మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి

18 Oct, 2022 02:01 IST|Sakshi

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌

సాక్షి, హైదరాబాద్‌: అపారమైన సహజ వనరులు, ప్రగతిశీల విధానాలు గల తమ రాష్ట్రంలో పెట్టుబ­డులు పెట్టేందుకు తెలంగాణ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పిలుపునిచ్చారు. ఒడిశాలో పెట్టుబ­డులు పెట్టే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభు­త్వపరంగా ప్రోత్సాహకాలను అందించను­న్నట్లు స్పష్టం చేశారు. ఒడిశా ప్రభుత్వం, ఫిక్కి సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 4వ తేదీ వరకు భువనేశ్వర్‌లో నిర్వహించే ‘‘మేక్‌ ఇన్‌ ఒడిశా కాన్‌క్లేవ్‌ 22’’కార్యక్రమానికి సన్నాహకంగా హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణాలో సోమవారం పెట్టు­బడిదారుల సమావేశం జరి­గింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నవీన్‌ పట్నా­యక్‌ మాట్లాడుతూ, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఒడిశా నిలిచిందన్నారు. భువనేశ్వర్‌లో ఐటీ కంపెనీల ఏర్పాటు వేగంగా సాగుతోందని, ఒడిశా స్టార్టప్‌ హబ్‌ను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.  ఒడిశా పరిశ్రమల శాఖ మంత్రి ప్రతాప్‌ కేశరి దేబ్, ఒడిశా సీఎస్‌ సురేశ్‌ చంద్ర మహాపాత్ర, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి హేమంత్‌ శర్మ తెలంగాణకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీల యజమానులు సమావేశంలో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు