నారీ శక్తిని చాటి చెప్తున్న మహిళలు

8 Mar, 2021 08:42 IST|Sakshi

‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే, తత్ర దేవతాః‘ అనేది ఆర్యోక్తి.  ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. నిజమే మరి, సమాజంలో స్త్రీకి నేడు ఎంతో ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న మహిళల పట్ల సమాజ దృక్పథం పూర్తిగా మారింది. అలాగే ఆమె పనిచేస్తున్న సంస్థలో భద్రతపై కూడా ప్రభుత్వాలు, ఆయా సంస్థలు బాధ్యత తీసుకొని తగిన రక్షణ కల్పించడానికి చక్కని చర్యలు తీసుకుని ఆమెను తోబుట్టువులా ఆదరిస్తున్నారు. సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర ఎంతో ఉన్నతమైనది. అందుకే స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే గొప్ప అవకాశాలను తామే స్వయంగా నిర్మించుకొని ‘స్త్రీ శక్తి ‘అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెబుతున్నారు.

విద్యా, వ్యాపారం, రాజకీయాలు, వైద్యం, క్రీడలు, టెక్నాలజీ, అంతరిక్షం, బ్యాంకింగ్‌ వంటి పలు రంగాలలో మహిళలు రాణిస్తూ రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని స్త్రీ శక్తిని చాటి చెప్తున్నారు. స్త్రీ మూర్తి అన్నం కలిపి గోరుముద్దలు తినిపించేటప్పుడు తన బిడ్డపై ఉన్న ప్రేమని కూడా కలిపి మరీ తినిపిస్తుంది. ఇంత గొప్పగా ప్రేమామృతాలు కురిపిస్తున్న స్త్రీమూర్తి ఎక్కడ చూసినా వంచనకు గురవుతూనే ఉంది. ఇంటా, బయటా బాధ్యతలు సమతూకం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్న స్త్రీలపై కొంతమంది మృగాళ్లు చేసే దారుణ అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోంది. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వం ఎంత కఠిన చట్టాలు తీసుకొచ్చినా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు మరింత భద్రత కల్పించే విధంగా చక్కని దిశాచట్టాన్ని ప్రవేశపెట్టి దోషికి తక్షణమే శిక్షపడేలా చట్టంలో మార్పులు తెచ్చి మహిళల రక్షణకు మేమున్నామంటూ అభివృద్ధి పథంలోకి దూసుకు వెళుతున్నాయి ప్రభుత్వాలు.

మహిళలకు మరింత రక్షణగా ఉండే విధంగా మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా  పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ‘రోటీ, కపడా  మఖాన్‌‘ ఎంత అవసరమో గుర్తించి మహిళలకు చక్కని పథకాలను ప్రవేశపెట్టి వాటిని మహిళా అవసరాలకు అనుగుణంగా అందిస్తూ ప్రతి మహిళ కళ్ళల్లో వెలుగు రేఖల్ని నింపుతున్నారు. ఇలా ప్రతి మహిళా కూడా ఈ పథకాన్ని సొంతం చేసుకుని తమ బిడ్డల్ని చక్కగా చదివిస్తూ భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే అదే మనకు నిజమైన మహిళా దినోత్సవం.


– పింగళి భాగ్యలక్ష్మి... కాలమిస్టు, రచయిత్రి 

మరిన్ని వార్తలు