కరీంనగర్‌ వాసులకు శుభవార్త.. 2025లో రైలు వస్తోంది!

21 Feb, 2023 12:33 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వే ప్రాజెక్టు తుదిదశకు వచ్చింది. మరో రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యాన్ని విధించుకుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే చాలా వేగంగా పనులు చేపడుతోంది. 2025 మార్చి వరకు ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రాజెక్టు స్వరూపం, ఖర్చు, పూర్తి చేసే తేదీ తదితరాలను ప్రకటించింది.

సికింద్రాబాద్‌ నుంచి కరీంనగర్‌ను కలుపుతూ రూపొందించిన మనోహరాబాద్‌ (మేడ్చల్‌)– కొత్తపల్లి (కరీంనగర్‌) రైల్వే ప్రాజెక్టు ఇది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అధిక ఖర్చు, వయబిలిటీ ఉండదన్న కారణాలతో పక్కనపెట్టిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వినతితో 2016లో దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. ప్రస్తుతం గజ్వేల్‌ వరకు ట్రయల్‌ రన్‌ నడుస్తోంది. ప్రభుత్వం వేములవాడ, కొండగట్టుకు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించి అభివృద్ధి చేస్తుండటంతో ఈ మార్గంలో ఆధ్యాత్మిక పర్యాటకం ఊపందుకోనుంది.

ఏడాది చివరలో సిద్దిపేట, దుద్దెడలకు..
ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం మనోహరాబాద్‌–గజ్వేల్‌ మధ్య 32 కి.మీ మేర ట్రాక్‌ పూర్తయి ట్రయల్‌రన్‌ నడుస్తోంది. గజ్వేల్‌ నుంచి కొడకండ్ల వరకు కొత్తగా నిర్మించిన 12.5 కిలోమీటర్ల మార్గం కూడా పూర్తయి ట్రయల్‌రన్‌కు సిద్ధంగా ఉంది. ఇక ఈ ఏడాది ఆగస్టులో కొడగండ్ల–దుద్దెడను ఆగస్టులో, దుద్దెడ–సిద్దిపేటను డిసెంబరులో, సిద్దిపేట సిరిసిల్ల వచ్చే ఏడాది మార్చిలో, సిరిసిల్ల– కొత్తపల్లి 2025 మార్చిలో పూర్తి చేయనున్నారు. ఇప్పటివరకు పనులన్నీ అనుకున్న విధంగా గడువులోనే జరుగుతుండటం గమనార్హం.

మాస్టర్‌ప్లాన్లతో పెరిగిన డిమాండ్‌..!
ఈ ప్రాజెక్టు పూర్తయితే.. రాష్ట్రంలో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు ఒకే రైల్వేలైను పరిధిలో దర్శించుకునే వీలు కలుగుతుంది. ఈ మార్గంలో కొమురవెల్లి, కొండపోచమ్మ, నాచారం లక్ష్మీ నర్సింహాస్వామి, నాంపల్లి, వేములవాడ పుణ్యక్షేత్రాలు వస్తాయి. కొ త్తపల్లి స్టేషన్‌ అందుబాటులోకి వస్తే.. అక్కడ నుంచి కరీంనగర్‌ స్టేషన్‌ నుంచి కొండగట్టు (నూకపల్లి–మల్యాల)స్టేషన్‌కు కలపవచ్చు. ఇటీవల బడ్జెట్‌లో వేములవాడ మాస్టర్‌ ప్లాన్‌ కోసం రూ.50 కోట్లు, కొండగట్టుకు రూ.600 కోట్లు ప్రకటించడంతో ఈ రెండు పుణ్యక్షేత్రాలకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది.

ఈ రెండు ఆలయాల అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ ప్రాధాన్యం పెరిగింది. ఇదే విషయాన్ని దక్షిణమధ్య రైల్వే కూడా గు ర్తించింది. అందుకే, ఈ రైల్వేలైన్‌ను త్వరగా పూర్తి చేసే పట్టుదలతో ఉన్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ధీమాగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 46 శాతం మేర ప్రాజెక్టు పూర్తయింది. 

షిరిడీ, ముంబై, బెంగళూరులకు రైళ్లు..!
కొత్తపల్లి– మనోరాబాద్‌ రైల్వేలైన్‌ హైదరాబాద్‌ డివిజన్‌లో ఉంది. అదే ఖాజీపేట–బల్లార్షా మార్గం సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోకి వస్తుంది. ఈ రెండు మార్గాలకు కొత్తపల్లి జంక్షన్‌లా మారనుంది. ఉత్తరభారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఇది ముఖద్వారంగా అవతరించనుంది. ఈ మార్గం పూర్తయితే ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌ వాసులకు షిరిడీ, ముంబై, షిరిడీ, బెంగళూరులకు రైళ్లు నడపొచ్చని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.  

చదవండి  లాభాల గాడిద పాలు.. రోజూ లీటరున్నర వరకు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

మరిన్ని వార్తలు