బండి బదిలీ.. భలే బురిడీ

26 Jun, 2022 07:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాహనాల యాజమాన్య బదిలీల్లో అక్రమాల దందా కొనసాగుతోంది. ఆలస్యంగా నమోదయ్యే వాహనాలపై పెనాల్టీలు విధించాల్సి ఉండగా  కొందరు ఆర్టీఏ  అధికారులు దళారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా వాహనాలు ఒకరి నుంచి ఒకరికి యాజమాన్య బదిలీ చేసేందుకు మోటారు వాహన నిబంధనల ప్రకారం 30 రోజుల గడువు విధిస్తారు. గడువులోపు కొనుగోలు చేసిన వాహనదారు తనకు విక్రయించిన వ్యక్తి నుంచి నిరభ్యంతర పత్రం (నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) తీసుకొని తన పేరిట వాహనాన్ని రిజిస్టర్‌ చేసుకోవాలి.

కానీ కొందరు వాహనదారులు ఎన్‌ఓసీ  తీసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు వాహనాలను తమ పేరిట నమోదు చేసుకోకుండానే  తిరుగుతున్నారు. ఇలా వాహన యాజమాన్య బదిలీ కాకుండా తిరిగే వాహనాలపై  ఎన్‌ఓసీలు జారీ చేసినప్పటి నుంచి నమోదయ్యే గడువు వరకు  పెనాలిటీలు విధిస్తారు. ఇది ద్విచక్ర వాహనాలకు  నెలకు రూ.300, కార్లకు రూ.500 చొప్పున ఉంటుంది.  

కొంతమంది వాహనదారులు ఎన్‌ఓసీలు తీసుకొన్న తర్వాత కూడా సకాలంలో వాహనాలను బదిలీ చేసుకోకపోవడంతో భారీ మొత్తంలో పెనాల్టీలు చెల్లించాల్సి వస్తోంది.  ఇక్కడే కొందరు  ఆర్టీఏ  సిబ్బంది దళారులతో కలిసి చక్రం తిప్పుతున్నారు. వాహనదారులు చెల్లించాల్సిన పెనాల్టీలను నామమాత్రంగా విధించి మిగతా మొత్తాన్ని జేబులో వేసుకుంటున్నారు. ఎన్‌ఓసీ  తీసుకున్న తర్వాత నెలల తరబడి నమోదు కాకుండా తిరిగే  వాహనాలపై సగటున రూ.5000 నుంచి రూ.10,000 వరకూ  పెనాల్టీలు నమోదవుతాయి. కానీ దాన్ని రూ.1000కు పరిమితం చేస్తున్నట్లు  తెలిసింది.

(చదవండి: ఆసియాలోనే తొలిసారిగా ‘థోరాసిక్‌ రోబోటిక్‌ సర్జరీ’)

మరిన్ని వార్తలు