సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

25 Jul, 2021 04:25 IST|Sakshi

సింగరేణి(కొత్తగూడెం): గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సింగరేణి వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో నాలుగు రోజుల్లో సుమారు 3.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సంస్థకు రూ.42 కోట్ల విలువైన ఉత్పత్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కరోనాతో పాటు భారీ వర్షాల కారణంగా ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడగా, ఈసారి కూడా వర్ష ప్రభావంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాగా, తమ క్వారీలో ఇప్పటికి 8 కోట్ల గ్యాలన్ల నీరు చేరగా, రెండు 350 హెచ్‌పీ, ఐదు 240 హెచ్‌పీ మోటార్లతో నీటిని బయటకు పంపిస్తున్నట్లు కొత్తగూడెంలోని గౌతంఖని ఓపెన్‌ కాస్ట్‌ (జీకేఓసీ) పీఓ వెంకట్రాంరెడ్డి తెలిపారు. మొత్తం నీరు తొలగిస్తేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని ఆయన వివరించారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 25 భూగర్భ గనులు, 20 ఓపెన్‌కాస్ట్‌ గనులు ఉన్నాయి. ఇందులో 20వ తేదీన 1.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యా నికి గాను 70 వేల టన్నుల ఉత్పత్తి జరగలేదు.

మరిన్ని వార్తలు