నట్టింట ‘స్మార్ట్‌’ చిచ్చు!

16 Apr, 2022 04:29 IST|Sakshi

మాటల్లేవు... మాట్లాడుకోవడాలు లేవు! ఒక అచ్చట లేదు.. ముచ్చటా లేదు! నట్టింట్లో సందడి, హడావుడి లేనే లేవు... ఉన్నదల్లా భరించలేనంత నిశ్శబ్దం!  

నలుగురు నాలుగు దిక్కుల్లో మొబైల్‌ఫోన్‌ తెరలకు అతుక్కుపోయిన పరిస్థితి. స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు చాలామందిలో వ్యసనమైపోయింది. దీంతోనే నిద్ర... దీంతోనే మేలుకొలుపు. రీల్స్‌ మత్తులో కొందరు... పబ్జీ ఆడుతూ ఇంకొందరు.. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌... పేర్లు ఏవైనా.. అన్నింటి అతి వాడకం పుణ్యమా అని సమాజం విచిత్ర మహమ్మారిని ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి పీడ ఎలాగోలా వదిలిందని సంబరపడుతున్న ఈ సమయంలో దశాబ్దకాలంగా పట్టిపీడిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ మహమ్మారి సంగతులపై ప్రత్యేక కథనం.

(కంచర్ల యాదగిరిరెడ్డి)
ఇటీవల ఓ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ దేశంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. 2021లో భారతీయులు రోజుకు సగటున 7 గంటల పాటు ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. లాక్‌డౌన్‌ కారణమో మరేదో కానీ.. 2020 వరకు రోజుకు నాలుగున్నర గంటలే ఉన్న ఫోన్‌ వినియోగం ఆ తరువాతి సంవత్సరానికి 2.5 గంటలు పెరిగింది. ‘నేను మొదట్లో గంట మాత్రమే యూట్యూ బ్, ఇతర సామాజిక మాధ్యమాలను చూసేవాడిని.

రాన్రాను అది నాకు నిద్ర లేని రాత్రులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ ఊబి నుంచి బయటపడేందుకు మానసిక నిపుణుడి సహాయం తీసుకోవాల్సి వచ్చింది’ అని ముంబైకి చెందిన గృహి ణి ప్రమీలా రాణి వాపోయారు. ‘ముఖ్యంగా టీనేజ్‌ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారు. వారిని ఆ వ్యసనం నుంచి దూరం చేయకపోతే భవిష్యత్‌ ప్రమాదంలో పడుతుంది. నా దగ్గరకు రోజూ ఇలాంటి కేసులు అరడజను దాకా వస్తున్నాయి. వారిలో పిల్లలతో పాటు సాధారణ గృహిణులూ ఉన్నారు’ అని ఢిల్లీకి చెందిన మానసిక నిపుణుడు రాజేంద్రన్‌ చెప్పారు.

హైదరాబాద్‌కు చెందిన మానసిక నిపుణుడు కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘నిమిషానికి ఒకసారి.. నోటిఫికేషన్లు, మెయిళ్లు, చాట్‌ మెసేజీలేమైనా వచ్చాయా? అని చెక్‌ చేసుకోవడం స్మార్ట్‌ఫోన్‌ వ్యసన లక్షణాల్లో మొదటిది. ఫోన్‌ దగ్గర లేకపోతే ఆందోళనపడటం.. చార్జింగ్‌ ఫుల్‌గా ఉండాలనుకోవడం, నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ చేయడం.. ఇలా వ్యసనం బయటపడుతుంటుంది’ అని చెప్పారు.

భౌతిక, మానసిక సమస్యలు
స్మార్ట్‌ఫోన్‌ అతి వినియోగం కారణంగా అటు భౌతిక, ఇటు మానసిక సమస్యలు రెండూ తలెత్తుతున్నాయి. మహిళల్లో తలనొప్పి ఎక్కువ అవుతుండగా.. కళ్ల మంటలు, చూపులో అస్పష్టత, మెడ సమస్యలు, జబ్బు పడితే తేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం కాస్తా ఏకాగ్రత లోపానికి దారితీస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

‘బాలల హక్కుల సంఘం నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న విద్యార్థుల్లో 37.15 శాతం మంది ఏకాగ్రత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే కనీసం 23.80 శాతం మంది పిల్లలు నిద్రపోయేటప్పుడు కూడా స్మార్ట్‌ఫోన్‌ను తమ దగ్గరగా ఉంచుకుంటున్నారు’అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్వయంగా గత నెలలో లోక్‌సభకు వివరించారు.

‘ప్రాథమిక ఫలితాల ప్రకారం సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ కాస్తా మగవారిలో వంధ్యత్వానికి దారితీస్తుంది. అలాగే వీర్యకణాల కదలికలు నెమ్మదించేందుకు, సంఖ్య తగ్గేందుకూ మొబైల్‌ఫోన్‌ రేడియేషన్‌ కారణమవుతుంది’అని ప్రముఖ రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ కే.గోవర్దన్‌ రెడ్డి హెచ్చరించారు. మానసిక సమస్యల విషయానికి వస్తే స్మార్ట్‌ఫోన్‌ అధిక వినియోగం వల్ల నిద్ర చెడటం మొదలుకొని నిస్సత్తువగా అనిపించడం, మనోవ్యాకులత, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ వంటి మానసిక సమస్యలకు దారి తీయొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

ప్రశ్నించుకోండి... సరిచేసుకోండి! 
స్మార్ట్‌ఫోన్‌ వ్యసనాన్ని గుర్తించేందుకు కొన్ని సర్వేలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లోని ప్రశ్నలకు నిజాయితీగా జవాబులు చెప్పుకోగలిగితే మీరు స్మార్ట్‌ఫోన్‌కు బానిసయ్యారా? లేదా? అన్నది తెలిసిపోతుంది. తదనుగుణంగా సమస్యను అధిగమించే ప్రయత్నం చేయొచ్చు. మానసిక వైద్యులు కౌన్సెలింగ్‌ ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చూపగలరు కూడా. అతికొద్ది మందికి కొన్ని మందులు వాడాల్సిన అవసరం రావొచ్చు. అయితే స్మార్ట్‌ఫోన్‌ వ్యసనాన్ని తొలగించేందుకు నిర్దిష్టమైన పద్ధతి అంటూ ఏదీ లేదన్నది మాత్రం అందరూ గుర్తించాలి.   

మరిన్ని వార్తలు