TS: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు: ఇప్పటికైతే హ్యాపీ..!

27 Oct, 2021 03:51 IST|Sakshi

ఫస్టియర్‌ పరీక్షలను సులువుగా రాస్తున్న విద్యార్థులు

సిలబస్‌ నుంచే ప్రశ్నలు వస్తుండటంపై ఆనందం

మంచి మార్కులు సాధిస్తామని ధీమా

మున్ముందూ ఇదే మాదిరి ప్రశ్నలు ఉండొచ్చని బోర్డు సంకేతాలు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు సులువుగా ఉండటం విద్యార్థుల్లో జోష్‌ నింపుతోంది. చాలా మంది మంచి మార్కులు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌ పరిధిలోనే ప్రశ్నలుంటున్నాయని చెబుతున్నారు. ఐచ్ఛిక ప్రశ్నలివ్వడం కూడా కలసివస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకపైనా ఇదే మాదిరిగా ప్రశ్నలు ఉంటాయని బోర్డు అధికారులు భరోసా ఇస్తున్నారు. సాదాసీదాగా పరీక్షలు రాసేవారు కూడా పాస్‌ మార్కులు తెచ్చుకోవడం సులభమేనని అధ్యాపకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఐచ్ఛిక ప్రశ్నల్లో సమాధానం ఇచ్చేందుకు వీలుగా బోర్డ్‌ విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌లో పోర్షన్‌ ఉంటోందని వారు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన, కోవిడ్‌ వల్ల సిలబస్‌ పూర్తికాని పరిస్థితులను పరిగణలోనికి తీసుకునే ప్రశ్నపత్రాలు రూపొందించినట్టు అధ్యాపకవర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీలు సైతం ఇప్పటి వరకూ తాము అందించిన స్టడీ మెటీరియల్‌కు బదులు ఇంటర్‌ బోర్డ్‌ మెటీరియల్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కన్పిస్తోంది.

సోమ, మంగళవారాల్లో జరిగిన లాంగ్వేజ్‌ పేపర్లలో ప్రశ్నలు తికమక పెట్టేలా లేవని నిపుణులు చెబుతున్నారు. మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్‌ సబ్జెక్టుల్లో ఈ అవకాశాలుండే వీలుందని కొంత సందేహిస్తున్నారు. అయితే, ఇవి కూడా ఇంచుమించు విద్యార్థులను ఇబ్బంది పెట్టబోవని ఇంటర్‌ బోర్డ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 

ఐచ్ఛికాలతో నెట్టుకొచ్చారు 
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం జరిగిన ద్వితీయ భాష పరీక్షకు 4,30,563 (మొత్తం 4,59,240) హాజరయ్యారు. తాజా ఇంటర్‌ పరీక్షలను 70 శాతం సిలబస్‌ నుంచే ఇస్తున్నట్టు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. ఈమేరకే స్టడీ మెటీరియల్‌ ఇచ్చింది. అయితే, కొన్ని ప్రశ్నలు మాత్రం ఊహించని విధంగా వచ్చాయని తెలుగు సబ్జెక్టు విద్యార్థులు తెలిపారు. చాయిస్‌ ఇవ్వడం వల్ల ఆ ప్రశ్నల వల్ల ఇబ్బంది కలగలేదని చెప్పారు. 30 శాతం ప్రశ్నలు ప్రిపేర్‌ కాని చాప్టర్ల నుంచి వచ్చాయని, వీటిని చాయస్‌గా వదిలేశామని మెజారిటీ విద్యార్థులు ‘సాక్షి’కి తెలిపారు.

తొలిరోజు మాత్రం విద్యార్థులు కొంత ఆందోళనగా కన్పించారు. ఆలస్యంగా పరీక్షలు జరగడం ఒకటైతే, పదవ తరగతి పరీక్షలు రాయకుండా ఇంటర్‌లోకి రావడం మరో కారణంగా అధ్యాపకులు చెబుతున్నారు. పరీక్షలు రాసే అవకాశం చాలా కాలం తర్వాత రావడంతో విద్యార్థుల్లో మొదట ఆందోళన నెలకొందని విశ్లేషిస్తున్నారు. రెండో రోజు మాత్రం ఆ సమస్య కనిపించలేదని ఇన్విజిలేటర్స్‌ పలువురు తెలిపారు. 

ఆత్మవిశ్వాసం పెరిగింది.. 
చాలాకాలం తర్వాత పరీక్షలు రాయాల్సి రావడంతో కొంత ఆందోళన అనిపించింది. బోర్డు మెటీరియల్‌ ఫాలో అవ్వడం, ప్రశ్నపత్రాలు ఐచ్ఛికాలతో ఉండటం వల్ల మొదటి రెండు పరీక్షలు తేలికగా రాశాం. మిగతా పరీక్షలు తేలికగా రాయగలనన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. 
–శశాంక్‌ (విద్యార్థి, దిల్‌సుఖ్‌నగర్‌ పరీక్ష కేంద్రం వద్ద) 

పాసవడం తేలికే.. 
ఇప్పటివరకూ జరిగిన రెండు పేపర్లు గతంకన్నా భిన్నంగా ఉన్నాయి. ఎక్కువ భాగం బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌ నుంచే ప్రశ్నలు వచ్చాయి. విద్యార్థులు ఏమాత్రం దృష్టి పెట్టినా తేలికగా పాసయ్యే వీలుంది. ఇతర సబ్జెక్టుల విషయంలోనూ ఇదే పద్ధతి ఉంటే బాగుంటుంది. 
– జీకే రావు (ప్రైవేటు కాలేజీ లెక్చరర్‌)

మరిన్ని వార్తలు