ఫోనొచ్చింది ఆపండహో!

1 Jun, 2022 07:30 IST|Sakshi

గచ్చిబౌలి: అక్రమార్కులకు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. నిర్మాణాలను కూల్చివేయకుండా తమ పలుకుబడిని ప్రదర్శిస్తున్నారు. సర్కారు స్థలాల్లో పేదల గుడిసెలను నిర్దాక్షిణ్యంగా తొలగించే బల్దియా యంత్రాంగం.. బడాబాబుల అక్రమాల జోలికి మాత్రం వెళ్లేందుకు సాహసించడంలేదు. ఒకవేళ వెళ్లినా వాటిని తూతూమంత్రంగా కూల్చేసి చేతులు దులుపుకుంటోంది. దీనికి తాజా ఉదాహరణ ‘ఇన్ఫినిటీ’ నిర్మాణం కూల్చివేత.

‘ఈ అక్రమం ఇన్ఫినిటీ’ అనే శీర్షికన ‘సాక్షి’లో దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన జీహెచ్‌ఎంసీ సిటీ ప్లానర్‌ దేవేందర్‌ రెడ్డి సదరు కట్టడాన్ని కూల్చివేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఈ అనురాగ్, శేరిలింగంపల్లి సర్కిల్‌ టీపీఎస్‌ రమేష్‌ను ఆదేశించారు. దీంతో ఆగమేఘాల మీద మంగళవారం అక్కడికి వెళ్లిన యంత్రాంగం.. ఇన్ఫినిటీ నిర్మాణం కూల్చివేతను మొదలుపెట్టారు.

దీని నిర్వాహకులు జీహెచ్‌ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లామని కూల్చివేతలు ఆపాలని ఒత్తిడి చేశారు. వీటిని పట్టించుకోకుండా కూల్చివేతలు సాగుతుండగానే నిర్వాహకులు చెప్పినట్లు అటు వైపు నుంచి వెస్ట్‌ జోనల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోడల్‌ అధికారి, చందానగర్‌ ఉప కమిషనర్‌ సుధాంశ్‌ ఫోన్‌ నుంచి రావడం.. కూల్చివేతలను అర్ధాంతరంగా నిలిపివేసి వెనుదిరిగారు.

నేను ఎవరికీ ఫోన్‌ చేయలేదు 
‘ఇన్ఫినిటీ డ్రైవ్‌ ఇన్‌ కూల్చివేతలు ఆపాలని నేనెవరికీ ఫోన్‌ చేయలేదు’ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. మాట్లాడినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు. నియోజవర్గంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో ఎప్పుడు తాను జోక్యం చేసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.  

ఉప కమిషనర్ల కనుసన్నల్లోనే..   
ఎలాంటి అనుమతులు లేకుండా భారీ స్థాయిలో ఇన్ఫినిటీ డ్రైవ్‌ ఇన్‌ నిర్మాణం చేపడుతున్న సమయంలో ఆరు నెలల క్రితం  ‘న్యాక్‌ గా’ ‘సాక్షి’లో వచ్చిన కథనంపై శేరిలింగంపల్లి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నోటీసు సిద్ధం చేసినట్లు సమాచారం.. శేరిలింగంపల్లి సర్కిల్‌ ఉప కమిషనర్‌ వెంకన్న నోటీసుపై సంతకం చేయకపోవడంతో నోటీసులు జారీ చేయలేకపోయినట్లు తెలుస్తోంది.

అయిదెకరాల సువిశాల విస్తీర్ణంలో చేపట్టిన ఇన్ఫినిటీకి ఎలాంటి అనుమతులు లేకున్నా అక్రమ నిర్మాణాల ఆన్‌లైన్‌ జాబితాలో లేకుండా పోయింది. దీంతో ఎంచక్కా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌కు చిక్కకుండా దర్జాగా నిర్మాణం పూర్తి చేసి వ్యాపారం చేసుకుంటున్నారు. గోపన్‌పల్లిలోని పెద్ద చెరువు సమీపంలో ఓ గిరిజన వ్యక్తి వంద గజాల్లో ఇంటి నిర్మాణం చేపడితే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌ కూల్చివేసింది. అక్కడ కూల్చివేతలు జరపాలని ప్రజా ప్రతినిధుల జోక్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కూల్చివేతలు జరపాలన్నా,  నిలిపివేయాలన్నా ప్రజాప్రతినిధులతోనే సాధ్యమని స్థానికులు పేర్కొంటున్నారు. 

(చదవండి: అన్నింటా అభివృద్ధి సాధిస్తూ..)

మరిన్ని వార్తలు