విధ్వంసాన్ని పసిగట్టే వీడియో వ్యవస్థ

7 Jul, 2022 01:09 IST|Sakshi

దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్లలో త్వరలో అత్యాధునిక వీడియో నిఘా వ్యవస్థ

ఏఐ, ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌తో పాత నేరస్తుల గుర్తింపు..

ఆపై అధికారులకు ‘అలర్ట్‌’ 

ప్రతి ప్లాట్‌ఫాంపై ప్యానిక్‌ బటన్‌ 

తొలి దశలో దక్షిణమధ్య రైల్వే సహా 756 స్టేషన్లలో అందుబాటులోకి 

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల జరిగిన ‘అగ్నిపథ్‌’ ఆందోళనలు, రైళ్ల దహనం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్లలో అధునాతన సీసీటీవీ భద్రతా వ్యవస్థను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకు రానుంది. ఇప్పటివరకు ఉన్న సాధారణ సీసీ కెమెరాల స్థానంలో హైటెక్‌ కెమెరా లతో కూడిన వీడియో నిఘా వ్యవస్థ–వీఎస్‌ఎస్‌ (సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌)ను ఏర్పాటు చేయనుంది. కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో పనిచేసే వీడియో విశ్లేషణ సాఫ్ట్‌వేర్‌తోపాటు స్టేషన్ల ఆవరణ లోకి పాత నేరస్తులు ప్రవే శించిన వెంటనే గుర్తించి అధికారులను అప్రమత్తం చేయ గల ముఖాల గుర్తింపు (ఫేషియల్‌ రికగ్నిషన్‌) సాఫ్ట్‌ వేర్‌ను వినియోగించనుంది.

అలాగే రైల్వే సిబ్బంది ఏ ప్రాంతంలో ఉన్న వెబ్‌ బ్రౌజర్‌ నుంచైనా స్టేషన్లలోని సీసీ కెమె రాలు, సర్వర్, యూపీఎస్, స్విచ్‌లను వీక్షిస్తూ పర్యవేక్షించేలా నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను వాడనుంది. తొలి దశలో భాగంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలోని 76 స్టేషన్లు సహా దేశవ్యాప్తంగా 756 స్టేషన్లను వీడియో నిఘా వ్యవస్థ కోసం ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి 39 స్టేషన్లు ఉన్నాయి. రైల్వే అనుబంధ సంస్థ రైల్‌టెల్‌ ఆధ్వర్య ంలో ఈ వ్యవస్థ ఏర్పాటు పనులు జరగను న్నాయి. మలి దశల్లో ఇతర స్టేషన్‌ లలో హైటెక్‌ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ‘నిర్భయ నిధుల’తో చేపడు తున్న ఈ ప్రాజెక్టును 2023 జనవరి లోగా పూర్తి చేసే అవకాశం ఉందని రైల్‌టెల్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు?
రైల్వేస్టేషన్లలోకి వచ్చే/వెళ్లే మార్గాలు, ప్లాట్‌ ఫామ్‌లు, వెయిటింగ్‌ హాళ్లు, ప్రయాణి కుల వంతెనలు, బుకింగ్‌ కార్యాలయాలు, పార్కింగ్‌ ప్రాంతాలు, ఇతర కీలక స్థలాల్లో ఇవి ఏర్పటవుతాయి. రైల్వే ఆవరణలను వీలైనంత మేర నిఘా పరిధిలోకి తెచ్చేలా డోమ్, బుల్లెట్, పాన్‌ టిల్ట్, అల్ట్రా హెచ్‌డీ–4కే రకాల ఐపీ కెమెరాలను వినియోగిస్తారు.

ఉపయోగం ఏమిటి?
ఈ సీసీటీవీ కెమెరా వ్యవస్థ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ల ద్వారా అనుసంధానమై ఉంటుంది. వాటి నుంచి అధీకృత సిబ్బంది ఫోన్‌ నంబర్లకు కూడా లింక్‌ ఉంటుంది. అలారంతో ఈ వ్యవస్థను జోడిస్తారు. సీసీ కెమెరాలు రికార్డు చేసే ఆయా చిత్రాలలోని వ్యక్తులు ఇప్పటికే పోలీసుల బ్లాక్‌లిస్టులో ఉన్న వారి చిత్రాలతో సరిపోలితే సంబంధిత అధికారుల ఫోన్లకు (లింక్‌ అయినవాటికి), అధీకృత కేంద్రాలకు హెచ్చ రికలు వెళ్తాయి. అలాగే ప్రతి ప్లాట్‌ఫామ్‌ వద్ద రెండు ప్యానిక్‌ బటన్‌లను ఏర్పాటు చేస్తారు. ఆపదలో ఉన్న వారు/అవసరమైన వారు ఈ బటన్‌ నొక్కగానే వారి మొహాన్ని సీసీ కెమెరాలు క్లోజ్‌అప్‌లో బంధిస్తాయి.

అక్కడి పరిసరాలను కూడా వీడియో తీస్తాయి. సంబంధిత అధి కారుల ఫోన్లకు, కేంద్రాలకు హెచ్చ రికలు, పంపుతాయి. అలా రం మోగటం ద్వారా స్టేషన్లలోని సిబ్బంది సులభంగా అప్రమత్త మయ్యేందుకు వీలు కలుగుతుంది. అనుకోని సంఘటనలు  చోటు చేసుకుంటే వాటిని ఎదుర్కోవడంలో రైల్వే పోలీసులు, ఇతర సిబ్బంది మరింత సన్నద్ధంగా ఉండేందుకు అవకాశం లభిస్తుంది. సంబంధిత ఆర్‌పీఎఫ్, కంట్రోల్‌ రూమ్‌లలో వీడియో ఫుటేజీని 30 రోజుల వరకు భద్రపరచవచ్చు. ఒక స్టేషన్‌లో రికార్డయిన దృశ్యాలను ఆ స్టేషన్‌లోనే కాకుండా డివిజినల్, జోనల్‌ స్థాయిలోని సీసీటీవీ కంట్రోల్‌ రూమ్‌లలో కూడా విశ్లేషించొచ్చు.

రాష్ట్రంలో హైటెక్‌ కెమెరాల నిఘా ఉండే స్టేషన్లు ఇవే..
ఓయూఆర్ట్స్‌ కాలేజీ, డబీర్‌పురా, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, జామియా ఉస్మానియా, మలక్‌పేట, సీతాఫల్‌మండి, విద్యానగర్, యాఖుత్‌పురా, భరత్‌నగర్, బోరబండ, చందానగర్, ఫతేనగర్, హఫీజ్‌పేట, హైటెక్‌ సిటీ, జేమ్స్‌స్ట్రీట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నేచర్‌క్యూర్‌ హాస్పిటల్, నెక్లెస్‌రోడ్, సంజీవయ్య పార్క్, లింగంపల్లి, కాచిగూడ, బేగంపేట, వరంగల్, భద్రాచలం రోడ్, కాజీపేట, ఖమ్మం, మహబూబాద్, మంచిర్యాల, రామగుండం, సిర్పూర్‌ కాగజ్‌నగర్, తాండూరు, వికారాబాద్, బాసర, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌. 

మరిన్ని వార్తలు