అసైన్డ్‌ భూములు కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలింది: కలెక్టర్‌

1 May, 2021 12:30 IST|Sakshi

సాక్షి, మెదక్‌: అసైన్డ్‌ భూములు కబ్జా చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్‌ హరీష్‌ తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్‌ భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి.. రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులు శనివారం ఉదయం నుంచి విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే.. వివాదాస్పద అసైన్డ్ భూములను పరిశీలించిన కలెక్టర్‌.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పౌల్ట్రీ ఫామ్ కోసం రోడ్డు, హ్యాచరీ కోసం షెడ్‌లు నిర్మించారని ఆయన పేర్కొన్నారు. బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. భూముల్లో డిజిటల్ సర్వే కూడా చేస్తున్నామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి విచారణ తర్వాత సీఎస్‌కు నివేదిక అందజేస్తామని కలెక్టర్‌ వెల్లడించారు.

మంత్రి ఈటల రాజేందర్‌ భూ వివాదంపై విచారణ కొనసాగుతోంది. హకీంపేట, అచ్చంపేటలో రెవెన్యూ, విజిలెన్స్ అధికారుల విచారణ చేపట్టారు. బాధితుల నుంచి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదులు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన రైతుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అసైన్డ్‌దారులను పిలిచి రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. హకీంపేట, అచ్చంపేట శివారు 170 ఎకరాల భూముల్లో డిజిటల్ సర్వే చేపట్టారు. ఈటలకు చెందిన హ్యాచరీతో పాటు అసైన్డ్‌ భూముల్లో డిజిటల్ సర్వే చేస్తున్నారు. మూడు టీమ్‌లుగా  రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు డిజిటల్ సర్వే చేపట్టారు.

ఈటల రాజేందర్‌పై భూముల కబ్జా ఆరోపణలు టీఆర్‌ఎస్‌ సర్కారులో ప్రకంపనలు సృష్టించాయి. మంత్రి ఈటల రాజేందర్‌ తమ భూములను కబ్జా చేశారంటూ కొందరు రైతులు సీఎం కేసీఆర్‌కు నేరుగా లేఖ రాయడం.. సీఎం కేసీఆర్‌ వెంటనే ఈ విషయంలో విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడం.. తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి ఈటల ఘాటుగా స్పందించడం సంచలనంగా మారింది.

చదవండి: ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..?
100 ఎకరాలు లాక్కున్నారు: ఈటలపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు

మరిన్ని వార్తలు