ఎక్కడా ఆంక్షల్లేవు.. మరి ప్యాసింజర్‌కు రైళ్లేవి?

15 Feb, 2021 01:19 IST|Sakshi

ప్రత్యేక రైళ్ల పేరుతో ఎక్స్‌ప్రెస్‌లనే నడుపుతున్న రైల్వే 

ఇంకా పట్టాలెక్కని ప్యాసింజర్‌ రైళ్లు.. కోవిడ్‌ ఆంక్షల కొనసాగింపు 

ఎన్నికల సభలు, సినిమా హాళ్లకు లేని నిబంధనలు రైళ్లకే వర్తింపు..

కేంద్రం వైఖరితో ప్రయాణికుల ఇబ్బందులు 

గత్యంతరం లేక ప్రత్యామ్నాయాలవైపు ప్రజల చూపు 

ఎన్నికల సభలు జరుగుతున్నాయి.. వేల మంది హాజరవుతున్నారు..  థియేటర్లలో పక్కపక్కనే కూర్చుని సినిమా చూస్తున్నారు.. బస్సుల్లో తిరిగే విషయంలోనూ ఎలాంటి నిబంధనలు లేవు.. మార్కెట్లలో ఎంతమంది జనం ఉంటున్నారో అసలు లెక్కే లేదు.. ఎక్కడా ఆంక్షల్లేవు.. ఎవరిలోనూ కోవిడ్‌ భయం లేదు.. జనజీవనం దాదాపుగా సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేసింది.. కానీ,  రైళ్ల విషయంలో మాత్రం ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్పెషల్‌ పేరుతో ఎక్స్‌ప్రెస్, ప్రీమియం కేటగిరీ రైళ్లనే తిప్పుతూ ప్యాసింజర్‌ రైళ్లను మాత్రం పక్కన పెట్టేసింది. సభల నుంచి సినిమాల వరకు అన్నింటా ఆంక్షలు ఎత్తివేస్తూ కోవిడ్‌ జాగ్రత్తలు పాటించమని చెబుతున్న కేంద్రం.. ఎంతోమందిని గమ్యస్థానం చేర్చే రైళ్ల విషయంలో అందుకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరి స్తోంది? అన్నదే సగటు ప్రయాణికుడి ప్రశ్న. 

సాక్షి, హైదరాబాద్‌/సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌.. కాచిగూడ..నాంపల్లి.. ఇవీ రాష్ట్రంలో ప్రధాన రైల్వేస్టేషన్లు. కోవిడ్‌కు ముందు ఈ స్టేషన్లలో ఎప్పుడు చూసినా ప్రయాణికుల రద్దీ కనిపిస్తూనే ఉండేది. లాక్‌డౌన్‌ సమయం మినహాయిస్తే ఇప్పుడు ప్రయాణాల విషయంలో దాదాపు ‘సాధారణ పరిస్థితి’వచ్చేసింది. ప్రజలు రాకపోకలతో బిజీగా మారిపోయారు. కానీ రైల్వేస్టేషన్లు మాత్రం బోసిపోయే ఉంటున్నాయి. కోవిడ్‌ నిబంధనలు క్రమంగా సడలిస్తూ సాధారణ పరిస్థితి కలిగేలా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రైళ్లను నడిపే విషయంలో భిన్నంగా వ్యవహరిస్తుండటం ప్రయాణికులకు శాపంగా మారింది. దీంతో బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు.

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ కూడా పూర్తిస్థాయిలో సర్వీసులు నడిపిస్తోంది. తొలుత సిటీ బస్సులను పరిమితంగా నడిపిన ఆ సంస్థ.. ఇప్పుడు వాటిని కూడా దాదాపు పూర్తిస్థాయిలో నడుపుతోంది. కానీ రైల్వే మాత్రం ఒక్క ప్యాసింజర్‌ రైలును కూడా నడపటంలేదు. హైదరాబాద్‌ నుంచి ఇతర పట్టణాలకు తిరిగే డెమూ మెమూ రైళ్లతోపాటు ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా ఆపరేట్‌ చేయడంలేదు. కేవలం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ప్రీమియం కేటగిరీ రైళ్లలో కొన్నింటిని కోవిడ్‌ స్పెషల్‌ రైళ్లు, పండగల ప్రత్యేక రైళ్ల పేరుతో నడుపుతోంది. ఇవి జనం అవసరాలకు ఏమాత్రం సరిపోవడంలేదు. 

ఒక్క ప్యాసింజర్‌ రైలు కూడా లేదు..  
రాష్ట్రం నుంచి 250 వరకు ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తాయి. వీటిలో 180కి పైగా దక్షిణమధ్య రైల్వేకు సంబంధించినవి కాగా, మిగతావి ఇతర జోన్లలో మొదలై దక్షిణమధ్య రైల్వే మీదుగా నడిచేవి. అల్పాదాయ వర్గాలకు చెందినవారంతా ఎక్కువగా వీటిపైనే ఆధారపడతారు. అయితే, ఈ రైళ్లలో ఒక్కటి కూడా ఇప్పుడు నడవడంలేదు. ఇక సాధారణ రోజుల్లో సగటున నిత్యం 303 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం కేటగిరీ రైళ్లు నడిచేవి. వీటిలో ప్రస్తుతం నిత్యం సగటున 179 మాత్రమే నడుస్తున్నాయి. ఇవన్నీ పండగ ప్రత్యేక రైళ్లు, కోవిడ్‌ స్పెషల్‌ రైళ్ల పేరుతో తిరుగుతున్నాయి.  

రద్దీ మార్గాల్లోనే తక్కువ.. 
హైదరాబాద్‌ నుంచి ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడ, నర్సాపూర్, కాకినాడ, గుంటూరు వైపు వెళ్లే రైళ్లు కిటకిటలాడుతుంటాయి. వీటిలో విజయవాడకు నిత్యం సగటున 30 వరకు రైళ్లు తిరిగేవి. కానీ ప్రస్తుతం పది మాత్రమే నడుస్తున్నాయి. అలాగే విశాఖపట్టణానికి దాదాపు 25 రైళ్లు (అన్నీకలిపి) ఉంటాయి. వాటిలో ఇప్పుడు 13 మాత్రమే తిరుగుతున్నాయి. చెన్నైకి ఐదు రైళ్లుండగా.. ఇప్పుడు రెండే వెళుతున్నాయి. బెంగుళూరుకు ఐదుకు గాను ఒక్కటే తిరుగుతోంది. ఇలా రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో కూడా చాలా తక్కువ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. తిరుపతికి నుంచి ఐదు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉండగా ప్రస్తుతం అన్నింటినీ తిప్పుతున్నారు. తిరుపతికి భక్తుల తాకిడి పెరగడంతోనే వాటిని పునరుద్ధరించారు. ముంబైకి నగరం నుంచి ఐదు రైళ్లు నిత్యం ఉండగా నాలుగు నడుస్తున్నాయి. ఢిల్లీకి మూడు రైళ్లు ఉండగా.. మూడింటినీ తిప్పుతున్నారు. 

రద్దీ ఉండటం లేదంటున్న రైల్వే.. 
ఇప్పుడు నడుపుతున్న రైళ్లలో రద్దీ అంతగా ఉండటం లేదని, కొన్నింటికి తప్ప వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండటం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో రైళ్లను పునరుద్ధరించాల్సిన అవసరం లేదన్న భావన వారి మాటల్లో వ్యక్తమవుతోంది. ‘అన్ని రైళ్లను పునరుద్ధరిస్తే తిరిగి అన్ని స్టేషన్లు కిటకిటలాడటం ఖాయం. రైళ్లు లేకపోవడంతోనే ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అన్ని రైళ్లను నడిపితే అవి కిటకిటలాడి మళ్లీ కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే వాటిని తిప్పటం లేదు’అని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.

అయితే, సినిమాహాళ్లు కిటకిటలాడితే కేసులు పెరుగుతాయనే భయం లేనప్పుడు.. రైళ్ల విషయంలోనే ఈ ఆంక్షలెందుకు అనేది సగటు ప్రయాణికుడి ప్రశ్న. రైళ్లు పూర్తిస్థాయిలో తిరగకపోవటంతో ట్రాక్‌కు సంబంధించిన పనులను రైల్వే ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రాక్‌కు సంబంధించి పనులు కొలిక్కి తేచ్చేందుకు కొంతకాలం ప్రయాణికుల రైళ్లను తక్కువగా నడపాలని భావించి ఉండొచ్చన్న విమర్శలు ఉన్నాయి. ప్రయాణికుల రైళ్లతో రైల్వేకు నష్టమే వస్తోందని.. అందువల్లే లాభాలొచ్చే సరుకు రవాణా రైళ్లను గతంలోకంటే ఎక్కువగా తిప్పుతున్నారని కూడా అంటున్నారు. అయితే, అధికారులు వీటిని కొట్టిపడేస్తున్నారు. 

రైల్వే బోర్డు అనుమతిస్తే రైళ్లు నడిపేందుకు సిద్ధం: గజానన్‌ మాల్యా 
‘కోవిడ్‌ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో రైళ్లను నడపటం లేదు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్‌ రైళ్లను నడుపుతున్నాం. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో 60 శాతం తిప్పుతున్నాం. మిగతా రైళ్లను నడపటమనేది జోన్‌ పరిధిలో లేదు. రైల్వే బోర్డు అనుమతిస్తే నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంఎంటీఎస్‌ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది’అని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా ఇటీవల ఓ సమావేశంలో పేర్కొన్నారు. 

జనరల్‌ ప్రయాణాలు అనుమతించాలి 
భువనేశ్వర్‌ వెళ్లేందుకు రైలు ఏమైనా ఉందేమో అని స్టేషన్‌కు వచ్చాను. కనీసం లోనికి కూడా అనుమతించడం లేదు. బస్సులో వెళదామంటే కళ్లు తిరిగే చార్జీలు చెబుతున్నారు. సాధారణ ప్రయాణాలు అనుమతించి మాలాంటి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలి.  – విశాల్, సికింద్రాబాద్‌ 
 
ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ఇవ్వడంలేదు 
మా అమ్మను ట్రైన్‌ ఎక్కించేందుకు స్టేషన్‌కు వచ్చాను. ఆమెకు చదువు రాదు. పైగా వృద్ధురాలు. సహాయంగా లోపలకు వెళ్లడానికి ప్లాట్‌ ఫామ్‌ టికెట్లు ఇవ్వడం లేదు. ఇక్కడ మహిళలు, వృద్ధులు ఒంటరిగానే ప్లాట్‌ఫామ్‌ల మీదకు వెళ్లాల్సి వస్తోంది. ఫ్లాట్‌ఫామ్‌ టికెట్లు ఇస్తే బాగుంటుంది.  – దినేశ్, అమీర్‌పేట్‌ 
 
రాయితీలు పునరుద్దరించాలి 
ప్రత్యేక రైళ్ల పేరుతో అన్ని రకాల రాయితీలను నిలుపుదల చేశారు. వికలాంగులు మొదలు సీనియర్‌ సిటిజన్లు ఇతరత్రా రాయితీలు ఏమీ లేవు. దీంతో ప్రయాణికులు నష్టపోతున్నారు. ప్రత్యేక రైళ్లలో కూడా రాయితీలు ఇవ్వాలి. – నరేశ్, కూకట్‌పల్లి 
 
అన్ని కౌంటర్లు తెరవాలి 
రిజర్వేషన్‌ కన్‌ఫామ్‌ కాని పక్షంలో టికెట్‌ రద్దు చేయించుకునేందుకు నగరంలోని అన్ని రైల్వే కౌంటర్లను అందుబాటులోకి తేవాలి. రైలు బయటుదేరేందుకు అరగంట లోపే టికెట్‌ రద్దు చేసుకునే అవకాశం ఉండడం, రద్దు చేయించుకోవడం కోసం అందరూ సికింద్రాబాద్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌కు రావడం ఇబ్బందిగా ఉంది. – ప్రమోద్‌కుమార్, మియాపూర్‌ 
 
బస్సులో నాగ్‌పూర్‌కు రూ.1500 అడుగుతున్నారు 
ఉపాధి కోసం నాగ్‌పూర్‌ నుంచి నగరానికి వలస వచ్చాను. ఇప్పుడు సొంతూరు వెళ్లాలంటే రైళ్లు లేవు. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళదామని స్టేషన్‌కు వచ్చాను. కానీ జనరల్‌ బోగీలు లేవంటున్నారు. బస్సులో టికెట్‌కు రూ.1500 అడుగుతున్నారు. ఎప్పుడూ రైలులో రూ.200కే వెళ్లేవాడిని. –నితీష్, నాగ్‌పూర్‌ 
 
రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం 
మధ్యప్రదేశ్‌ వెళ్లాలంటే హైదరాబాద్‌ నుంచి నేరుగా బస్సులు లేవు. మారుతూ మారుతూ బస్సుల్లో మా ఊరు వెళ్లాలంటే బోలెడు ఖర్చుపెట్టక తప్పదు. కూలి పనులతో సంపాదించిన సొమ్మంతా బస్సులకే పెట్టాలి. రిజర్వేషన్‌ టికెట్‌ ఉంటేగానీ రైలు ఎక్కనీయడంలేదు. ప్రభుత్వం త్వరగా అన్ని రైళ్లూ నడిపితే బాగుంటుంది. 
– అభి, ఉమరై, మధ్యప్రదేశ్‌ 

మరిన్ని వార్తలు