కలహాల కాపురాలు..చిన్నపాటి విషయాలకే గొడవలు 

30 Jan, 2021 15:28 IST|Sakshi

పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు 

ఆవేశంలో హత్యలు, ఆత్మహత్యలకూ దిగుతున్న వైనం  

అర్థం చేసుకుంటేనే అన్యోన్య దాంపత్యం

కుటుంబ కలహాలు సామాజిక సమస్యగా మారుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే గొడవలకు దిగి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. కూర్చుని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకునే అవకాశాలున్నా పట్టింపులకు పోయి దూరమవుతున్నారు. మనస్పర్థలు, అపోహలతో మొదలైన విభేదాలే విడిపోయేంత అగాధాన్ని సృష్టిస్తున్నాయి. మానవ సంబంధాలను దూరం చేస్తున్నాయి.

సాక్షి, కామారెడ్డి: భార్య,భర్తల మధ్య తలెత్తే స్వల్ప విభేదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే చాలావరకు గొడవల నుంచి బయటపడవచ్చు. ఈ చిన్న పాటి లాజిక్‌ను వదిలేసి చాలా కుటుంబాలు అనవసర తగదాలకు పోయి దూరమవుతున్నారు. చాలా సందర్భాల్లో ఇవే గొడవలు చిలికిచిలికి గాలివానలా మారి హత్యలు, ఆత్మహత్యలకూ దారితీస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటే దాంపత్యం జీవితం అన్యోన్యంగా సాగిపోతుందని, కానీ చాలామంది తప్పు తనది కాదంటే తనది కాదంటూ పట్టింపులకు పోతుండడం వివాదాలను పెంచుతోంది. 

ఎవరూ తగ్గడం లేదు.. 
జీవితం యాంత్రికంగా మారింది. సమయానికి వంట చేయలేదని భర్త, ఇంటికి కావలసిన సామగ్రి తేవడం లేదని భార్య, తనమాట వినడం లేదని భర్త, మద్యం సేవిస్తున్నాడని భార్య, తన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తోందని భర్త, తనను పట్టించుకోవడం లేదని భార్య.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం కుటుంబాల్లో సాదారణంగా మారింది. ఈ సమస్య లన్నీ చిన్నచిన్నవే. వీటిని పరిష్కరించుకునే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ఎవరూ తగ్గడం లేదు. ఫలితంగా గొడవలు పెంచుకుంటున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా ఎవరికి వారుగా ఇరుగు పొరుగు వారికి చెప్పుకుని రోడ్డున పడుతున్నారు. చెప్పుడు మాటలతో దూరమై పోలీసుస్టేషన్‌ గడప తొక్కుతున్నారు. ఒక్కోసారి గృహహింస, వరకట్న వేధింపుల వంటి కేసుల వరకూ వెళ్తున్నాయి. ఇవి వారి మధ్య మరింత దూరగడానికి కారణమవుతున్నాయి. గత ఏడాది జిల్లాలో గృహహింసకు సంబంధించి 136 కేసులు నమోదయ్యాయి. కౌన్సెలింగ్‌ ద్వారా 110జంటలు ఒక్కటయ్యారు. 

ఖర్చులూ సమస్యే.. 
పెరిగిన కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులకు అ య్యే వ్యయం కుటుంబాలకు భారంగా మారింది. ఇలాంటి సమయంలో భార్య, భర్తలిద్దరూ ఒకరికొకరు చర్చించుకుని ఖర్చు పొదుపుగా చేయడానికి ప్రయత్నించాలి. ఒక్కరే సంపాదిస్తున్నపుడు కు టుంబ పోషణకు సరిపడక ఇబ్బందులు తలెత్తడం సహజం. అలాంటి సందర్భాల్లో ఇద్దరూ చెరోపని ఎంచుకుని చేయడం ద్వారా ఆర్థిక కష్టాలను కొంతవరకు అధిగమించవచ్చు. కానీ ఇద్దరి మధ్య అవగాహన లేకపోవడం మూలంగా ఖర్చు విషయంలో పొదుపు చర్యలు పాటించే ప్రయత్నం చేయడం లేదు. పిల్లల అల్లరి మూలంగా భార్య, భర్తలు గొడవలు పడుతుంటారు. పిల్లలు అల్లరి చేస్తే తల్లిగానీ, తండ్రి గాని వారిని సర్ధిచెప్పే ప్రయత్నం చే యకుండా, రెండు మూడు దెబ్బలు తగిలిస్తున్నా రు. పిల్లల్ని అలా కొడతావా అంటూ గొడవ పడ డం కనిపిస్తోంది. ఇలాంటి చిన్న చిన్న అంశాలు వా రి మధ్య ఘర్షణలకు కారణమవుతున్నాయి.  

అనాథలుగా చిన్నారులు..
కుటుంబ కలహాలు ఒక్కోసారి హత్యలకు దారితీస్తున్నాయి. అలాగే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇరువురి మధ్య విభేదాలు పెరిగి ఆవేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఫలితంగా జైలుపాలై, పిల్లలు అనాథలుగా మారాల్సి వస్తోంది. ఇంట్లో తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా పిల్లలు అనాథలుగా మారాల్సి వస్తోంది. చేయని నేరానికి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలకు కారణమైన వారు పోలీసు కేసుల్లో జైలుపాలై ఆర్థికంగా, మానసికంగా దెబ్బతింటున్నారు. 

సర్దుకుపోయే తత్వం ఏది..? 
భార్య, భర్తల మధ్య తలెత్తుతున్న చిన్నచిన్న గొడవలను పరిష్కరించుకోవడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగవచ్చు. కానీ చాలా మంది పంతాలు, పట్టింపులకు వెళ్లి రోడ్డున పడుతున్నారు. చాలావరకు ఎవరో ఒకరు తగ్గితే సర్దుకుపోయే అవకాశం ఉన్నా ఇద్దరూ తప్పు నీదంటే తప్పు నీదంటూ ఒకరికొకరు గొడవ పడుతున్నారు. ఫలితంగా ఇబ్బందులపాలై సమాజంలోనూ చులకన అవుతున్నారు. అర్థం చేసుకుంటే జీవితం అన్యోన్యంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. 

మరిన్ని వార్తలు