Telangana: పరిహారం.. ఇంకెప్పుడు?

27 Aug, 2021 02:08 IST|Sakshi

రైతులకు రెండేళ్ల పరిహారం రూ.933.90 కోట్లు చెల్లించకుండా నిలిపివేసిన బీమా కంపెనీలు 

రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియం రూ.450 కోట్లు చెల్లించని ఫలితం

కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టీకరణ .. వ్యవసాయ శాఖ వర్గాల ధ్రువీకరణ

కేంద్రం, రైతులు తమ వాటా మొత్తాలు చెల్లించినా ప్రయోజనం శూన్యం

పంటలు నష్టపోయిన 17.41 లక్షల మంది ఎదురుచూపులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలు పరిహారం అందకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వంతు ప్రీమియం చెల్లించినా రెండేళ్ల పరిహారం అందలేదని వాపోతున్నారు. 2018–20 కాలంలో రైతులకు చెల్లించాల్సిన రూ.933.90 కోట్ల పరిహారాన్ని బీమా కంపెనీలు చెల్లించకుండా నిలిపివేయడమే దీనికి కారణం. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా పంటల బీమా ప్రీమియం చెల్లించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. రెండేళ్లకు సంబంధించి రూ.450 కోట్ల ప్రీమియం మొత్తాన్ని సర్కారు చెల్లించలేదని తెలుస్తోంది. చదవండి: 22వ శతాబ్దంలో నివేదిక ఇస్తారా? 

2018–19లో అరకొర చెల్లింపులు
ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. వానాకాలం, యాసంగి సీజన్లకు కలిపి ఏటా బీమా కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తుంది. ఆ మేరకు టెండర్లు పిలుస్తుంది. ఇలా 2018–19లో అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (ఏఐసీ), బజాజ్‌ అలియాంజ్, టాటా ఏఐజీలు పీఎంఎఫ్‌బీవై పథకం అమలులో పాలుపంచుకున్నాయి. 2019–20లో ఏఐసీ, ఇఫ్కో టోకియో బీమా టెండర్లు దక్కించుకున్నాయి. 2018–19 సంవత్సరంలో తెలంగాణలో 7.9 లక్షల మంది రైతులు పీఎంఎఫ్‌బీవై పథకం కింద బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించారు. ప్రభుత్వాల వాటాతో కలిపి రైతులు కంపెనీలకు రూ.532.61 కోట్ల ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.190.71 కోట్లు కాగా అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం చెల్లించినా, రాష్ట్ర ప్రభుత్వం రూ.55 కోట్లు మాత్రమే చెల్లించినట్టు సమాచారం. ఇలా కొద్ది మొత్తమే ప్రీమియం చెల్లించి రూ.135.71 కోట్లు పెండింగ్‌లో పెట్టడంతో బీమా కంపెనీలు కేవలం 59 వేల మంది రైతులకు రూ.112.01 కోట్లు పరిహారం కింద చెల్లించాయి. రూ.413 కోట్ల పరిహారాన్ని పెండింగ్‌లో పెట్టాయి. ఆ సొమ్ము కోసం 7.31 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు.  చదవండి: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం


2019–20లో పైసా ఇవ్వలేదు .. రాలేదు
ఇక 2019–20 సంవత్సరంలో రాష్ట్రంలో 10.10 లక్షల మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ. 866.67 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.314.83 కోట్లు చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో ఆ ఏడాదికి సంబంధించి ఏకంగా రూ.520.90 కోట్ల పరిహారం రైతులకు అందలేదు. మొత్తంగా ఈ రెండేళ్ల కాలంలో తెలంగాణలో 17.41 లక్షల మంది రైతులకు రూ.933.90 కోట్ల పరిహారం నిలిచిపోయిందని కేంద్రం ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. 2019–20 సంవత్సరంలో దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 23,645 కోట్ల పంటల బీమా పరిహారం అందగా, తెలంగాణ రైతులకు ఒక్క పైసా అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

సొంత పథకమూ లేదు
బిహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్‌ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ పథకం స్థానంలో తమ సొంత  పథకాలను ప్రారంభించాయి. ఏపీ కూడా కేవలం రూపాయి  ప్రీమియంతో ఉచితంగా కేంద్ర పథకా న్ని అమలు చేస్తోంది. కానీ తెలంగాణ ఎలాంటి పథకం చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రైతుబంధు ఇస్తున్నందున పంట నష్ట పరిహారం ఎందుకని కొందరు అధికారులు వాదించడంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


పీఎంఎఫ్‌బీవై నుంచి వైదొలిగిన తెలంగాణ
పీఎంఎఫ్‌బీవై పథకం 2016–17లో ప్రారంభమైంది. టెండర్లలో ఖరారు చేసిన ప్రీమియం సొమ్ములో రైతులు వానాకాలం పంటలకు గరిష్టంగా 2 శాతం, యాసంగికి 1.5 శాతం, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాలి. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం కట్టాలి. వడగళ్ల వాన, వరదలు, స్థానిక ప్రమాదాలు, తుపాన్లు, అకాల వర్షాలు, సహజంగా జరిగే అగ్ని ప్రమాదాలు వంటి వాటివల్ల జరిగే పంట నష్టాలకు  ఈ బీమా పరిహారం అందుతుంది.  అయితే 2020 వానాకాలం సీజన్‌ నుంచి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందం చేసింది. ఈ నేపథ్యంలో అనేక కారణాలతో తెలంగాణ ప్రభుత్వం ఆ పథకం రాష్ట్రంలో అమలు చేయకుండా విరమించుకుంది.

అతివృష్టిగా నిర్ధారించినా పరిహారం రాలే..
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కొల్లూరి మోహన్‌రావు. ఇతనిది వరంగల్‌ జిల్లా వెంకటాపురం గ్రామం. ప్రతిఏటా బీమా పథకం కింద పసుపు పంటకు ప్రీమియం చెల్లిస్తున్నాడు. అదే క్రమంలో తనకున్న భూమిలో 2 ఎకరాల పసుపు పంటకు గాను ఏడాది క్రితం రూ.4,200 ప్రీమియం చెల్లించాడు. అదేవిధంగా మూడెకరాల మొక్కజొన్న పంటకు రూ.1200 చొప్పున కట్టాడు. ఆ తరువాత విపరీతంగా వర్షాలు కురిసి పసుపు, మక్క చేలు జాలువారిపోయాయి. వ్యవసాయ అధికారులు వచ్చి  పంటలను పరిశీలించి అతివృష్టి ప్రభావంతో నష్టం జరిగిందని నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. కానీ నేటికీ బీమా పరిహారం అందలేదు. పంటతో పాటు బీమా ప్రీమియం డబ్బులు కూడా నష్టపోయానని మోహన్‌రావు వాపోతున్నాడు.

పరిహారం రాలేదు
నేను 2018లో ఒక ఎకరం భూమిలో మిర్చి పంట, మరో ఎకరంలో వరి సాగు చేశా. మిర్చికి రూ.2,500, వరికి రూ.1,600 బీమా ప్రీమియం చెల్లించాను. ఆ ఏడాది వర్షాల వల్ల రెండు పంటలూ దెబ్బతిన్నాయి. అయినా ఇప్పటివరకు నాకు ఎలాంటి పరిహారం రాలేదు.
– మేక దామోదర్‌ రెడ్డి, కురవి, మహబూబాబాద్‌ జిల్లా 

ప్రభుత్వం ఆదుకోవాలి
2019లో మొత్తం నాలుగు ఎకరాల్లో సోయా పంట వేశా. కాత చాలా బాగా వచ్చింది. సరిగ్గా కోత కోసి కుప్పలు వేసిన రోజునే వర్షం కురిసింది. దీంతో చేన్లోని కుప్పలు మొత్తం తడిసిపోయాయి. వరుసగా మూడు రోజులు ముసురు కమ్ముకోవడంతో చేతికి వచ్చిన పంట పూర్తిగా నాశనం అయిపోయింది. అయినా ఇప్పటివరకు ఎలాంటి బీమా పరిహారం అందలేదు. ప్రభుత్వం పరిహారం అందేలా చేసి ఆదుకోవాలి.
–ఎల్టి రాంరెడ్డి, ఖాప్రి, ఆదిలాబాద్‌ జిల్లా 

పంట నష్టం అంచనా వేసినా..
నాకు 8 ఎకరాల భూమి ఉంది. ఏడాది క్రితం సోయా, పసుపు పంటల కోసం ఎకరానికి రూ.1,500 వరకు బీమా ప్రీమియం చెల్లించాను. సోయా పంట పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ బీమా వర్తించలేదు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి నివేదిక సమర్పించారు. అయినా ఇప్పటివరకు నయాపైసా పరిహారం అందలేదు. పంటలకు బీమా చేస్తే మంచిదనుకున్నా. కానీ వృథా అయిపోయింది. 
– కుంట రవిశంకర్, పాలెం, నిజామాబాద్‌ జిల్లా 

మరిన్ని వార్తలు