మాస్కు మస్ట్‌... ఆలస్యమైన అనుమతించరు

6 May, 2022 07:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ వార్షిక పరీక్షలకు హాజరయ్యే  విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్‌ బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్ష కేంద్రాల్లో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌తోపాటు శానిటైజేషన్‌ కార్యక్రమాలు పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్‌ ఏర్పాట్లు చేసింది. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్‌ గదులు ఏర్పాటు చేశారు.

ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రం ఆవరణలో, బయట నీడ లేకుంటే ప్రత్యేక షామియానాలు  ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంది. విద్యుత్, తాగునీటి సౌకర్యంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం ఆశా వర్కర్స్, ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. డీహైడ్రేషన్‌ నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్ష కేంద్రంలో వాటర్‌ బాటిల్‌ మాత్రమే అనుమతిస్తారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను లోనికి అనుమతించరు. 

ఒక్క నిమిషం నిబంధన అమలు 

  • ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ఈసారీ కూడా ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించకూడదనే నిబంధన విధించారు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. ఉదయం 8 నుంచే పరిశీలించి కేంద్రంలోకి అనుమతిస్తారు.  
  • ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ట్రాఫిక్‌ సమస్య, పరీక్ష కేంద్రం గుర్తింపు సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. టీఎస్‌బీఐఈ ఎగ్జామ్‌ సెంటర్‌ లోకేటర్‌ అనే మొబైల్‌ యాప్‌ ద్వారా పరీక్ష కేంద్రాన్ని సులువుగా గుర్తించవచ్చు. 
  • 3.76 లక్షల మంది విద్యార్థులు..  
  • గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో సుమారు 3.76 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందు కోసం సుమారు 517 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి గదిలో 25 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున 15,048 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ కోసం కేంద్రానికి ఒక్కొక్కరి చొప్పున డిపార్ట్‌మెంట్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెండెట్లను కేటాయించారు. ప్రైవేటు పరీక్ష కేంద్రంలో అదనంగా అసిస్టెంట్‌ చీఫ్‌ సూపరింటెండెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తనిఖీల కోసం సిట్టింగ్‌ స్క్వాడ్, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను కూడా రంగంలోకి దించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో ఉండనున్నాయి. మాస్‌ కాపీయింగ్, అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు.  

(చదవండి: సర్కారు వారి పాట)

మరిన్ని వార్తలు