యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్ధి

10 Mar, 2021 08:59 IST|Sakshi

దేవాదాయశాఖ మంత్రి  ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత

కొండగట్టులో రూ.90 లక్షల వ్యయంతో శ్రీరామకోటి స్తూపానికి శంకుస్థాపన

కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత అన్నారు. కొండగట్టు దేవస్థానం ఆవరణలో రూ.90లక్షల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీరామకోటి స్తూపానికి మంగళవారం భూమిపూజ చేశారు. అంతకుముందు వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి, ఎమ్మెల్సీ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా ఆలయాలకు అత్యధికంగా నిధులు కేటాయిస్తోంది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. ఇప్పటికే రూ.వెయ్యికోట్లు వెచ్చించి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని బ్రహ్మాండంగా పునర్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే హనుమాన్‌ జయంతిలోపు స్తూపం పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఈ నెల 17నుంచి రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్‌ చాలీసా పారాయణాన్ని ప్రారంభించి.. కొండగట్టు ఆలయ ప్రాముఖ్యతను నలుమూలలా చాటిచెప్పే బృహత్తర కార్యక్రమానికి నాంది పలకడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ పెద్దహనుమాన్‌ జయంతిలోపు స్తూపం సిద్ధం అవుతుందని తెలిపారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, భక్తులు ఆధ్వర్యంలో కొండగట్టు సేవాసమితి పేరుతో అఖండ హనుమాన్‌ చాలీసా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం హనుమాన్‌ చాలీసా పోస్టరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ జి.రవి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్, ఈవో చంద్రశేఖర్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ఎంపీపీలు విమల, స్వర్ణలత పాల్గొన్నారు.

రాజన్న భక్తులకు సకల సౌకర్యాలు  

వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధిలో బుధవారం నుంచి శుక్రవారం వరకు జరిగే మహాశివరాత్రి జాతరకు హాజరయ్యే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కోవిడ్‌–19 నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. శానిటైజర్లు, మాసు్కలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. భక్తులు భౌతికదూరం పాటించేలా అధికారులు సమన్వయం చేసుకుంటూ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. భక్తుల భద్రతకు భారీపోలీసు బందోబస్తు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. కలెక్టర్‌ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు