భీమ్లా నాయక్‌ పాటపై వివాదం: మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం

3 Sep, 2021 13:37 IST|Sakshi

పాటలోని సాహిత్యంపై ఐపీఎస్‌ అధికారి అభ్యంతరం

సాక్షి, హైదరాబాద్‌: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్‌’లోని పాటను విడుదల చేశారు. విడుదలైన టైటిల్‌ సాంగ్‌ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో పోలీస్‌గా నటిస్తున్న పవన్‌ కల్యాణ్‌ పాత్ర ఎలా ఉంటుందో పాటతో అర్ధమవుతోంది. అయితే ఆ పాటపై ఓ ఐపీఎస్‌ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలోని సాహిత్యాన్ని తప్పుబట్టారు. ‘మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం’ అని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్‌ విధానం పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన నిన్న ఓ ట్వీట్‌ చేశారు.
చదవండి: ‘భీమ్లా నాయక్‌’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?

హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ ఎం.రమేశ్‌ భీమ్లా నాయక్‌ పాట విన్న అనంతరం ఓ ట్వీట్‌ చేశారు. ప్రజల రక్షణార్థం జీతాలు పొందుతున్న మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం అని స్పష్టం చేశారు. అనంతరం ప్రముఖ రచయిత రామజోగయ్యశాస్త్రి రాసిన సాహిత్యంపై స్పందిస్తూ ‘పోలీస్‌ పాత్రను వర్ణించేందుకు తెలుగులో ఇంతకన్నా గొప్ప పదాలు దొరకలేదంటే ఆశ్చర్యమేస్తోంది’ అని ఐపీఎస్‌ అధికారి రమేశ్‌ తెలిపారు. ‘పోలీసుల సేవలను పాటలో ఎక్కడా ప్రస్తావించలేదు’ అని ట్వీట్‌ చేశారు. కాగా ఈ పాట సాహిత్యంపై కూడా కొందరు నెటిజన్లు సాధారణంగా ఉన్నాయని.. అంత గొప్పగా లేవని చెబుతున్నారు.

రామజోగయ్యశాస్త్రి సాహిత్యానికి తగ్గట్టు పాటలేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు నేరుగా రామజోగయ్యను ట్యాగ్‌ చేస్తూ చెప్పారు. ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు రామజోగయ్య స్పందించారు. ‘మీ రేంజ్‌ లిరిక్స్‌ అయితే కాదు’ అని ఓ అభిమాని ట్వీట్‌ చేయగా ‘నెక్ట్స్‌ టైం బాగా రాస్తా తమ్ముడూ.. ప్లీజ్‌’ అని శాస్త్రి రిప్లయ్‌ ఇచ్చారు. మరి ఓ ఐపీఎస్‌ అధికారి చేసిన ట్వీట్‌కు రామజోగయ్యశాస్త్రి స్పందిస్తారో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం భీమ్లా నాయక్‌ పాట సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆ పాటను తెలంగాణ జానపద కళాకారుడు, అరుదైన కిన్నెరను వాయించే దర్శనం మొగులయ్య పాడడం ప్రత్యేకంగా ఉంది. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

చదవండి: ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌ వ్యాఖ్యాతగా పాలమూరువాసి
 

మరిన్ని వార్తలు