ఇంటి దొంగలు కాజేస్తున్నారు 

12 Oct, 2022 01:46 IST|Sakshi
ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌    

పక్కదారి పడుతున్న పేదల రేషన్‌ బియ్యం 

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు కేంద్రంగా అక్రమాలు 

పకడ్బందీ తనిఖీలు లేక సిబ్బంది అవినీతి బాట 

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతీ నెలా లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం అందిస్తున్నాయి. అయితే పౌరసరఫరాల శాఖలో కొందరు ఇంటి దొంగలు ఆ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ, రూ.కోట్ల సొమ్ము కాజేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతినెలా రేషన్‌ లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీ కోసం సీఎంఆర్‌ (కస్టం మిల్లింగ్‌ రైస్‌) కింద మిల్లర్లు ఇచ్చిన బియ్యాన్ని ఎఫ్‌సీఐ, పౌరసరఫరా శాఖ ప్రధాన గోదాముల్లో నిల్వ చేస్తారు.

అక్కడి నుంచి మండల స్థాయి గోదాం (ఎంఎల్‌ఎస్‌) పాయింట్లు, అటు నుంచి రేషన్‌షాపులకు బియ్యం సరఫరా అవుతుంది. ఈ రెండు దశల్లో బియ్యం రవాణాకు కాంట్రాక్టర్లు ఉంటారు. చాలా చోట్ల ప్రభుత్వానికి సొంత గోదాములు లేక అద్దెకు తీసుకుంటోంది. కొన్ని చోట్ల ప్రైవేటు, సహకార శాఖ, గిడ్డంగుల సంస్థ, వ్యవసాయ మార్కెట్, జీసీసీ గోదాములను ఉపయోగిస్తున్నారు.

రాష్ట్రంలో 170 ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉండగా, రేషన్‌ షాపులకు 2.95 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. మొదట ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోలు చొప్పున బియ్యం ఇవ్వగా, కరోనా తర్వాత లబ్ధిదారులకు పది కిలోల చొప్పున ఇవ్వడంతో ఆ కోటా పెరిగింది. ఈ నేపథ్యంలో స్టాక్‌ పెరగడం, ఉచిత బియ్యం కావడంతో క్షేత్రస్థాయిలో అక్రమాలు పెరిగాయి. 

ఆన్‌లైన్, తనిఖీలు ఉన్నా.. 
ప్రతీ ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో నెల నెలా బియ్యం నిల్వలపై ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి. జిల్లాల్లో స్థానిక అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ), పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆర్డీవో, ఎమ్మార్వో లు ఈ పాయింట్లను తనిఖీలు చేయాలి. కానీ ఇది చాలా చోట్ల జరగడం లేదు. పౌరసరఫరాల శాఖ విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పుడు మాత్రం తేడాలు బయటపడుతున్నాయి.

చాలా చోట్ల ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ఇన్‌చార్జిలు నేరుగా కొంతమంది రేషన్‌ డీలర్లు, రైస్‌మిల్లర్లతో సంబంధాలు కొనసాగిస్తూ అక్కడి నుంచి బియ్యం పక్క దారి పట్టిస్తున్నారు. మిల్లులకు రీ సైక్లింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ఇన్‌చార్జిలు ఉన్నతాధికారుల అండదండలతోనే హమాలీ, రవాణా చార్జిలు, గన్నీ సంచుల్లోనూ అవకతకవలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. కొన్ని చోట్ల ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలోనే బఫర్‌ స్టాక్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రైస్‌ మిల్లు నుంచి బియ్యం రాకున్నా వచ్చినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ఆసిఫాబాద్‌లో రూ.3 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు.

ఇందులో ఉన్నతాధికారుల నుంచి సైతం పరోక్షంగా సహాయ, సహకారాలు అందుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. మరోవైపు నెలా వారీ కోటా బియ్యంలో క్వింటా, అరక్వింటా తక్కువగా వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం సాహసం చేయడం లేదు. ఇలా అక్రమంగా దారిమళ్లించిన బియ్యాన్ని తమకు నమ్మకం ఉన్న డీలర్లకు కోటాకన్నా ఎక్కువగా పంపిస్తూ.. వారి ద్వారా బయట అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఇటీవల గుర్తించిన అక్రమాలు.. 
►ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పరిధిలో 8,339 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. గత కొంతకాలంగా గోదాంకు బియ్యం రాకున్నా వచ్చినట్లు నమోదు చేస్తూ భారీగా అవకతకలకు పాల్పడ్డారు. వీటి విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. అక్కడి ఇన్‌చార్జి, డీఎస్‌వో సైతం సస్పెండ్‌ అయ్యారు. ఇంకా విచారణ జరుగుతోంది. 
►మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో 218.25 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వచ్చింది. గోదాం ఇన్‌చార్జిపై విచారణ జరుగుతోంది.  
►మంచిర్యాల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో 650 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. దీంతో ఇన్‌చార్జిని సస్పెండ్‌ చేసి, బియ్యాన్ని రికవరీ చేశారు. 

మరిన్ని వార్తలు