Who Is CV Anand: నగరానికి నయా పోలీస్‌ బాస్‌.. సీవీ ఆనంద్‌ గురించి ఆసక్తికర విశేషాలు..

26 Dec, 2021 09:24 IST|Sakshi

‘సాక్షి’తో నయా కొత్వాల్‌ సీవీ ఆనంద్‌

నగర నయా పోలీస్‌ బాస్‌ సీవీ ఆనంద్‌.. ఇక్కడే పుట్టారు. ఇక్కడే పెరిగారు. ఆదర్శ్‌నగర్‌లో వారి ఇల్లు ఉండేది. అక్కడ నుంచి తరచూ ట్యాంక్‌బండ్‌ మీదకు వెళ్లేవారు. ఆ సందర్భాల్లోనే హుస్సేన్‌సాగర్‌లో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా పని చేస్తున్నప్పుడు 2002లో లేక్‌ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. సాగర్‌ చుట్టూ నిఘా, గస్తీతో పాటు అవగాహన బోర్డులు, తొలిసారిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆత్మహత్యల నివారణలో తనదైన శైలితో ముందుకెళ్లారు.

ప్రస్తుతం సిటీ సీపీగా కొత్త బాధ్యతలతో శాంతిభద్రతల పరిరక్షణకు గట్టిగా కృషిచేస్తానంటున్నారాయన. ప్రజల శ్రేయోభిలాషిగా నిలుస్తానంటున్నారు ఆనంద్‌. సిటీ కమిషనర్‌గా రావడం ఆనందంగా ఉందన్నారు. శనివారం బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఏసీబీ డీజీగా వెళ్తున్న అంజనీకుమార్‌ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఆనంద్‌ ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
– సాక్షి, హైదరాబాద్‌ 

సిటీపై పట్టుంది.. 
నేను సిటీలోనే పుట్టి పెరిగాను. ఇక్కడే చదువుకున్నా. నగరంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈస్ట్‌జోన్‌ డీసీపీ, సెంట్రల్‌ జోన్‌ తొలి డీసీపీగా, ఆపై ట్రాఫిక్‌ విభాగం అదనపు సీపీగా పని చేశా. ఇలా వివిధ హోదాల్లో, వివిధ విభాగాల్లో పని చేసిన నేపథ్యంలో సిటీపై పట్టు ఉంది. ఇటీవల కాలంలో నాలుగైదేళ్లు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై విధులు నిర్విర్తించి తిరిగి వచ్చా. 
చదవండి: కొడుకుల ప్రోత్సాహంతో.. పెళ్లైన 25 ఏళ్లకు మళ్లీ పెళ్లి..!

ట్రాఫిక్‌ నిర్వహణకు ప్రధానం.. 
► పోలీసు విభాగానికి సంబంధించి ప్రతి రోజూ నేరుగా ఎక్కువ మంది ప్రజలతో సంబంధాలు కలిగి ఉండేది ట్రాఫిక్‌ వింగ్‌. వీళ్లు తీసుకునే ప్రతీ చర్యతో  వేలాది మంది వాహనచోదకులు, లక్షలాది నగర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ నిర్వహణకు కీలక ప్రాధాన్యమిస్తాం. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రతకూ పెద్ద పీట వేస్తాం. ఇప్పటికే అమలులో ఉన్న విధానాలను కొనసాగిస్తూ భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయి. 

నేరాల నిరోధానికి యాక్షన్‌ ప్లాన్‌.. 
►ప్రస్తుతం సైబర్‌ నేరాలను నానాటికీ పెరిగిపోతున్నాయి. వీటిని నిరోధించడానికి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయడంతో పాటు కేసుల్ని కొలిక్కి తీసుకురావడానికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తాం. పెట్రోలింగ్‌  వ్యవస్థ, సీసీటీవీ కెమెరాలు, కొత్త టెక్నాలజీతో కేసులను ఛేదిస్తాం. సొత్తు సంబంధిత నేరాలు, చైన్‌ స్నాచింగ్స్‌ నిరోధించేందుకు చర్యలు తీసుకుంటాం. మహిళా భద్రత కోసం ఉన్న షీ–టీమ్స్‌ మరింత బలోపేతం చేస్తాం. 
చదవండి: చలనాల నుంచి తప్పించుకోవాంటే.. మాస్క్‌ ఫర్‌ నంబర్‌ ప్లేట్‌!

►మూడేళ్ల మూడు నెలల పాటు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ పని చేశా. ఆ సందర్భంలో అనేక తీవ్రమైన ప్రమాదాలకు డ్రంక్‌ డ్రైవింగే కారణంగా గుర్తించా. దీని వల్ల వాహనచోదకులతో పాటు ఎదుటి వారికీ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయి.  ట్రాఫిక్‌ విభాగంలో అనునిత్యం అవసరమైన చర్యలు తీసుకుంటాం. 

హైకోర్టు ఆదేశాలకనుగుణంగానే న్యూ ఇయర్‌ వేడుకలు.. 
► ఒమిక్రాన్‌ వేరియంట్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ అంత తీవ్రత లేకున్నా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకలపై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఈ అంశంలో ప్రభుత్వం సూచించిన విధంగా ముందుకు వెళ్తాం.  న్యూ ఇయర్‌ వేడుకలు ప్రతిసారీ వస్తాయి, పోతాయి. కానీ ప్రాణాలు అత్యంత విలువైనవి. ఈ నేపథ్యంలోనే అందరూ కరోనా నిబంధనలు తప్పక పాటించాలి.  

మరిన్ని వార్తలు