డిజిటల్‌ బోధన షిఫ్ట్‌ విధానం

29 Jul, 2020 02:35 IST|Sakshi

ఇంటర్మీడియట్‌ తరగతుల నిర్వహణపై బోర్డు కసరత్తు

ఒక్కో సెక్షన్‌లో విద్యార్థుల సంఖ్య సగానికి సగం కుదింపు

ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ విద్యా బోధన ప్రారంభంపై ఇంటర్‌ బోర్డు కసరత్తు వేగవంతం చేసింది. ముందుగా డిజిటల్‌ బోధన, ఆపై షిఫ్ట్‌ పద్ధతిలో బోధనను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. నష్టపోయిన పని దినాల సర్దుబాటు, భౌతికదూరం పాటించేలా డిజిటల్, షిఫ్ట్‌ పద్ధతుల్లో ప్రత్యక్ష బోధన, ఒక్కో సెక్షన్‌లో విద్యార్థుల సంఖ్య కుదింపు వంటి అంశాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆమోదముద్ర పడగానే తొలుత డిజిటల్‌ తరగతుల ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది. ఆ తరువాత షిఫ్ట్‌ పద్ధతిలో బోధన చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధంచేస్తోంది. మరోవైపు విద్యా సంవత్సరం ఆలస్యం కారణంగా నష్టపోయిన పని దినాలను సెలవుల రద్దుతో సర్దుబాటు చేయడంతోపాటు 30% సిలబస్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ప్రతిపాదించింది.

డిజిటల్‌ బోధన, తరగతుల నిర్వహణ ఇలా..: ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు క్లాస్‌రూమ్‌లో రెగ్యులర్‌ విద్యాబోధన సాధ్యం కాదు కాబట్టి డిజిటల్‌ విద్యాబోధనకు ఇంటర్‌బోర్డు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డిజిటల్‌ బోధన, వీడియో పాఠాల రూపకల్పనపై ప్రభుత్వ లెక్చరర్లకు శిక్షణ కూడా ఇచ్చింది. ఇప్పటికే పలు డిజిటల్‌ పాఠాలు అందుబాటులో ఉన్నా అవి సమగ్రంగా లేకపోవడంతో ప్రభుత్వ లెక్చరర్లతోనే వీడియో పాఠాల రూపకల్పనకు చర్యలు తీసుకుంటోంది. ఆ పాఠాలను యూట్యూబ్‌లో ఇంటర్మీడియట్‌ బోర్డు చానల్‌లో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు టీశాట్, దూరదర్శన్‌ (యాదగిరి) వంటి చానళ్ల ద్వారా ఒక్కో సబ్జెక్టులో 30 శాతం పాఠాలను బోధించడం, వాటికి 20 ఇంటర్నల్‌ మార్కులిచ్చే విధానాన్ని ప్రతిపాదించింది. 

కరోనా కొంత అదుపులోకి వచ్చాక కూడా కొన్ని నెలలపాటు షిఫ్ట్‌ పద్ధతిలో తరతగతుల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ఒక్కో సెక్షన్‌లో విద్యార్థులు 88 మంది ఉండగా, ఆ సంఖ్యను సగానికి తగ్గించేలా ప్రతిపాదించింది. భౌతికదూరం పాటిస్తూ 44 మందికి మాత్రమే బోధన చేపట్టాలని భావిస్తోంది. మరోవైపు అవకాశం ఉంటే అందులో సగం మందికి ఉదయం, సగం మందికి మధ్యాహ్నం బోధించే అంశాన్నీ పరిశీలిస్తోంది. లేదంటే సెక్షన్‌లోని సగం మందికి ఒక రోజు ఆఫ్‌లైన్‌ బోధన, మరో సగం మందికి డిజిటల్‌ పాఠాలు, మరోవైపు అదే పద్ధతిలో డిజిటల్‌ పాఠాలు, ప్రత్యక్ష బోధన విధానం చేపట్టాలని భావిస్తోంది. లేదంటే మూడ్రోజులు ఫస్టియర్, మరో మూడ్రోజులు సెకండియర్‌ తరగతులు నిర్వహించే అంశంపైనా కసరత్తు చేసింది.
 
కట్టుదిట్టంగా క్లాసులు..
తరగతి గదుల్లో పరిశుభ్రత విషయంలో జాతీయ స్థాయి నిబంధనల్ని పాటించడం, రోజూ తరగతి గదులను శానిటైజ్‌ చేయడం, స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ అమలు, తరగతి గదుల్లో మాస్క్‌ తప్పనిసరి చేయడం, హ్యాండ్‌వాష్‌ వంటి అంశాలను పక్కాగా అమలు చేయడం వంటి అంశాలపై బోర్డు కసరత్తు చేస్తోంది. మరోవైపు వీలైన చోట ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ఆన్‌లైన్‌ బోధనకు అవసరమైన సదుపాయాలు, విద్యార్థులకు ఫోన్లు, డేటా ఉంటే అందుకు అనుగుణంగా ముందుకు సాగే ఆలోచనలు చేస్తోంది. పని దినాలను సర్దుబాటు చేసే క్రమంలో రెండో శనివారాలను రద్దు చేయడం వంటి అంశాలను ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు