ఇంటర్‌కు ఇకపై ఒకే హాల్‌టికెట్‌!

24 Oct, 2020 03:10 IST|Sakshi

ఇంటర్మీడియట్‌ బోర్డు కసరత్తు

మార్పులు చేర్పులతో సిలబస్‌ కుదింపు 

ప్రభుత్వానికి ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో వేర్వేరుగా కాకుండా రెండేళ్లూ ఒకే నెంబరుతో హాల్‌టికెట్‌ ఇచ్చే అంశంపై ఇంటర్మీడియట్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. జాతీయ స్థాయి, ఇతర ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలో వేర్వేరు హాల్‌టికెట్‌ నెంబరు ఉండటం వల్ల విద్యార్థులు ఏది ఇవ్వాలనే విషయంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఒక్కోసారి మొదటి సంవత్సరపు హాల్‌టికెట్‌ నెంబరు ఇచ్చి నష్టపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండేళ్లకూ ఒకే నెంబరుతో కూడిన హాల్‌టికెట్లు జారీ చేసేలా ఇంటర్‌ బోర్డు ఆలోచిస్తోంది. వీలైతే వచ్చే ఏప్రిల్‌లో జరిగే పరీక్షలకు ఒకే నెంబరుతో కూడిన హాల్‌టికెట్‌ విధానం అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది.

సిలబస్‌ కుదింపు..
ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ కుదింపుపై బోర్డు తాజా ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. గత ప్రతిపాదనల్లో కొందరు జాతీయ ప్రముఖులు, సంఘ సంస్కర్తలపై పాఠ్యాంశాలు, తెలంగాణ పండుగలు కుదిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభు త్వ ఆదేశాల మేరకు బోర్డు సిలబస్‌ కమిటీని సబ్జెక్టు నిఫుణులతో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ  సిలబస్‌ కుదించే ప్రతిపాదనలు రూపొందించింది. కొన్ని సబ్జెక్టుల్లో 25 శాతం, మరికొన్నింటిలో 30 శాతం పాఠ్యాంశాలు తగ్గించేలా ప్రతిపాదించింది. అలాగే ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ విధానంపైనా బోర్డు చేసిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

వాస్తవానికి ఇంటర్‌లో డిస్క్రిప్టివ్‌ విధానంలోని పరీక్షల్లో విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిలో చాలామందికి ఆబ్జెక్టివ్‌ విధానంలోని ఎంసెట్‌లో మాత్రం తక్కువ మార్కు లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆబ్జెక్టివ్‌ విధానంతో కూడిన ఇం టర్నల్‌ అసెస్‌మెంట్‌పై బోర్డు ఆలోచిస్తోంది. వీటన్నింటిపైనా ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే విధానపర నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. 

>
మరిన్ని వార్తలు