Telangana Waterfalls: వయ్యారాలు పోతున్న నయగారాలను చూడాల్సిందే

18 Jul, 2021 08:40 IST|Sakshi

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జాలువారుతున్న జలపాతాలు

ఇటీవల కురిసిన వర్షాలతో ప్రవాహాలు 

కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు

తిలకించేందుకు ఆసక్తి చూపుతున్న పర్యాటకులు

ప్రకృతి ఒడిలో పాలపొంగులు.. ఎత్తైనకొండలు.. వాటిపైనుంచి జాలువారే పాల లాంటి నీళ్లు.. నిశ్శబ్దంగా ఉండే చిట్టడవిలో గలగల పారే సెలయేరులు.. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో జోరందుకున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని జలపాతాలు.. వెరసి నాలుగు జిల్లాల ప్రజలను కనువిందు చేస్తున్నాయి. ఒకవైపు జోరువానలు.. రాళ్ల మధ్యలోంచి.. గుట్టలపై నుంచి వయ్యారాలు ఒలుకుతూ దూకుతున్న జలపాతాలు నయగారాలను తలపిస్తున్నాయి. ప్రకృతి అందాలను వీక్షించేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. చేరుకోవడం కష్టమైనా..  ఆహ్లాదాన్ని ఆస్వాదించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పర్యాటకంగా పేరుగాంచకపోయినా.. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయీ జలపాతాలు.. ఎలా వెళ్లాలనే వివరాలు మీకోసం..

అద్భుతం.. పాండవలొంక
పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం జాఫర్‌ఖాన్‌పేట సమీపంలో పాండవలొంక జలపాతం ఉంటుంది. ఇక్కడ బండరాళ్లు పల్లపరుపుగా ఉండి వర్షం పడినప్పుడు నీరు ఏటవాలుగా అంచెలంచెలుగ కిందకి జారే అపురూప దృశ్యాలు ఆకట్టుకుంటాయి. పెద్దపల్లి నుంచి అడవి శ్రీరాంపూర్, పారుపెల్లి, ముత్తారం వెళ్లే బస్సులు, ఆటోల్లో కూనారం వెళ్లే దారిలో వెన్నంపల్లి మీదుగా జాఫర్‌ఖాన్‌పేటకు చేరుకోవచ్చు. అక్కడి ప్రభుత్వపాఠశాల పక్కనుంచి ఉన్న రోడ్డుపై మూడుకిలో మీటర్లు ప్రయాణిస్తే శ్రీ రామపాదసరోవర్‌ (చెరువు) వరకు వెళ్లొచ్చు. రామునిపాదాలు, ఆంజనేయస్వామి గుడి, నాగదేవతలను దర్శించుకుంటూ మూడుకిలోమీటర్ల దూరంలోని పాండవలంక జలపాతాన్ని చేరుకోవచ్చు. ప్రయాణం కొంచెం కష్టమైనా.. ఇక్కడి ప్రకృతి అందాలు ఎంతో ఆకట్టుకుంటాయి.


లొంక రామన్న జలపాతం
కోరుట్ల: కథలాపూర్‌ మండలం పోతారం గ్రామశివారులోని లొంక రామన్న జలపాతం ఈ ప్రాంత ప్రజలను అలరిస్తోంది. మానాల గుట్టల నుంచి వచ్చే నీరు లొంక రామన్న శివాలయం పక్కనే ఉన్న రాళ్ల గుట్టలపై నుంచి జాలువారుతోంది. ఈ ప్రాంతానికి వర్షాకాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కోరుట్ల నుంచి వేములవాడ రోడ్‌లో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కథలాపూర్‌ మండలకేంద్రానికి చేరాలి. ఇప్పపల్లి గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల వెళితే పోతారం వస్తుంది. పోతారం నుంచి కిలోమీటర్‌ దూరం వెళితే లొంకరామన్న జలపాతం చేరుకోవచ్చు. కోరుట్ల నుంచి 28 కిలోమీటర్ల దూరం. సిరిసిల్ల జిల్లావాసులు రుద్రంగి మీదుగా ఇప్పపల్లికి చేరుకుని పోతారం మీదుగా లొంక రామన్నను చేరుకోవచ్చు. పోతారం గ్రామం నుంచి కిలోమీటర్‌ రోడ్‌ తప్ప మిగతా అంతా బీటీ రోడ్డు ఉంది.


రాయికల్‌ జలపాతం
సైదాపూర్‌(హుస్నాబాద్‌): సైదాపూర్‌ మండలంలోని రాయికల్‌ జలపాతం ఇటీవల కురుస్తున్న వర్షాలతో జాలువారుతోంది. ఎత్తులో ఉన్న 18 గుట్టల పైనుంచి పడే వర్షపు నీటితో ఈ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. రాయికల్, ఆకునూర్, పెరుకపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్న నీలగిరి గొలుసుకట్టు గుట్టల నుంచి నీరు పారుతోంది. హుజూరాబాద్, హుస్నాబాద్, ముల్కనూరు మీదుగా జలపాత సందర్శనకు రోడ్డుమార్గం ఉంది. సైదాపూర్‌కు 10 కిలోవీుటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది. 

మరో పొచ్చెర..‘గుండం’


కోరుట్ల: బోథ్‌సమీపంలోని ‘పొచ్చెర’కు తీసిపోని జలపాతం మల్లాపూర్‌– రాయికల్‌ సరిహద్దుల్లోని గోదావరి పరివాహక ప్రాంతంలో ‘వేంపల్లి గుండం’ ఉంది. గోదావరి మూడు పాయలుగా చీలి కొంత దూరం పయనించి మళ్లీ రెండు పాయలుగా మారి ‘వేంపల్లి గుండం’ వద్ద కలుస్తుంది. ఇక్కడ ఉన్న పెద్ద బండరాళ్ల మీదుగా గోదావరి జాలువారి జలపాతంగా మారింది. చూడటానికి ముచ్చటగా ఉంటుంది. కాగా.. వెళ్లడం కాస్త కష్టం. కోరుట్లనుంచి అయిలాపూర్‌ మీదుగా 25 కిలోమీటర్లు పయనిస్తే గొర్రెపల్లి గ్రామం వస్తుంది. గొర్రెపల్లి స్తూపం నుంచి ఎడమవైపు వెళితే.. వేంపల్లి– వెంకట్రావ్‌పేట వస్తుంది. జగన్నాథ్‌పూర్‌ రూట్‌లో 8కిలోవీుటర్లు వెళ్లిన తరువాత ఎడమవైపు ఉన్న చిన్నపాటి అడవిలో అర కిలోమీటర్‌ దూరం మోటార్‌సైకిల్‌పై వెళితే.. వేంపల్లి గుండం జలపాతం చేరుకోవచ్చు.అరకిలోవీుటర్‌ అటవీప్రాంతం తప్ప మిగతా చక్కని బీటీ రోడ్డు ఉంది.

అందాల గౌరీగుండాలు


పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి– మంథని మార్గమధ్యంలో ఉన్న సబ్బితం పంచాయతీ పరిధిలో గౌరీగుండాలు జలపాతం ఉంది. వర్షం కురిసినపుడు ధారగా వచ్చే నీటిలో సరదాగ గడిపేందుకు పర్యాటకులు వస్తుంటారు. కరోనా వైరస్‌వ్యాప్తి కారణంగా ఈ సారి పర్యాటకులు రావొద్దంటూ పంచాయతీ పాలకమండలి విజ్ఞప్తి చేసింది. పెద్దపల్లినుంచి 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సబ్బితం మీదుగా యైటింక్లయిన్‌కాలనీ వెళ్లే బస్సులో చేరుకోవచ్చు. సొంత వాహనాల్లో వచ్చేవారు పెద్దపల్లి నుంచి మంథని మార్గంలో జలపాతానికి చేరుకోవచ్చు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు