Inspirational Stories: పేదింట్లో వైద్య కాంతులు.. ఆ కల వాళ్లని ఇంత వరకు నడిపించింది!

27 Feb, 2022 08:13 IST|Sakshi

కష్టపడి చదివి.. ఉచిత సీటు సాధించి..  

వైద్య వృత్తిలోకి నిరుపేద కుటుంబాల విద్యార్థులు

స్ఫూర్తిగా నిలుస్తున్న విద్యా కుసుమాలు

సాక్షి,మల్యాల(చొప్పదండి): నిరుపేద కుటుంబాల విద్యార్థులు చదువులో సత్తాచాటి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా సీటు సాధించి తమ కలలను సాకారం చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా లక్ష్యసాధనకు నిరంతరం తపించారు. దీంతో కోట్లాది రూపాయల విలువైన వైద్య విద్య వారి దరికి చేరింది. కష్టసుఖాలు.. తాము అనుభవించిన పేదరికాన్ని పిల్లలు అనుభవించకూడదనే తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా.. సమాజానికి సేవ చేసే ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనే తమ కలలను నెరవేర్చుకున్నారు. పేదరికాన్ని రుచి చూస్తూ పెరిగిన పిల్లలు వైద్య వృత్తి బాటలో పయనిస్తూ నిరుపేదలకు చేయూతనందిస్తామంటున్నారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. 
మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బింగి నర్సయ్య– మంజుల కూతురు మనీషా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వైద్య విద్యవైపు అడుగులు వేసింది. తండ్రి బట్టల వ్యాపారి, తల్లి బీడీ కార్మికురాలు. నూకపల్లి మోడల్‌స్కూల్‌లో పదో తరగతిలో 9.8 జీపీఏ, ఇంటర్‌లో 985 మార్కులు సాధించింది. తండ్రి గ్రామాల్లో తిరుగుతూ బట్టల వ్యాపారం, మరోవైపు టైలరింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కూతురు మనీషా ఈ ఏడాది నీట్‌లో 543 మార్కులు సాధించి వైద్యురాలిగా తన కల నెరవేర్చుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది. చిన్న కూతురు అనూషను సైతం నీట్‌ కోసం సిద్ధం చేస్తున్నారు.

Bingi Manisha Inspirational Story

విరిసిన దళిత కుసుమం.. 
మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబం పద్మ–గంగయ్యల ఒక్కగానొక్క కూతురు నిఖిత. తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి ఉపాధి కోసం గల్ఫ్‌బాట పట్టాడు. ఆది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివింది. పదో తరగతిలో 9.3 జీపీఏ, ఇంటర్‌లో 953 మార్కులు సాధించింది. గతేడాది వైద్య విద్యలో సీటు సాధించి డాక్టర్‌ కావాలనే కలను నెరవేర్చుకుంది. వైద్య విద్య అడ్మిషన్‌కు కూడా డబ్బులు కట్టలేని స్థితిలో నిఖితకు “సాక్షి’ తోడుగా నిలవగా.. డాక్టర్‌ కావాలనే కల సాకారం చేసుకుంది.  తనలాంటి పేద విద్యార్థులకు చేయూతనందిస్తానని, నిరుపేదలకు ఉచితంగా సేవలందిస్తానని నిఖిత చెబుతోంది.

తండ్రి కల నెరవేర్చిన తనయ 
మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన పన్నాటి మల్లేశం కూతురు అలేఖ్య. గ్రామంలో రెండు దశాబ్దాలుగా మల్లేశం ఆర్‌ఎంపీగా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య గీత బీడీ కార్మికురాలు. తన కూతురును డాక్టర్‌ చేయాలనే తండ్రి ఆశయానికి తోడు తనయ కష్టపడి చదివి ఉస్మానియాలో ఉచితంగా సీటు సాధించింది. పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్‌లో 988 సాధించింది. మూడేళ్లక్రితం ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు సాధించి, తండ్రి ఆశయాన్ని, తన కలను నెరవేర్చుకుంది.

ఆది నుంచి ముందువరుసలో..  
మల్యాల మండల కేంద్రానికి చెందిన బండారి అశోక్‌ రెండు దశాబ్దాలుగా ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. డాక్టర్‌ కావాలంటూ చిన్నప్పటి నుంచి తన కుమారుడు గాయత్రినందన్‌కు బీజాలు నాటాడు. తండ్రి మాటలకు అనుగుణంగా గాయత్రినందన్‌ డాక్టర్‌ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆదినుంచి ప్రణాళికతో చదివి పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్‌లో 988 మార్కులు సాధించాడు. ఎలాంటి కోచింగ్‌ లేకుండానే నీట్‌లో 583 మార్కులు సాధించి ఇటీవలే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉచితంగా సీటు సాధించాడు.

మట్టి పరిమళం కల్పన 
మల్యాల మండలం సర్వాపూర్‌ గ్రామానికి చెందిన మిర్యాల మల్లారెడ్డి– వనిత దంపతులది వ్యవసాయ కుటుంబం. డాక్టర్‌ కావాలనే కూతురు కల్పన కలకు బాసటగా నిలిచారు. చదువుకోసం వ్యవసాయ భూమి అమ్మేందుకుసైతం వెనకాడబోమని భరోసానిచ్చారు. తల్లిదండ్రుల భరోసాతో కల్పన మరింత కష్టపడి చదివింది. పదో తరగతిలో 10జీపీఏ, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 436/440 మార్కులతో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకులో నిలిచింది. అదే ఉత్సాహంతో ఇంటర్‌లో 986 మార్కులు సాధించింది. కష్టపడి చదివి ఉచితంగా వైద్య కళాశాలో సీటు సాధించి ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతోంది. గ్రామంలో నెట్‌వర్క్‌ లేకపోతే చదువుకు ఆటంకం కలుగవద్దని నేరుగా శ్మశానంలో కూర్చుండి కూడా ఆన్‌లైన్‌ తరగతులు వింటూ చదువును కొనసాగించి, డాక్టర్‌ కావాలనే తనలోని దృఢ సంకల్పాన్ని చాటి చెప్పింది. 

మరిన్ని వార్తలు