గృహహింస బాధితుల కోసం రెమా రాజేశ్వరి వినూత్న ఆలోచన

7 Aug, 2020 14:50 IST|Sakshi

గృహహింస బాధితుల కోసం మొబైల్‌ సెఫ్టీ వెహికల్‌ ఏర్పాటు

సాక్షి, మహబూబ్‌నగర్‌: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఎందరో ఉద్యోగాలు పొగొట్టుకుని రోడ్డున పడ్డారు. బతుకుతెరువు కోసం పట్టణానికి వచ్చిన వారంతా తిరిగి పల్లే బాట పట్టారు. మార్చి మొదలు మే వరకు రోడ్డు మీద ఎక్కడ చూసిన వలస కార్మికులే దర్శనమిచ్చారు. చంటి బిడ్డలతో.. మండుటెండల్లో వారు అనుభవించిన కష్టాలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. వీరి బాధలు ఇలా ఉంటే ఇక ఇళ్లలో ఉండే మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. లాక్‌డౌన్‌తో అందరికి సెలవులు దొరికాయి ఒక్క మహిళలకు తప్ప. వారికి చాకిరీ రెట్టింపయ్యింది. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే లాక్‌డౌన్‌ కాలంలో మహిళలపై గృహహింస రెట్టింపయినట్లు జాతీయ మమహిళా కమిషన్‌ ఓ నివేదిక విడుదల చేసింది. 

ఒక్క ఫోన్‌ కాల్‌తో‌..
ఈ క్రమంలో ఓ ఐపీఎస్‌ అధికారి గృహహింస బాధితులను ఆదుకోవడానికి చేసిన ప్రయత్నం ఎన్నో ప్రశంసలు పొందుతుంది. ఒక్క గృహహింస బాధితులనే కాక ఇంటి బాట పట్టిన వలస కార్మికులకు సాయం చేసి వారిని స్వస్థలాలకు చేర్చింది. దాంతో ఆమెకు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో హ్యూమన్స్‌ బాంబే వారు ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఆ వివరాలు.. ఐపీఎస్‌ అధికారి రెమా రాజేశ్వరి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 25 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో.. జనాలను రోడ్ల మీదకు రాకుండా చూడటానికి కృషి చేశారు. ఇలా విధులు నిర్వహిస్తుండగా ఓ రోజు ఆమెకు కాన్పూర్‌ నుంచి ఓ మహిళ ఫోన్‌ చేసింది. (కరోనా రోగి వద్ద కాలింగ్‌ బెల్‌)

మూడు రోజులుగా చుక్క నీరు లేకుండా
ఫోన్‌లో సదరు మహిళ మహబూబ్‌నగర్‌లో ఉంటున్న తన సోదరి గత మూడు రోజుల నుంచి తనకు ఫోన్‌ చేయడం లేదని తెలిపింది. సోదరి భర్త ఆమెను తరచుగా కొడతాడని.. ఇప్పుడు కూడా అలాంటిది ఏదైనా జరిగి ఉంటుందేమో అని అనుమానం వ్యక్తం చేసింది. అనంతరం తన సోదరి అడ్రస్‌ ఇచ్చి.. సాయం చేయమని కోరింది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు రాజేశ్వరి తన టీంతో ఆమె ఇచ్చిన అడ్రస్‌కు వెళ్లింది. అక్కడ కనిపించిన భయంకరమైన దృశ్యం చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌ తిన్నది. ఫోన్‌ చేసిన మహిళ సోదరిని ఆమె భర్త గత మూడు రోజుల నుంచి దారుణంగా కొడుతునే ఉన్నాడు. ఆమెకు కనీసం తాగడానికి చుక్క నీరు కూడా ఇవ్వకుండా హింసించాడు. నొప్పితో బాధపడుతుంది. వెంటనే పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయించారు. మూడు రోజుల తర్వాత బాధితురాలు కోలుకుంది. అనంతరం ఆమె భర్తపై కేసు పెట్టింది. బాధితురాలి సోదరి రాజేశ్వరికి ఫోన్‌ చేసి.. ఆమెను తన దగ్గరకు పంపమని వేడుకుంది. అందుకు ఒప్పుకున్న రాజేశ్వరి బాధితురాలిని తెలంగాణ మహబూబ్‌నగర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌కు వెళ్లడానికి ఏర్పాటు చేసింది. (ఇల్లే భద్రం)|

ఆ సంఘటన నా కళ్లు తెరిపించింది
ఈ సంఘటన రాజేశ్వరిని తీవ్రంగా కలిచి వేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాటి సంఘటన నా కళ్లు తెరిపించింది. ఇలాంటి వారు ఇంకా ఎందరో ఉంటారు. సమాజం కట్టుబాట్లు, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వారంతా ఇళ్లలోనే ఈ హింసను భరిస్తుంటారు. ఫిర్యాదు కూడా చేయలేరు. అలాంటి వారికి సాయం చేయాలనిపించింది. దాంతో ఒక ఆలోచన చేశాను. బాధితులు పోలీసు స్టేషన్‌కు వచ్చే బదులు మనమే వారి దగ్గరకు వెళ్లి సాయం చేయడం మంచిది అనిపించింది. వెంటనే ఒక మొబైల్‌ సెఫ్టీ వెహికల్‌ను ఏర్పాటు చేశాను. టీమ్‌ను సిద్ధం చేశాను. వీరంతా జిల్లా వ్యాప్తంగా తిరిగి బాధితులను గుర్తించి వారికి సాయం చేస్తారు. ఈ ప్రయత్నం చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. కేవలం రెండు వారాల్లోనే 40 కేసులు నమోదయ్యాయి’ అన్నారు. (ఒక్కో బుక్‌... ఒక్కో కిక్‌)

నా టీం వల్లే ఇదంతా సాధ్యమయ్యింది
అంతేకాక ‘లాక్‌డౌన్‌ నియమాలు కఠినతరం కావడంతో.. వలస కార్మికులంతా ఇళ్ల బాట పట్టారు. దాంతో వారికి కూడా సాయం చేయాలని నిర్ణయించుకున్నాము. నేను, నా టీమ్‌ హైవేల వెంట ఫుడ్‌ బ్యాంక్‌లను ఏర్పాటు చేసి.. వారికి సాయం చేశాం. వలస కార్మికుల కోసం రైళ్లు ఏర్పాటు చేసేంత వరకు దాదాపు 11 వేల మందిని స్వస్థలాలకు చేర్చాం’ అన్నారు రాజేశ్వరి. అంతేకాక గత మూడు నెలల నుంచి తన టీం ప్రాణాలను పణంగా పెట్టి.. కుటుంబానికి దూరంగా ఉంటూ సామాన్యులకు సాయం చేశారని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం వారిలో చాలామందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. అయినా కూడా వారంతా ‘‘మేడమ్‌ .. మేము తిరిగి ఎప్పుడు విధుల్లో జాయిన్‌ కావాలి’ అని అడుగుతున్నారు. ఈ ఉద్యోగం పట్ల వారికున్న ప్రేమ అలాంటిది. వారందరి సహకారంతోనే నేను ఇదంతా చేయగలిగాను’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజేశ్వరి ప్రయత్నాన్ని నెటిజనులు తెగ ప్రశంసిస్తున్నారు. 

మరిన్ని వార్తలు