Jammi Chettu: కానరాని పాలపిట్ట.. జాడలేని జమ్మిచెట్టు!

2 Oct, 2022 08:19 IST|Sakshi

భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణవాసులు దసరా ఉత్సవాలు జరుపుకొనే రైటన్‌ బస్తీ వేదిక దగ్గర ఉన్న చిన్న జమ్మి మొక్క ఇది. ప్రజలంతా పూజ చేసేందుకు ఇదే దిక్కు. పక్కనే ఉన్న పాల్వంచ కనకదుర్గ ఆలయం వద్ద పూజలందుకునే జమ్మి చెట్టు కూడా రేపోమాపో కనుమరుగయ్యేలా ఉంది. ఈ రెండు చోట్ల అనే కాదు. పల్లెపట్నం తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా జమ్మి చెట్ల సంఖ్య తగ్గిపోతోంది. అంతే ప్రాశస్త్యమున్న పాలపిట్టల దర్శనమూ అరుదైపోయింది. 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి పండుగలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ సంస్కృతి విదేశాలకు కూడా విస్తరించింది. దసరాను ఘనంగా జరుపుకోవడమూ పెరిగింది. కానీ ఆ రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడమనే సంప్రదాయం మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు పంట పొలాల్లో, చెరువు గట్ల వెంబడి, రోడ్ల పక్కన విరివిగా కనిపించిన పాలపిట్టలు ఇప్పుడు కానరాకపోవడం, జమ్మి చెట్ల జాడ లేకుండా పోతుండటమే దీనికి కారణం. 

రకరకాల కారణాలతో.. 
కాకులు, పిచ్చుకలు, గద్దల తరహాలో మనుషులు సంచరించే చోటే ఎక్కువగా పాలపిట్టలు మనగలుతాయి. అవి పంటలను ఆశించే క్రిమికీటకాలను తిని బతకడమే దీనికి కారణం. సాగులో పురుగుల మందుల వాడకం పెరగడం, పంటల సాగు తీరు మారిపోవడంతో పాలపిట్టలపై ప్రభావం పడింది. మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల వంటి ఆహార పంటలను ఆశించే పురుగులను పాలపిట్టలు తింటాయి. కానీ వాటి స్థానంలో పత్తి, పొగాకు, ఇతర వాణిజ్య పంటల సాగు పెరిగింది. వీటిలో పురుగు మందుల వాడకం ఎక్కువగా ఉండటం, లద్దె పురుగు, గులాబీ పురుగు వంటివి రాత్రివేళ పంటలపై దాడి చేస్తుండటంతో పాలపిట్టలకు ఆహారం కరువైంది.

పురుగుమందుల ప్రభావంతో పాలపిట్టల సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తోంది. ఒక సీజన్‌లో మూడు, నాలుగు గుడ్లు పెట్టే స్థాయి నుంచి క్రమంగా ఒకట్రెండుకే పరిమితమవుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంట పొలాల వెంట ఉండే చెట్లు, చెరువు గట్ల వెంట ఉండే నల్లతుమ్మ వంటి చెట్లను నరికివేయడం వల్ల పాలపిట్టలకు ఆవాసం కరువైపోతోంది. ఈ కారణాలతో పాలపిట్టల సంఖ్య తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


కొమ్మల నరికివేతతో పాల్వంచ పెద్దమ్మ ఆలయం వద్ద జమ్మిచెట్టు పరిస్థితి ఇలా... 

జమ్మి చెట్టుకు చోటేదీ? 
దసరా పండుగ రోజు తెలంగాణలో ఊరూరా జమ్మిచెట్టుకు పూజ చేస్తారు. ఇప్పుడు ఊళ్లలో జమ్మిచెట్లు కనుమరుగవడంతో.. అడవుల్లో వెతికి జమ్మిచెట్టు కొమ్మలను తెచ్చి తంతును పూర్తిచేస్తున్నారు. హరితహారం కింద, పల్లె ప్రకృతి వనాల్లో భారీగా మొక్కలు నాటుతున్నా ఎక్కడా జమ్మిచెట్టుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు.

 పాలపిట్టలు తగ్గిపోతున్నాయి 
వ్యవసాయంలో పురుగు మందుల వాడకం, పొలాల్లో చెట్ల నరికివేత వంటివాటితో పాలపిట్టలు కనుమరుగవుతున్నాయి. అందుకే ఊళ్లలో పాలపిట్టలు కనిపించడం లేదు. అడవుల్లో మాత్రమే ఉంటున్నాయి. పాలపిట్టల సంరక్షణ, జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాం. 
– కట్టా దామోదర్‌రెడ్డి, వైల్డ్‌ లైఫ్‌ ఎఫ్‌డీఓ, పాల్వంచ డివిజన్‌ 

మరిన్ని వార్తలు