ఐఐటీల్లో మరో 500 సీట్లు! 

20 Jun, 2022 01:12 IST|Sakshi

కొన్ని కొత్త ఇంజనీరింగ్‌ కోర్సులకు చాన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి సీట్లు పెరిగే అవకాశముంది. గతేడాది (2021–22)లో 16,232 సీట్లు ఉండగా, ఈసారి మరో 500 సీట్లు పెరగవచ్చని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ వెలువడే నాటికి వీటిని జాబితాలో చేరుస్తారని చెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఐఐటీలు కొత్త కోర్సుల వైపు అడుగులేస్తున్నాయి. పాఠ్యప్రణాళికలోనూ మార్పులు తెస్తున్నాయి. డిమాండ్‌ ఉన్న, పారిశ్రామిక అవసరాలు తీర్చగలిగే కోర్సులను విద్యార్థుల ముందుకు తెస్తున్నాయి. ఈ క్రమంలో ఐఐటీలు కొన్ని కొత్త కోర్సులను డిజైన్‌ చేశాయి. హైదరాబాద్‌ ఐఐటీలో బీటెక్‌ బయోటెక్నాలజీ అండ్‌ బయో ఇన్‌ఫర్మేటిక్స్, కంప్యూటేషన్‌ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ కోర్సులను గతేడాది కొత్తగా అందుబాటులోకి తెచ్చారు.

ఈ ఏడాది కూడా మరికొన్ని పరిశోధనాత్మక ప్రాధాన్యం ఉన్న కోర్సుల వైపు అడుగులు వేస్తున్నారు. స్టాటిస్టిక్స్‌ అండ్‌ డేటా సైన్స్, మెడికల్‌ అనుబంధ సాంకేతిక కోర్సుల వైపు ఐఐటీలు మొగ్గు చూపుతున్నాయి. త్వరలో వీటికి అనుమతి వస్తుందని భావిస్తున్నాయి. మరోవైపు ఇతర ప్రాంతాల్లోని ఐఐటీలు కూడా కొత్త కోర్సులను ముందుకు తెస్తున్నాయి. ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక సంస్థలు కూడా మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్‌ కోర్సులకు రూపకల్పన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐటీల్లోనే ఈసారి 500 సీట్లు పెరిగే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు