ప్రియురాలికి హాయ్‌ చెప్పాడని.. మరోసారి వీడు నీ జోలికి రాడంటూ

19 May, 2022 06:43 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

బంజారాహిల్స్‌: తన ప్రియురాలికి హాయ్‌ చెప్పాడనే కోపంతో ఓ ఇంటర్‌ విద్యార్థి తన స్నేహితులతో కలిసి పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్‌ చేసి మూసీ పరిసరాలకు తీసుకెళ్లి చితకబాదిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్, జ్ఞానిజైల్‌సింగ్‌నగర్‌ బస్తీకి చెందిన  బాలుడు (16) స్థానికంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక(16)తో కొన్ని రోజులుగా మాట్లాడేందుకు ప్రయత్నించడంతోపాటు నువ్వంటే నాకిష్టం అని చెబుతున్నాడు.

కాగా సదరు బాలిక లంగర్‌హౌజ్‌ సమీపంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్థి కాంబ్లే రోహన్‌(19)ని ప్రేమిస్తోంది. తనను ఒకరు ఇబ్బంది పెడుతున్నారని ఫోన్‌ చేసి రోహన్‌కు చెప్పడంతో ఆగ్రహానికి గురైన రోహన్‌ తన స్నేహితులు సంజయ్, అభిషేక్, నరేష్‌లతో కలిసి మంగళవారం రాత్రి రెండు బైక్‌లపై ఫిలింనగర్‌కు వచ్చాడు. మాట్లాడే పని ఉందని సదరు బాలుడిని వెంకటేశ్వర హోటల్‌ చౌరస్తా వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తమ బైక్‌పై ఎక్కించుకున్న రోహన్, సంజయ్‌ లంగర్‌హౌజ్‌ సమీపంలోని బాపూఘాట్‌ వెనుకాల ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్లారు.

చదవండి: (పుట్టిన రోజున ముస్తాబై.. సాయంత్రం బర్త్‌ డే పార్టీ ఇస్తానని..)

తన లవర్‌ జోలికి వస్తే అంతు చూస్తానంటూ హెచ్చరించిన రోహన్‌ అతడిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయడమేగాక ఆగకుండా తన లవర్‌ జోలికి రానంటూ చెప్పాలంటూ వీడియోలు తీశారు. రక్తసిక్తమైన బాలుడితో సెల్ఫీ దిగి తన లవర్‌కు పంపుతూ మరోసారి వీడు నీ జోలికి రాడంటూ ఫోన్‌ చేసి చెప్పాడు. అనంతరం అతడిని బైక్‌పై ఎక్కించుకొని బాపూఘాట్‌ వద్ద రోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి తన స్నేహితుడు సంజయ్‌తో కలిసి పరారయ్యాడు. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడికి  చేరుకున్న లంగర్‌హౌజ్‌ పోలీసులు ఆరా తీయగా సంఘటన జరిగిన ప్రాంతం రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలోకి వస్తుందని అక్కడికి వెళ్లాలని సూచించడంతో బాధితుడు అక్కడికి వెళ్లాడు. పోలీసులు అతడిని  స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స చేయించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బుధవారం బంజారాహిల్స్‌ పోలీసులకు పంపించారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిందితులు సంజయ్, రోహన్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.   

చదవండి: (భర్తతో విడాకులు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య)

మరిన్ని వార్తలు