ఎంబీఏ చదువు, మంచి ఉద్యోగం వదిలి.. పాడితో ఉపాధి!

24 Feb, 2022 08:24 IST|Sakshi

జెర్సీ ఆవులతో ఫాం ఏర్పాటు

నిత్యం 100 లీటర్ల పాల విక్రయం

ఆదర్శం.. లక్ష్మీపూర్‌ యువకుడు

జగిత్యాల అగ్రికల్చర్‌: ఉన్నత చదువులు చదివిన యువకులు వ్యవసాయంతోపాటు పాడి వంటి అనుబంధ రంగాల వైపు వెళ్లేందుకు నామోషీగా ఫీలవుతుంటారు. దీంతో, చాలీచా లని జీతంతో పట్టణాల్లో మగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంబీఏ చదివి, ప్రైవేట్‌ ఉద్యోగాన్ని వదులుకొని, ఉన్న ఊరిలో జెర్సీ ఆవుల ఫాం నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన తీపిరెడ్డి సురేశ్‌రెడ్డి(99893 54414).

ఉరుకుల పరుగుల జీవితం నచ్చక..
సురేశ్‌రెడ్డి ఎంబీఏ పూర్తయ్యాక రెండేళ్లు హైదరాబాద్‌లో ఉద్యోగం చేశాడు. కానీ ఉరుకుల పరుగుల జీవితం అతనికి నచ్చలేదు. దీంతో వ్యవసాయం చేద్దామని ఇంటికి వచ్చాడు. కానీ చదువుకున్నది వ్యవసాయం చేయడానికి కాదు.. ఏదో ఒక ఉద్యోగం చూసుకో అని తల్లితండ్రులు ముఖం మీదే చెప్పేశారు. అయినప్పటికీ తనకున్న పట్టుదల, ధైర్యంతో మొండిగా ఆవుల ఫాం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నాడు. స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకొని, తమకున్న వ్యవసాయ భూమిలోనే 5 జెర్సీ ఆవులతో ఫాం ప్రారంభించాడు.

ప్రస్తుతం 25 ఆవులున్నాయి..
ఫాంలో ప్రస్తుతం 25 జెర్సీ ఆవులు, 10 దూడలున్నాయి. పాలు పితికేందుకు సురేశ్‌రెడ్డి ఇద్దరు బిహార్‌ కూలీలను నియమించుకున్నాడు. ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫాంలోనే ఉంటూ ఆవులను స్వయంగా పర్యవేక్షిస్తుంటాడు. వాటికి మేత కోసం, ఎకరంలో పచ్చిగడ్డి వేశాడు. ఉదయం, సాయంత్రం ఆవులకు దాణా పెట్టి, పాలు పితుకుతారు. ఆవులు, దూడల పేడ, మూత్రంతో ఈగలు, దోమలు రాకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాడు.  

లీటర్‌కు రూ.50లకు విక్రయం
ప్రతీరోజు ఉదయం, సాయంత్రం 100 లీటర్ల పాల దిగుబడి సాధిస్తున్నట్లు సురేశ్‌రెడ్డి తెలిపాడు. వీటిలో 30 లీటర్లను స్థానిక వినియోగదారులకు లీటర్‌కు రూ.50 చొప్పున పోస్తున్నాడు. మిగిలిన పాలను పాల డిపోకు తీసుకెళ్తున్నాడు. అక్కడ పాలల్లో వెన్న శాతాన్ని బట్టి లీటర్‌కు రూ.30 నుంచి రూ.33 వరకే ఇవ్వడం వల్ల ఆదాయానికి గండి పడుతోంది. అలా కాకుండా వినియోగదారులు పెరిగితే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉందంటున్నాడు. దాణా రేట్లు ఏడాదిలో రెట్టింపు కావడం వల్ల ఫాం నిర్వహణ ఖర్చులు పెరిగాయి. దీనికితోడు, ప్రభుత్వం ఇస్తామన్న లీటర్‌కు రూ.4 ఇన్సెంటివ్‌ రూ.2 లక్షలు రెండేళ్లుగా  అందక కొంత ఇబ్బందిగా ఉందని చెబుతున్నాడు. 

ఎండుగడ్డి సేకరణ
పాడి పశువులకు మేత ప్రధానం. ఓవైపు పచ్చిమేత ఇస్తూనే, మరో వైపు ఎండుగడ్డిని ఓ పూట వేస్తుంటారు. ఇందుకోసం సురేశ్‌రెడ్డి వరి పొలాల సమయంలో వరి గడ్డిని కట్టలు కట్టించి, షెడ్డులో నిల్వ చేస్తున్నాడు. రూ.వేలకు వేలు పెట్టి, కొత్తగా పాడి పశువులను కొనుగోలు చేయకుండా, ఆవులకు పుట్టిన పిల్లలకే సమీకృత దాణా ఇస్తూ త్వరగా ఎదిగేలా చేస్తున్నాడు.

జగిత్యాలలో షాప్‌ పెట్టాలనుకుంటున్న
జెర్సీ ఆవుల ఫాం ప్రారంభించాక మొదట్లో ఎన్నో కష్టనష్టాలు చూశా. కానీ ఏనాడూ అధైర్యపడలేదు. ఫాంని మరింత లాభాల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్న. జగిత్యాలలో వినియోగదారుల కోసం షాప్‌ పెట్టాలనుకుంటున్న. దాణా రేట్లు తగ్గితే ఆదాయం బాగుంటుంది.      
– తీపిరెడ్డి సురేశ్‌రెడ్డి, పాడి రైతు, లక్ష్మీపూర్‌


     

మరిన్ని వార్తలు