ఇంగ్లిష్‌–1 బండిల్‌లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు!

10 May, 2022 08:00 IST|Sakshi

కోదాడ జూనియర్‌ కళాశాలలో వెలుగులోకి..

చివరి నిమిషంలో గమనించిన నిర్వాహకులు      

ఇతర సెంటర్ల నుంచి తెప్పించి గంటన్నర ఆలస్యంగా పరీక్ష 

కోదాడ (సూర్యాపేట): ఇంటర్‌ ఇంగ్లిష్‌–1 ప్రశ్నపత్రాల బండిల్‌ లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు దర్శనమిచ్చాయి. ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాలని భావించి పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లిన తర్వాత.. తెరిచి చూస్తే కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు బయటపడటంతో అధ్యాపకులు బిత్తరపోయారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచన మేరకు జిల్లాలోని వివిధ సెంటర్లలో మిగిలిపోయిన ప్రశ్నపత్రాలను తెప్పించారు.

గంటన్నర ఆలస్యం గా 10:30 గం.కు విద్యార్థులకు పరీక్ష ప్రారంభించి 1:30 గం.కు ముగించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలోని సిటీ సెంట్రల్‌ జూనియర్‌ కళాశాలలో సోమవారం చోటుచేసుకుంది. అధికారులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ లోని 243 మంది విద్యార్థులు ఇక్కడ ఇంగ్లిష్‌–1 పరీక్ష రాయాల్సి ఉంది. ఈ మేరకు కోదాడ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రశ్నపత్రాలను కస్టోడియన్స్‌ నుంచి తీసుకొని కళాశాల వద్దకు వెళ్లి తెరిచి చూడగా విష యం బయటపడింది.

దీంతో బల్క్‌ సెంటర్‌ నల్ల గొండ నుంచి ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రాలు తీసుకురావడం ఆలస్యం అవుతుందని భావించిన జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం.. సమీప సెంటర్లలో విద్యార్థులకు ఇవ్వగా మిగిలిన ప్రశ్న పత్రాలను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రాలు ఎలా మారాయన్న దానిపై బోర్డు అధికారులు నోరు విప్పడం లేదు. బోర్డు నుంచి ఇంటర్‌ ప్రశ్నపత్రాలు తక్కువగా వచ్చాయని ఇంటర్‌ బోర్డు జిల్లా అధికారి ప్రభాకర్‌రెడ్డి చెప్పడం గమనార్హం.   

మరిన్ని వార్తలు