అంతుబట్టని రెవెన్యూ లీలలు 

26 Aug, 2020 11:26 IST|Sakshi
మృతుడు ప్రకాష్‌ సోదరుడు వెంకటరమణ, కుటుంబ సభ్యులు

సాక్షి .మహబూబ్‌నగర్‌: పాలమూరులో రెవెన్యూ లీలలు ఓ నిండు ప్రాణాన్ని తీసుకున్నాయి. ఏళ్లు గడుస్తున్నా.. కొలిక్కిరాని భూ సమస్యతో ఓ బాధితుడి గుండె ఆగి చనిపోయాడు. మారుతున్న ప్రొసీడింగ్స్, తాజాగా న్యాయవాది నుంచి అందిన నోటీసును చూసి ఆ భూమి తమకు దక్కదనే ఆందోళనతో హఠాన్మరణం చెందినట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 1994లోనే అప్పటి ఆర్డీఓ, తహసీల్దార్‌ ఆ భూమి సదరు కుటుంబానికి చెందినదని ప్రొసీడింగ్‌ ఇచ్చారు. అప్నట్నుంచీ పట్టా పాస్‌ పుస్తకాల కోసం తిప్పించుకున్న అధికారులు చివరకు 2018లో ఆ భూమిని వారి పేరు మీద చేశారు. తర్వాత రెండుసార్లు రైతుబంధు కింద ప్రభుత్వం పెట్టుబడి సాయం కూడా అందింది. కానీ ఆ తర్వాత అధికారులు ఆ భూమి అదే గ్రామానికి చెందిన రాంచంద్రమ్మ పేరిట ఈ ఏడాది జూలై నాలుగో తేదీన ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఆ భూమి ఎవరిదో అని తేల్చలేకపోతున్న అధికారుల తీరుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. అధికారుల తప్పిదాలతో అన్యాయమైన మహబూబ్‌నగర్‌ మండలం ధర్మాపూర్‌కు చెందిన ఆర్మీ ఉద్యోగి గుంటి లక్ష్మయ్య దీనగాథ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. 

ఆర్మీ మాజీ ఉద్యోగి గుంటి లక్ష్మయ్యకు 1970లో ప్రభుత్వం ధర్మాపూర్‌లోని సర్వే నంబర్‌ 538లో ఐదెకరాల వ్యవసాయయోగ్యమైన భూమి ఇచ్చింది. అప్పటి నుంచి లక్ష్మయ్య, అతని కుటుంబం ఆ భూమిలో కాస్తులో ఉంది. 25, మార్చి 1990లో లక్ష్మయ్య గుండెపోటుతో చనిపోయాడు. తర్వాత లక్ష్మయ్య కుమారులు వెంకటరమణ, ప్రకాశ్‌బాబు ఆ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటయ్యకు కౌలుకు ఇచ్చారు. రెండేళ్ల వరకు ఆ భూమిపై అంతగా దృష్టి సారించలేదు. తర్వాత భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌ పుస్తకాల కోసం ప్రయత్నించారు. ఎట్టకేలకు 2018లో లక్ష్మయ్య కుమారులు ఇద్దరికి రెండున్నర ఎకరాల చొప్పున అధికారులు పట్టాలు ఇచ్చారు. 2019 జూన్, 2020 మార్చిలో ఇరువురూ రూ.12,500 చొప్పున రైతుబంధు సాయం కూడా పొందారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు.

కానీ ఆ భూమి వెంకటయ్య కుటుంబీకులదిగా నిర్ధారిస్తూ ఈ ఏడాది జూలైలో ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్‌ కిషన్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లిన లక్ష్మయ్య కుమారులిద్దరూ ఆగస్టు 13న ఆ ప్రొసీడింగ్స్‌పై స్టే తీసుకొచ్చారు. చివరగా ఈ నెల 20న సాయంత్రం స్థానిక న్యాయవాది ద్వారా వచ్చిన నోటీసులు అందుకున్న ప్రకాశ్‌బాబు మరుసటి రోజు ఉదయమే గుండె ఆగి చనిపోయాడు. ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన బడా ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకే రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేసి లక్ష్మయ్య కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే వెంకటయ్య కూడా మృతి చెందడంతో ఆయన కుమారుడు హరీశ్‌ ఆ భూమి కోసం ప్రయత్నిస్తున్నారు.   

ఆ భూమిని అమ్ముకున్నారు.. 
ఆర్మీ మాజీ ఉద్యోగి లక్ష్మయ్యకు 1970లో ప్రభుత్వం ఐదెకరాలు ఇచ్చింది. నిబంధనల మేరకు పదేళ్ల తర్వాత ఆ భూమిని ఇతరులకు అమ్ముకునే అధికారం లక్ష్మయ్యకు, వారి కుటుంబసభ్యులకు ఉంది. దీంతో వాళ్లు ఆ భూమిని వెంకటయ్యకు విక్రయించారు. అప్పట్లో వెంకటయ్య పేరు మీద పట్టాపాస్‌ పుస్తకాలు జారీ అయ్యాయి. దీంతో లక్ష్మయ్య కుమారులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు – కిషన్, తహసీల్దార్, మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం 

మేం అమ్మలేదు 
దేశానికి మా నాన్న చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన భూమి అది. అలాంటి భూమిని మేం అమ్ముకున్నామంటూ అధికారులు చెబుతున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. మేం ఆ భూమిని ఎవరికీ అమ్మలేదు. వెంకటయ్యకు కౌలుకు మాత్రమే ఇచ్చాం. దీన్ని సాకుగా చేసుకుని మా నాన్న చనిపోయిన తర్వాత దాన్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడ్డారు. ఒకవేళ మేం అమ్మితే ఎన్‌ఓసీ తీసుకోవాలి. అది లేకుండా మేము ఆ భూమిని అమ్మామని చెప్పడం అన్యాయం. – వెంకటరమణ, లక్ష్మయ్య పెద్దకుమారుడు 

ఆ భూమి మాదే 
ధర్మాపూర్‌లోని సర్వేనంబర్‌ 538లో ఉన్న ఐదెకరాలు లక్ష్మయ్య నుంచి కొనుగోలు చేశాం. అప్పట్లో వెంకటరమణ, ఆయన సోదరుడు ప్రకాశ్‌బాబు కూడా సంతకాలు చేశారు. అందరి సమక్షంలోనే ఇదంతా జరిగింది. 1992 నుంచి 2018 వరకు ఆ భూమి మా నానమ్మ రాంచంద్రమ్మ పేరు మీదే ఉంది. ఆ భూమి మాదే అనడానికి ఆధారాలన్నీ మా వద్ద ఉన్నాయి. తర్వాత పట్టా వారి పేరు మీద ఎలా మారిందో మాకు తెలియదు – హరీశ్, వెంకటయ్య కుమారుడు 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు