పట్టాలెక్కని ‘పరిశ్రమ’

24 Oct, 2020 03:58 IST|Sakshi

అన్‌లాక్‌లోనూ పెరగని పారిశ్రామిక ఉత్పత్తి

మైనస్‌లో కొనసాగుతున్న పారిశ్రామిక వృద్ధిరేటు

ముడిసరుకుల కొరత, రవాణా సమస్యలు

కార్మికుల వేతనాల్లో కోత, సిబ్బంది తొలగింపు

రెన్యూవల్‌ లేక కాంట్రాక్టు కార్మికుల ఉపాధికి గండి

సాధారణ స్థితికి చేరుకునేందుకు మరో ఆరు నెలలు?

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మూలంగా రాష్ట్రం లో పారిశ్రామిక వృద్ధిరేటు గణనీయంగా తగ్గిపోయినట్లు రాష్ట్ర అర్థ గణాంక విభాగం నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా మాన్యుఫాక్చరింగ్, మైనింగ్, క్వారీ విభాగాల్లో ఉత్పత్తి తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో సిబ్బంది, కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడవుతోంది. వ్యవసాయ, సేవా రంగాల తర్వాత పారిశ్రామిక రంగం ఎక్కువ మందికి (సుమారు 18 శా తం) ఉపాధి కల్పిస్తుండగా, కోవిడ్‌ మూలం గా పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న కార్మికులు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

50– 60 శాతమే ఉత్పత్తి
రాష్ట్రంలోని పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే కేవలం 50 నుంచి 60 శాతం మేర మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని పారిశ్రామిక వర్గాలు చెప్తున్నాయి. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌తో పాటు ఆటోమొబైల్, మైన్స్, మినరల్స్, టెక్స్‌టైల్స్, స్టీలు, సిమెంట్‌ తదితర పరిశ్రమలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి. కోవిడ్‌ పరిస్థితుల్లో ఫార్మా, బల్క్‌ డ్రగ్‌ మినహా ఇతర కేటగిరీలకు చెందిన పరిశ్రమలు అన్నీ తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అన్‌లాక్‌ ప్రక్రియ తొలి విడతలోనే పరిశ్రమలకు నిబంధనలు సడలింపు ఇచ్చినా వివిధ కారణాలతో పారిశ్రామిక ఉత్పత్తి పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కడం లేదు. ముడిసరుకుల కొరత, రవాణా, మార్కెటింగ్‌ సమస్యలతో పాటు కొన్ని కేటగిరీలకు చెందిన పరిశ్రమల్లో కార్మికుల కొరత వల్ల పరిశ్రమలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయడం లేదు.

సిబ్బంది, కార్మికుల ఉపాధికి దెబ్బ
లాక్‌డౌన్‌ మూలంగా మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో అరకొర వేతనాలు చెల్లించిన పరిశ్రమల యాజమాన్యాలు ఆ తర్వాత ఉత్పత్తి తగ్గడాన్ని కారణంగా చూపిస్తూ సిబ్బంది, కార్మికుల సంఖ్యను తగ్గించాయి. ప్రతి ఏటా ఏప్రిల్‌లో కాంట్రాక్టు కార్మికులను రెన్యువల్‌ చేస్తూ వచ్చిన పరిశ్రమలు కోవిడ్‌ మూలంగా రెన్యువల్‌ ఊసెత్తకపోవడంతో పలువురు ఉపాధి కోల్పోయారు. వీరిలో అవసరమైన వారిని మాత్రమే తాత్కాలికంగా విధుల్లోకి తీసుకుంటుండగా, మరికొందరి వేతనాల్లో భారీగా కోత విధించారు. రూ.15వేల కంటే తక్కువ వేతనం ఉన్న వారిని మినహాయించి, ఇతర కేటగిరీలకు చెందిన కార్మికులు, సిబ్బంది వేతనాల్లో పరిశ్రమలు కోత విధిస్తున్నాయి.

వేతన ఒప్పందాల్లో ‘డిఫర్‌మెంట్‌’
మూడేళ్లకు ఒకసారి వేతన ఒప్పందం జరగా ల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మరో రెండేళ్లపాటు నూతన ఒప్పందాలు వాయిదా వేస్తామని యాజమాన్యాలు సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికే అమల్లో ఉన్న ఒప్పందాల్లోనూ డిఫర్‌మెంట్‌ను కోరుతూ కార్మిక సంఘాలు, సిబ్బందికి యాజమాన్యా లు లేఖలు రాస్తున్నాయి. ఒప్పందం మేరకు సిబ్బందిని పర్మినెంట్‌ చేయాల్సి ఉండగా వేచి చూడాలని చెప్తున్నాయి.  

తిరిగి వస్తున్న వలసకార్మికులు
హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల కార్మికులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో సుమారు లక్షన్నర మందిని రాష్ట్ర ప్రభుత్వం స్వస్థలాలకు తరలించింది. ప్రస్తుతం పరిస్థితులు కొంత మేర కుదుటపడటంతో వీరు తిరిగి గతంలో తాము పనిచేసిన ప్రదేశాలకు చేరకుంటున్నారు. లోహ, ఫ్యాబ్రికేషన్, వాటి అనుబంధ పరిశ్రమల్లో వలస కార్మికులను రప్పించేందుకు యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

మరో ఆరు నెలల్లో సాధారణ పరిస్థితి
పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారం భించేందుకు మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. వలస కార్మికులు తిరిగి ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఇటీవలి వర్షాలతో పారిశ్రామిక ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోనస్‌ డిఫర్‌మెంట్‌ కోసం యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. పరిశ్రమలు మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటేనే కార్మికులు, సిబ్బందికి పూర్తిస్థాయిలో వేతనాలు, బోనస్‌ ఇవ్వడం సాధ్యమవుతుంది.
– కె. సుధీర్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య 

అసంఘటిత కార్మికులకు భద్రతలేదు
అసంఘటిత కార్మికుల ఉపాధి, ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిం ది. ఉత్పత్తి తగ్గడా న్ని కారణంగా చూపుతూ వేతన ఒప్పందాలు మొదలుకుని, అన్ని రకాలైన డిఫర్‌మెంట్లకు యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి.  ఉద్యోగులను తొలగించొద్దని ప్రభుత్వం చెప్తున్నా పరిస్థితి భిన్నంగా ఉంది.
–బి.మల్లేశం, అధ్యక్షులు, సీఐటీయూ, సంగారెడ్డి జిల్లా  

మరిన్ని వార్తలు