గోదావరి తీరంలో నక్సల్స్‌!

28 Jul, 2022 01:51 IST|Sakshi
మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు (ఫైల్‌)   

పోలీసులను హెచ్చరించిన ఇంటెలిజెన్స్‌ వర్గాలు

నేటినుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు 

రాష్ట్ర కమిటీ పేరిట కరపత్రాలు, వాల్‌పోస్టర్లు 

మూడు రాష్ట్రాల సరిహద్దులో అప్రమత్తమైన పోలీసులు 

గోదావరి తీరంలో డ్రోన్‌లతో నిఘా

సాక్షిప్రతినిధి, వరంగల్‌: గోదావరి తీరంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు ఉన్నాయా? అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా? తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో నక్సల్స్‌ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందా?.. అంటే నిజమే అంటున్నాయి పోలీసువర్గాలు. ఏటా జరిగే మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నక్సల్స్‌ వివిధ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించినట్లు చెబుతున్నారు.

దీనికి తోడు ఏటూరునాగారం, వెంకటాపూర్‌ ప్రాంతాల్లో బుధవారం మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేరిట కరపత్రాలు, వాల్‌పోస్టర్లు కనిపించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి తీరంలో డ్రోన్‌లతో నిఘా ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం సరిహద్దు అడవుల్లో గ్రేహౌండ్స్‌ బలగాలను మోహరించారు.  

ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు.. 
మావోయిస్టు పార్టీ ప్రతి ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఉద్యమంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8,700 మందికి పైగా తమ సభ్యులు మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఇటీవల సంవత్సరాల్లో కరోనా, కోవర్టుల కారణంగా ఆ పార్టీ పలువురు ఉద్యమకారులను కోల్పోయింది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు కరపత్రాల్లో ప్రకటించింది. దీంతో పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దులో నిఘా పెంచారు.  

అగ్రనేతల మరణం.. కోలుకోలేని నష్టం..  
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా నక్సల్స్‌పై ప్రభుత్వాల వైఖరి మారలేదు. 2020–22 సంవత్సరాల్లో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అగ్ర నాయకులతోపాటు మొత్తం 173 మంది నక్సల్స్‌ మరణించారు. ఓ వైపు పోలీసు ఎన్‌కౌంటర్లు, మరోవైపు కరోనా.. మావోయిస్టు పార్టీ కీలక నేతలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు తప్పకుండా నిర్వహించాలని పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించిన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల ఉన్నతాధికారులు.. అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు