొన్ని రోజులు ఆఫీసు, మిగిలిన రోజులు ఇంట్లో అన్న పద్ధతికి జై కొట్టారు. దీనివల్ల కుటుంబం, ఉద్యోగాల మధ్య సమతౌల్యత సాధించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా.. ఈ హైబ్రిడ్‌ పద్ధతి వల్ల ఉత్పాదకత కూడా పెరుగుతుందని చెప్పారు. కాకపోతే హైబ్రిడ్‌ పద్ధతికి ఉపయోగపడేలా మరికొన్ని టెక్నాలజీలు ఉద్యోగులకు అందుబాటులోకి రావాలని అభిప్రాయపడ్డారు. సర్వేలో భాగంగా హెచ్‌పీ 10 వేల మందిని ప్రశ్నించగా ఇందులో వెయ్యిమంది భారత్‌కు చెందిన వారు ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారి వయసు 18 ఏళ్ల నుంచి 50్జట పైబడి ఉండగా అందరూ వేర్వేరు రంగాలకు చెందినవారే. ఉద్యోగం చేసే వారితోపాటు పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులు, సొంత వ్యాపారాలు ఉన్నవారూ ఉన్నారు.

హైబ్రిడ్‌ పద్ధతి ఉంటే అదే కంపెనీలో...!!
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. హైబ్రిడ్‌ పద్ధతిలో పనిచేసుకునే అవకాశం ఉంటే.. తాము ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలోనే కొనసాగుతామని సర్వే చేసిన వారిలో 88 శాతం మంది చెప్పడం! సర్వేలో పాల్గొన్న వారు తాము వారంలో రెండు మూడు రోజులపాటు ఆఫీసులకు వెళ్లేందుకు అభ్యంతరమేమీ లేదని చెప్పడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే భవిష్యత్తులో ఈ హైబ్రిడ్‌ పద్ధతి కొనసాగే అవకాశం ఉందని సంస్థలు అంచనా వేస్తున్నాయి, ఈ కొత్త పద్ధతికి అలవాటుకు తగ్గట్టుగా తమని తాము మార్చుకోవాల్సి వస్తుందని హెచ్‌పీ ఇండియా మార్కెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేతన్‌ పటేల్‌ తెలిపారు.

హైబ్రిడ్‌ మోడల్‌ ఉద్యోగుల వృత్తి, వ్యక్తిగత జీవితాలను బ్యాలెన్స్‌ చేసుకునే అవకాశం కల్పిస్తుందని, సౌకర్యవంతంగానూ ఉంటుందని ఆయన చెప్పారు. అంతా బాగుందనే ఫీలింగ్‌ ఉద్యోగుల్లో కల్పిస్తుందని, అన్నింటి కంటే ముఖ్యంగా కంపెనీలు ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారా? లేదా? అన్నది తెలుసుకునేందుకు తద్వారా ఉత్పాదకత పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తుందని ఆయన వివరించారు. ఉద్యోగులు తమ ప్రాథమ్యాలేమిటో గుర్తిస్తున్నట్లు సర్వే ద్వారా స్పష్టమవుతోందని, సంస్థలు కూడా ఉద్యోగుల అంచనాలకు తగ్గట్టుగా తమ విధానాలను మార్చుకోవడం, కొత్త టూల్స్‌ను సిద్ధం చేస్తూండటం గమనార్హమని తెలిపారు.  

మరిన్ని వార్తలు