దూకుడు పెంచిన ఇంటర్‌ బోర్డు.. కాలేజీలపై చర్యలకు సిద్ధం!

9 Mar, 2023 07:09 IST|Sakshi

ప్రైవేటు ఇంటర్‌ కాలేజీల ఆగడాలపై బోర్డు సీరియస్‌

విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్న కళాశాలల వివరాలు జిల్లాలవారీగా సేకరణకు ఆదేశం

ఆయా కాలేజీలకు సహకరించిన అవినీతి అధికారులపైనా చర్యలకు రంగం సిద్ధం

నివేదికలు అందాక కొన్ని కాలేజీలపై వేటు!

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఇంటర్‌ కాలేజీలపై ఇంటర్‌ బోర్డు దూకుడు పెంచింది. ప్రతి కాలేజీకి సంబంధించిన వ్యవహారాలపై నివేదికలు తెప్పించుకోనుంది. వాటి పరిశీలన బాధ్యతను జిల్లా ఇంటర్‌ అధికారులకు అప్పగిస్తోంది. పరీక్షలు దగ్గపడుతున్న నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు బోర్డు అప్రమత్తమైనట్లు అధికారులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాలేజీలను అదుపు చేయాలన్నదే అసలు ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ సీరియస్‌గా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అన్ని జిల్లాల నుంచి నివేదికలు అందాక కొన్ని కాలేజీలపై వేటు తప్పదని తెలుస్తోంది. 

విద్యార్థులను వేధించే కాలేజీలపై ఆరా..
రాష్ట్రవ్యాప్తంగా 1,856 ప్రైవేటు ఇంటర్‌ కాలేజీలు ఉండగా చాలా కాలేజీల్లో బోధన విధానం కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతర్గత పరీక్షల ద్వారా విద్యార్థులను కేటగిరీలుగా చేసి కొన్ని సెక్షన్ల విద్యార్థుల్లో మానసిక ధైర్యం కోల్పోయేలా చేస్తున్నారని తెలుసుకున్నారు. అలాంటి కాలేజీలు అనుసరిస్తున్న విధానాలు ఏమిటనే సమాచారం సేకరిస్తున్నారు. మెరిట్‌ ఉన్న విద్యార్థులకు ఒక తరహా ఫ్యాకల్టీ, వెనకబడ్డ వారికి నాణ్యత లేని ఫ్యాకల్టీతో బోధన చేస్తున్న కాలేజీలపైనా దృష్టి పెట్టాలని జిల్లా అధికారులు ఆదేశాలు వెళ్లాయి. మార్కులు తక్కువ వస్తున్న విద్యార్థులను మానసికంగా వేధించడం, ఇతర కాలేజీల నుంచి పరీక్షలు రాయించే చర్యలపైనా ఫిర్యాదులున్నాయి. వాటిని పరిశీలించాలని బోర్డు ఆదేశించింది.

వాటిపై మరింత దృష్టి..
- అకాడమీల పేరుతో విద్యార్థులను చేర్చుకోవడం బోర్డు నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ కొన్ని కాలేజీలు ఆయా విద్యార్థులను ఇతర కాలేజీల పేరిట పరీక్షలు రాయిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో ఏ కాలేజీ ద్వారా ఏ అకాడమీ విద్యార్థుల చేత పరీక్షలు రాయిస్తున్నారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
- చాలా ప్రైవేటు కాలేజీలపై గతంలో అవకతవకల ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోకుండా అడ్డుకున్న అధికారులెవరు? వారికి సహరించిన యాజమాన్యాలు, వ్యక్తులు ఎవరు? ఈ తంతు లో ఎంత మేర ముడుపులు చేతులు మారాయి? అనే వివరాలనూ తెలుసుకుంటున్నారు.
- కొన్నేళ్లుగా కొందరు బోర్డు అధికారులు, కొన్ని కాలేజీల యాజమాన్యాల మధ్య మధ్యవర్తిత్వం వహించిన వారి ప్రమేయం, సాగించిన అవినీతి కార్యకలాపాలపై సమగ్ర నివేదికను రూపొందిస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి..
విద్యార్థులకు నష్టం కలిగించే కాలేజీలపై కొరడా ఝళిపించాలి. ర్యాంకుల కోసం విద్యార్థులను వేధిస్తున్న, నిబంధనలను అతిక్రమిస్తున్న కాలేజీలపై కఠిన చర్యల విషయంలో బోర్డు చిత్తశుద్ధితో వ్యవహరించాలి.
– గౌరీ సతీశ్‌ (ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు)

అవినీతి అధికారులను తొలగించాలి
 విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ ర్యాంకులతో ప్రచారం చేసుకుంటున్న కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల ఆగడాల వెనుక కొందరు బోర్డు అధికారుల ప్రమేయం ఉంది. అవినీతికి పాల్పడుతూ ఆయా సంస్థలను వెనకేసుకొచ్చిన అధికారులను గుర్తించి తొలగించాలి.
– మాచర్ల రామకృష్టగౌడ్‌ (తెలంగాణ ఇంటర్‌ విద్య పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్‌)

మరిన్ని వార్తలు