నా పాఠాన్ని నేనే చదివాను: మలావత్‌ పూర్ణ

19 Feb, 2021 13:26 IST|Sakshi

ఎవరికీ దక్కని అరుదైన అనుభూతి ఇది 

‘‘ఆ క్షణం నా ఆనందానికి అవధుల్లేవు.. కానీ, కాళ్లలో సత్తువ లేదు’’ 

‘సాక్షి’ ఇంటర్వ్యూలో మలావత్‌ పూర్ణ 

ఆమె సంకల్పబలం శిఖరసమానం. ఆత్మవిశ్వాసంలో ఆమె ఎవరెస్ట్‌.. లక్ష్యసాధనలో ఆమెకు లేదు రెస్ట్‌. అందుకే ఆమె ది బెస్ట్‌.. సరిగ్గా ఐదడుగులు కూడా లేని ఆమె ముందు ప్రపంచంలోనే ఎత్తైన 29,028 అడుగుల పర్వతం తలవంచింది. ఆమె ఘనతను చూసి మహిళాలోకం సగర్వంగా తలెత్తుకొంది. ఆమే మలావత్‌ పూర్ణ. ఆమె పేరు మారుమూల పాకాల నుంచి ప్రపంచం నలుమూలలకూ పాకింది. ఆమె ప్రతిష్ట హిమాలయమంత ఎత్తు కు ఎదిగింది. యువతకు ఆమె ఇప్పుడు సం‘పూర్ణ’ప్రేరణ. సంకల్పబలముంటే సాధారణ మనిషైనా ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని సాధికారికంగా నిరూపించిన ‘పూర్ణ’అంతరంగాన్ని ‘సాక్షి’మరోసారి ఆవిష్కరించింది. ఇక చదవండి. 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: ‘‘ఎవరెస్ట్‌ అధిరోహించిన తర్వాత నా గురించి ఒకటి, రెండు పేరాలు పదో తరగతి, ఇంటర్, డిగ్రీల్లో పాఠ్యాంశాలుగా చేర్చారు.. నా గురించి ఉన్న ఈ పాఠ్యాంశాలను నేనే చదువుకోవడం చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి అనుభూతి చాలా అరుదుగా ఎదురవుతుంది.. నా అచీవ్‌మెంట్‌పై తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో పుస్తకాలు వచ్చాయి.. తాజాగా మలయాళంలోనూ ఓ పుస్తకం వెలువడింది. నా గురించి ఏకంగా ఓ సినిమానే వచ్చింది.. ఈ సినిమా చూసి ఏ ఒక్క ఆడపిల్ల అయినా నన్ను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేస్తే నాకు అదే సంతోషం’’అంటున్నారు ప్రపంచంలోనే అత్యం త ఎత్తైన శిఖరం ‘ఎవరెస్ట్‌’ను అధిరోహించిన అతిపిన్న వయస్కురాలిగా వరల్డ్‌ రికార్డు సాధించిన మలావత్‌ పూర్ణ. అమెరికాలో విద్యాభ్యాసం తర్వాత తన స్వగ్రామం పాకాల చేరుకున్న సందర్భంగా పూర్ణను ‘సాక్షి’ పలకరించింది. 

కుటుంబంతో మలావత్‌ పూర్ణ  

సాక్షి: ఎవరెస్ట్‌ అధిరోహించక ముందు ఎలా ఉండేవారు? మీ లక్ష్యాన్ని సాధించాక ఎలా ఉన్నారు? 
పూర్ణ: ‘‘రైట్‌ గైడెన్స్‌ ఫ్రం రైట్‌ పర్సన్‌’’ 
తొమ్మిదో తరగతిలో నేను ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కిన.. అంతకు ముందు ఇదే గ్రామం(పాకాల)లో బడికి పోతుండే.. పొలం పనుల్లో నాన్నకు సహాయం చేస్తుండే.. నాట్లు వేసేటప్పుడు వరినారు అందిస్తుండే.. అడవిలోకి వెళ్లి ఇప్పపువ్వు ఏరుతుంటిని.. మొర్రిపండ్లు సేకరిస్తుంటిమి.. అందరు పిల్లల్లాగే చదువుకోవడం, ఆడుకోవడం.. ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కేటప్పుడు నా వయస్సు 13 సంవత్సరాల పదినెలలు. అతిపిన్న వయస్సులో ఈ శిఖరం ఎక్కిన రికార్డు నాకు దక్కింది. అంతకు ముందు 16 సంవత్సరాల వ్యక్తి పేరిట ఈ రికార్డు ఉంది. ఇది సాధించాక చాలా మార్పులు వచ్చాయి.. ప్రపం చం నావైపు చూసినట్లపించింది. అమెరికాలో చదువుకునే అవకాశం లభించింది. ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సార్‌ మార్గదర్శకత్వంలో ముందడుగు వేశాను. రైట్‌ గైడెన్స్‌ ఫ్రం రైట్‌ పర్సన్‌.. ఉంటే ప్రతి ఆడపిల్లా ఉన్నతశిఖరాలను అందుకోవచ్చనేది నిరూపితమైనట్లు భావిస్తున్నా. 

సాక్షి: అమెరికాలో ఏం చదువుకున్నారు? 
పూర్ణ: ‘‘2017లో అమెరికా వెళ్లాను. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు యూఎస్‌ వెళ్లేందుకు అవకాశం వచ్చింది. యూఎస్‌ కాన్సలేట్‌ జనరల్‌ క్యాథరిన్‌ హెడ్డాను కలిసినప్పుడు అమెరికా రావాలని సూచించారు. అక్కడ ‘‘వరల్డ్‌ లెర్నింగ్‌ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రాం, ఎక్స్‌పీరియెన్షనల్‌ ఎడ్యుకేషన్‌’’ అనే కోర్సులు రెండు సెమిస్టర్లు చదివేందుకు వెళ్లాను. సంవత్సరంపాటు అమెరికాలో ఉన్నా.. లాక్‌డౌన్‌ సమయంలోనే అక్కడి నుంచి వచ్చాను. ప్రస్తుతం డిగ్రీ(బీఏ)లో రాయకుండా మిగిలిపోయిన పరీక్షలు రాస్తున్నాను.

సాక్షి: మీ ఫ్యూచర్‌ ప్లాన్స్‌ ఏంటీ? 
పూర్ణ: ఇకపై పర్వతారోహణను నా జీవితంలో ఒక భాగం చేసుకుంటాను.. ప్రస్తుతం నా డిగ్రీ పూర్తవుతోంది. పొలిటికల్‌ సైన్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేద్దామని అనుకుంటున్నాను. ఐపీఎస్‌ సాధించి వేలాదిమందికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా.. పీజీ అమెరికాలో చేయాలనే భావిస్తున్నా.. రెండెకరాలున్న వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. బీపీఎల్‌ కుటుంబం.. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆర్థికసహాయం అందింది. ఇందల్వాయిలో ఐదెకరాల భూమి కేటాయించారు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రిపుల్‌ బెడ్‌రూం ఇంటి స్థలం కేటాయించారు.. ఇన్ఫోసిస్‌ అధినేత్రి సుధామూర్తి ఆర్థికంగా చేయూతనిచ్చారు. 

సాక్షి: పర్వతారోహణ విశేషాలు చెబుతారా? 
పూర్ణ: ‘‘లక్ష్యాన్ని చేరుకున్నాక.. నా ఆనందానికి అవధుల్లేవు.. కానీ, నా కాళ్లలో సత్తువ లేదు’’ఐదో తరగతి వరకు ఇదే గ్రామం (పాకాల)లో చదువుకున్నా.. తర్వాత తాడ్వాయి(కామారెడ్డి జిల్లా) సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుకునేటప్పుడు పర్వతారోహణకు అవకాశం వచ్చింది. రాక్‌ కైయిమింగ్‌ శిక్షణ కోసం మొదట భువనగిరికి తీసుకెళ్లారు. ఆ కొండను చూస్తే భయమేసింది. మనిషన్నవారు ఈ కొండను ఎక్కగలరా అని తొలి అడుగు వేసేటప్పుడు అనిపించింది.. అక్కడ ఐదురోజులు శిక్షణ తీసుకున్న తర్వాత డార్జిలింగ్‌కు పంపారు. బేసిక్స్‌ అండ్‌ అడ్వాన్స్‌ మౌంటెనింగ్‌లో 25 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. చుట్టూ కనుచూపు మేరల్లో అంతా మంచు. డార్జిలింగ్‌కు వెళ్లాక ఇదే కొత్త లోకం అని అనిపించింది.. ఆ పరిస్థితులు చూస్తే ఎలాగైనా ఎవరెస్ట్‌ ఎక్కాలని నిర్ణయించుకున్నాను.

కఠినమైన శిక్షణ ఇచ్చారు. ఎవరెస్ట్‌ ఎక్కేందుకు ఇంత కఠోర శిక్షణ అవసరమా అని ప్రవీణ్‌ సార్‌ను అడిగాను.. కానీ, ఎవరెస్ట్‌ సమీపంలోకి వెళ్లేటప్పుడు అనిపించింది. అంత కంటే ఇంకా కఠోర శిక్షణ అవసరమని.. మరికొద్ది సమయంలోనే లక్ష్యాన్ని చేరుకుంటున్న తరుణంలో పర్వతాల్లో శవాలు కనిపించాయి.. వాటిని చూసి భయపడి వెనక్కి వెళితే.. ఇన్ని రోజులు పడిన శ్రమ అంతా వృథా అవుతుందనిపించింది.. ఎలాగైనా లక్ష్యమే నా కళ్ల ముందు మెదిలింది.. శక్తినంతా కూడగట్టుకుని లక్ష్యాన్ని చేరుకున్నా.. ఇక నా ఆనందానికి అవధుల్లేవు.. ఎగిరి గంతేయాలనిపించింది.. కానీ నా కాళ్లలో సత్తువ లేదు.. కూలబడిపోయాను.. కొన్ని నీళ్లు తాగాక.. వెళ్లి ఫొటోలు దిగాను’’ 

పాకాల.. చుట్టూ అడవి.. గుట్టల మధ్య కుగ్రామం.. ఇదో అత్యంత మారుమూల ప్రాంతం.. సిరికొండ మండలంలో ఉన్న ఈ గ్రామం నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆర్టీసీ బస్సు కూడా రోజుకు ఒకటీ రెండు ట్రిప్పులకు మించి వెళ్లదు.. గ్రామంలో గిరిజనులే అధికం. గుట్టలకు ఆనుకుని నివాసాలు నిర్మించుకున్నారు.. అది చుట్టూ పచ్చని పొలాల మధ్య ఉంటుంది. 

విద్యార్థులకు చెబుతుంటాను 
‘‘పాకాల బడిలో విద్యా వలంటీర్‌గా పనిచేస్తున్నా.. పాఠాలు చెబుతున్నప్పుడు పిల్లలకు తరచూ చెబుతుంటాను.. ‘మీరు మాలావత్‌ పూర్ణలాగా ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతోపాటు, ఆ లక్ష్యసాధన కోసం కష్టపడాలని’ పూర్ణ చిన్నప్పుడు అందరు పిల్లల్లాగే ఆడుకునేది. ఆటల్లో కాస్త ఎక్కువ ఆసక్తి కనబరిచేది. కళ్ల ముందు తిరిగిన అమ్మాయి ఉన్నతస్థానానికి వెళ్లడం ఆనందంగా ఉంది’’ 
– కళావతి, ఉపాధ్యాయురాలు 

సరదాగా ఆడుకునేవాళ్లం
ఐదో తరగతి వరకు కలసి ఇదే గ్రామం(పాకాల)లో చదువుకున్నాం.. అప్పుడు ఎంతో సరదాగా ఆడుకునేవాళ్లం.. పాఠశాలకు రెగ్యులర్‌గా వెళ్లేవాళ్లం.. మా స్నేహితురాలు ఎవరెస్ట్‌ ఎక్కిందని టీవీల్లో చూసినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది. ఇప్పడు కూడా పూర్ణ మాతో ఎంతో స్నేహంగా ఉంటుంది.            
– స్రవంతి, పూర్ణక్లాస్‌ మేట్‌ కుటుంబంతో మలావత్‌ పూర్ణ 

మరిన్ని వార్తలు