‘చౌక ట్రూనాట్‌ కిట్‌’కు ఇన్ఫోసిస్‌ పురస్కారం!

3 Dec, 2021 01:58 IST|Sakshi
చంద్రశేఖర్‌ నాయర్‌ 

ఆరు విభాగాల్లో అవార్డులు

ఒక్కో అవార్డుకు రూ.50లక్షల నగదు

సాక్షి, హైదరాబాద్‌: మోల్‌బయో డయాగ్నాస్టిక్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్‌ నాయర్‌ ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్‌ అవార్డు దక్కించుకున్నారు. ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలను సులభతరం చేయడంతోపాటు అత్యంత చౌకగా చేసే ట్రూనాట్‌ ఆర్‌టీపీసీఆర్‌ కిట్‌ను తయారు చేసినందుకు ఈ అవార్డు వచ్చింది. 2021 సంవత్సరానికిగాను ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ఈయనకు దక్కగా హ్యుమానిటీస్‌ విభాగంలో డాక్టర్‌ ఆంజెలా బెరాటో జేవియర్‌ అవార్డు అందుకున్నారు. జీవవైవిధ్యం, వాతావరణ మార్పుల రంగంలో కృషి చేస్తున్న మహేశ్‌ శంకరన్‌కు జీవశాస్త్ర విభాగపు అవార్డు లభించింది.

గణితశాస్త్రంలో నీరజ్‌ కయాల్‌ (మైక్రోసాఫ్ట్‌ బెంగళూరు)ను అవార్డుకు ఎంపిక చేశారు. అణుశక్తి రంగంలో పరిశోధనలు చేస్తున్న బేదాంతదాస్‌ మహంతిని భౌతికశాస్త్ర విభాగంలో ఇన్ఫోసిస్‌ అవార్డు వరించింది. లింగ వివక్షపై పరిశోధనలు చేస్తున్న ప్రతీక్ష బక్షీని సామాజిక శాస్త్ర రంగంలో అవార్డుకు ఎంపిక చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, సామాజిక, తత్వవేత్తలు అవార్డు ఎంపికకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారని ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌కు చెందిన క్రిస్‌ గోపాలకృష్ణన్‌ గురువారం జరిగిన వర్చువల్‌ మీడియా సమావేశంలో ప్రకటించారు. యువతరానికి ఆదర్శంగా నిలిచే శాస్త్రవేత్తలను గుర్తించే లక్ష్యంతో 2009లో ఇన్ఫోసిస్‌ అవార్డును ప్రారంభించామని, ఒక్కో విభాగానికి రూ.50 లక్షల చొప్పున ఆరు విభాగాల్లో నగదు బహుమతితో అవార్డులు అందిస్తున్నామని వివరించారు. 

మరిన్ని వార్తలు