గవర్నర్‌ తమిళిసైకి ఇందిరా శోభన్‌ లేఖ

30 Apr, 2021 19:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైద్యాన్ని తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చడంతోపాటు జర్నలిస్టులను అన్ని విధాలుగా ఆదుకునేలా తగిన చర్యలు చేపట్టాలని వైఎస్ షర్మిల ముఖ్య అనుచరులు ఇందిరాశోభన్ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ దొరకని పరిస్థితి ఉందని.. పేద, మధ్య తరగతి ప్రజలు అత్యంత దయనీయమైన స్థితిని ఎదుర్కొంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా వైద్యాన్ని తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చే విధంగా తగిన చొరవ చూపాలని గవర్నర్ కోరారు. అలాగే కరోనా మహమ్మారిపై పోరాటంలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టులనూ అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది మాదిరిగానే జర్నలిస్టులకూ కేంద్రం ప్రకటించిన రూ.50 లక్షల భీమా సౌకర్యాన్ని వర్తింపజేయాలని లేఖలో పేర్కొన్నారు.

డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందిలాగే జర్నలిస్టులూ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని, గడిచిన నెల రోజుల వ్యవధిలోనే సుమారు 40 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు లేఖలో పేర్కొన్నారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి, అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా, అంబులెన్సులు అందరికీ అందుబాటులో ఉండేలా తగిన చర్యలు చేపట్టేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కార్పొరేట్ ఆసుపత్రులపై నియంత్రణ కమిటీ వేసి, అక్రమాలకు పాల్పడుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేలా తగిన చొరవ చూపాలని లేఖలో కోరారు.

మరిన్ని వార్తలు