ఇప్పుడే ‘ఎన్నికల’ బదిలీలు!

15 Apr, 2022 04:37 IST|Sakshi

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మార్పునకు రంగం సిద్ధం 

మరో సీనియర్‌ ఐపీఎస్‌ను నియమించే అవకాశం 

హైదరాబాద్‌ మినహా కమిషనర్ల మార్పు కూడా.. 

డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ!

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం గా పోలీసుశాఖలో బదిలీలకు కసరత్తు జరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా అధికారుల ప్రొఫైల్స్‌ను ఇంటెలిజెన్స్‌ విభాగం వడపోస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇటు నేతలకు ఇబ్బందిలేకుండా, అటు ఎన్నికల కోడ్‌ సందర్భంగా ఈసీ వేటు పడకుండా ఉండేలా అధికారుల జాబితాపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ రెండేళ్లపాటు వారిని కదిపే అవసరం రాకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారని అధికారవర్గాలు చెప్తున్నాయి. 

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బదిలీ కూడా.. 
రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ చాలా ముఖ్యమైన అధికారి. రాష్ట్రంలోని అన్ని విభాగాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఆ పార్టీ నేతల కదలికలు వంటి విషయాలను ప్రభుత్వానికి చేరవేయడంలో వారే కీలకం. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను మా ర్చాలని ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత అధికారిస్థానంలో రాజధానిలోని కీలక కమిషనరేట్‌కు బా«ధ్యులుగా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ను నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. 

ఆ కమిషనర్ల మార్పు కూడా.. 
కరీంనగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, సిద్ధిపేట సహా కీలకచోట్ల పోలీస్‌ కమిషనర్లను మార్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. పదోన్నతులు పొందడం, లాంగ్‌ స్టాండింగ్, వివాదాస్పద అంశాలు వంటి కారణాల రీత్యా సంబంధిత అధికారులను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇక సిరిసిల్ల, జగిత్యాల, వనపర్తి, సూర్యాపేట, గద్వాల ఎస్పీలతోపాటు వరం గల్, పెద్దపల్లిలోని డీసీపీలను మార్చనున్నట్టు తెలిసింది. ఆయా కమిషనరేట్లలో శాంతిభద్రతల విభాగంలో అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్న అధికారులను మార్చే కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. 

అటాచ్డ్‌ అధికారులకు జూన్‌లో.. 
రాష్ట్రంలో 20 మందికిపైగా పదోన్నతి పొంది వెయిటింగ్, అటాచ్‌మెంట్, లుక్‌ ఆఫ్టర్‌ ఆదేశాలతో ఉన్న ఐపీఎస్‌ అధికారులకు జూన్‌ తొలి వారంలో పోస్టిం గ్‌ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జోన్లు, అదనపు సీపీలు, ఇంటెలిజెన్స్, సీఐడీ, ఏసీబీ, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖ తదతర విభాగాల అధికారులను కూడా బదిలీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. వీరిలో కొందరిని కమిషనర్లుగా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

ఇన్‌స్పెక్టర్లకూ సిఫార్సులు! 
జిల్లాలతోపాటు కమిషనరేట్లలో పనిచేస్తున్న ఎస్‌హెచ్‌వోలు (ఇన్‌స్పెక్టర్లు), సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల బదిలీ లు సైతం ఎన్నికలే లక్ష్యంగా జరగనున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్, సబ్‌ఇన్‌స్పెక్టర్లను ఇప్పటినుంచే ఎంచుకుని పోస్టింగ్‌ ఇప్పించుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇలా సిఫార్సుల కోసం ఇతర జిల్లా లేదా ఇతర రేంజ్‌ పరిధిలో పనిచేసిన వారిని ఎంచుకోవాలని సూచనలు వచ్చినట్టు తెలిసింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమిషనరేట్లు, జిల్లా యూనిట్లలో ఎలక్షన్‌ కమిషన్‌ కొందరు అధికారులను బదిలీ చేసింది. ఈసారి అలా జరగకుండా ఉండేందుకే.. స్థానికత, వివాదాలు, పనితీరు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సిఫార్సులు చేయాలని సూచనలు వచ్చినట్టు సమాచారం. వచ్చే నెలాఖరు నాటికి కసరత్తు పూర్తిచేసి జూన్‌లో బదిలీలు చేపట్టనున్నట్టు సమాచారం.  

మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యత 
  రాష్ట్రంలో డీఎస్పీలు, ఏసీపీల బదిలీలు భారీగా ఉంటాయని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఆరు నెలలుగా బదిలీ కోసం నేతల చుట్టూ తిరుగుతున్న డీఎస్పీ/ఏసీపీలకు జూన్‌ మొదటివారంలో మోక్షం కలుగుతుందని తెలిసింది. డీఎస్పీ పోస్టింగ్‌ విష యంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు పోలీస్‌శాఖలో చర్చ జరుగు తోంది. ఆయా జిల్లాల్లో ఎక్కువకాలం పనిచేయనివారు, వివాదాలు లేని అధికారులకే సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. పోస్టింగ్‌ల కోసం ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సులపై ఇంటెలిజెన్స్‌లో అధికారులు పరిశీలన చేస్తారని, సంబంధిత అధికారి పూర్తి ప్రొఫైల్‌ను పరిశీలించాకే పోస్టింగ్‌కు ఆదేశాలు వెలువడతాయని సమాచారం.

మరిన్ని వార్తలు