శ్రీశైలంలోకి 3.7 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

25 Jul, 2021 03:05 IST|Sakshi

కనీస నీటి మట్టం దాటిన నీటి నిల్వ

కృష్ణా బేసిన్‌లో ఎగువన భారీ వర్షాలు

తుంగభద్ర డ్యాంలోకి 1.16 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం ఎట్టకేలకు కనీస స్థాయిని దాటింది. శనివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.7 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటి మట్టం 855.60 అడుగులకు చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో 93.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 122 టీఎంసీలు అవసరం. కృష్ణా బేసిన్‌లో ఎగువన శనివారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈ వరద కనీసం వారం రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆదివారం శ్రీశైలంలోకి కనీసం 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, దాని ఉపనదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి.

ఆల్మట్టిలోకి భారీ ఎత్తున వరద వస్తుండటంతో.. దిగువకు అంతే స్థాయిలో వరదను వదిలేస్తున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌లోనూ అదే పరిస్థితి. జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో విద్యుదుత్పత్తి చేస్తూ.. స్పిల్‌వే గేట్లు ఎత్తేసి 3.72 లక్షల క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. తుంగభద్రలో వరద ఉధృతి పెరగడంతో టీబీ డ్యాంలోకి 1.16 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. దాంతో నీటి నిల్వ 74.58 టీఎంసీలకు చేరుకుంది. టీబీ డ్యాం నిండాలంటే ఇంకా 26 టీఎంసీలు అవసరం. వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగితే మరో మూడు, నాలుగు రోజుల్లో టీబీ డ్యాం నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత గేట్లు ఎత్తేసి.. వరదను దిగువకు విడుదల చేస్తారు. ఆ జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతాయి. దిగువకు విడుదల చేస్తున్న నీటిలో సాగర్‌కు 29305 క్యూసెక్కులు చేరుతున్నాయి.

మరిన్ని వార్తలు