మత్సకారుల పాలిట శాపంగా.. వ్యర్థ జలాలు

26 Aug, 2020 16:19 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డ పోతారం బొంతపల్లి పారిశ్రామిక వాడ పరిధిలో రసాయన పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ జలాలు మత్సకారుల పాలిట శాపంగా పరిణమించాయి. రెండు సంవత్సరాల క్రితం అమీన్ పూర్ మండలం గండిగూడెం చెరువులో వ్యర్ధ జలాల మూలంగా భారీగా చేపలు చనిపోయాయి. దీంతో రాష్ట్ర మత్స్యశాఖ నేరుగా జోక్యం చేసుకుని పరిశ్రమలకు భారీ జరిమానా విధించడంతో పాటు వ్యర్థ జలాలు వదులుతున్న 14 పరిశ్రమలను మూసివేసింది. ఈ చర్యల వల్ల భవిష్యత్తులో చెరువులు కలుషితం కావనే భరోసా మత్స్యకారుల్లో కలిగింది. అయినా పరిశ్రమల తీరు మారక పోవడంతో సమస్య ప్రతియేటా పునరావృతం అవుతూనే ఉంది. ఇదే సమయంలో జిన్నారం రాయని చెరువులో కాలుష్యం మూలంగా భారీగా చేపలు మృతి చెందాయి. గండి గూడెం చెరువు బాధితులకు జరిగిన న్యాయమే తమకు జరుగుతుందని అందరూ భావించినప్పటికీ ఆ సమస్యను కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) అధికారులు గాలికొదిలేశారు.

ఆ సమయంలో సoబంధిత పరిశ్రమలపై కేసులు నమోదైనా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. దీనిని అలుసుగా భావించిన పలు పరిశ్రమలు ఏటా ఇదే తంతును కొనసాగిస్తూ వర్షపునీటిలో కాలుష్య జలాలు విడుదల చేస్తుండడంతో చేపలు చనిపోవడం పరిపాటిగా మారుతుంది. తాజాగా పరిశ్రమలు కలుషిత జలాలు విడుదల చేయడంతో జిన్నారం మండలం కిష్టయ్య పల్లి మల్లం చెరువు గడ్డపోతారం అయ్యమ్మ చెరువులో చేపలు చనిపోయాయని మత్స్యకారులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

నిబంధనల ప్రకారం రసాయన పరిశ్రమలు వ్యర్ధ జలాలను ఒక్క చుక్క కూడా బయటకు వదలకూడదు. ఇందుకు సంబంధించిన అనుమతులు జారీ చేసే సమయంలో పరిశ్రమల యాజమాన్యాలు అంగీకార పత్రాన్ని కాలుష్యం నియంత్రణ మండలికి ఇస్తాయి. అయినా తప్పు జరిగితే జరిమానాలు కడితే సరిపోతుంది కదా అన్న ధోరణితో పరిశ్రమలు కాలుష్య జలాలు విడుదల చేస్తున్నాయి. దీనికితోడు ప్రజాప్రతినిధుల జోక్యంతో అధికారుల అవినీతి సమస్యను పెంచిపోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాలుష్య జలాల కారణంగా చేపలు సరిగా ఎదగని పరిస్థితితో పాటు చేపలు ఎప్పుడు మృత్యువాత పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత రెండేళ్ల పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ విభాగాలు కొన్ని కాలుష్యం కారకులకే వంత పాడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కాలుష్యం బారిన పడే చెరువులకు చేప పిల్లలు ఇవ్వమని చెబుతున్న మత్స్యశాఖ తీరును గతంలో మత్స్యకారులు ఎండగట్టారు. కాలుష్య నియంత్రణ మండలి కొన్ని చెరువుల వివరాలు వెల్లడించిందని అందులో పేర్లు లేకుంటేనే చేప పిల్లలు ఇస్తామన్న రీతిలో మత్స్యశాఖ వ్యవహరించింది. నిజానికి ఇక్కడ తప్పు చేస్తున్నది రసాయన పరిశ్రమలు, కాలుష్యాన్ని నియంత్రించకుంటే సంబంధిత పరిశ్రమలను మూసివేయాలి కానీ ఇక్కడ తప్పు చేస్తున్న పరిశ్రమలను వదిలేసి చెరువులకు చేపలు ఇవ్వటం మానేస్తున్నారని మత్సకారులు వాపోతున్నారు.
 
ఇప్పటికైనా పరిశ్రమలు, అధికారుల తీరు మారాలని మత్సకారులు కోరుతున్నారు. కాలుష్య జలాల కారణంగా చేపలు మృత్యువాత పడ్డ సమయాల్లో సంబంధిత అధికారులు విచారణ, తనిఖీలు అంటూ హడావిడి చేసి అనంతరం సమస్యను మరుగున పడవేయడం అధికారులకు పరిపాటిగా మారింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సంబంధిత అధికారుల చిత్తశుద్ధితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు తోడ్పాటు అందిస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు.

మరిన్ని వార్తలు