తొలుత ఉమ్మడి ప్రాజెక్టులు

8 Oct, 2021 02:18 IST|Sakshi

బోర్డుల పరిధిలోకి వెళ్లే వాటిపై స్పష్టత

‘కృష్ణా’ పరిధిలోకి  శ్రీశైలం, సాగర్, పులిచింతల

‘గోదావరి’లో పెద్దవాగు మాత్రమే

10,11 తేదీల్లో ఉపకమిటీ భేటీలు.. 12న పూర్తిస్థాయి భేటీలు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధిలోకి తొలిదశలో రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులు వెళ్లనున్నాయి. ఈ నెల 14 నుంచి అమల్లోకి వచ్చే గెజిట్‌లో భాగంగా కృష్ణాబోర్డు మొదట శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను, గోదావరి బోర్డు పెద్ద వాగు ప్రాజెక్టునుతమ ఆధీనంలోకి తీసుకోను న్నాయి. ఈ మేరకు కేంద్రం సైతం స్పష్టత ఇచ్చి నట్లుగా తెలుస్తోంది. మరిన్ని అంశాలపై స్పష్టత కోసం, రాష్ట్రాల అభిప్రాయాలను వినేందుకు 10, 11 తేదీల్లో బోర్డుల సబ్‌ కమిటీ భేటీలు, 12న పూర్తి స్థాయి భేటీలు ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేర కు తెలుగు రాష్ట్రాలకు బోర్డులు లేఖలు రాశాయి.

చైర్మన్లతో కేంద్ర అదనపు కార్యదర్శి భేటీ
గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై చర్చించేందుకు హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ.. గురువారం ఉదయం రెండు బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్‌ అయ్యర్‌తో భేటీ అయ్యారు. బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులు, వాటి వివరాలు, సీఐఎస్‌ఎఫ్‌ భద్రత, రాష్ట్రాలు అందించిన సమాచారం, వాటి అభ్యంతరాలు, ఇంతవరకు పూర్తి చేసిన చర్యలు తదితరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రాజెక్టుల ఆధీనానికి సంబంధించి రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలున్నాయని, మూడు ప్రాజెక్టుల విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలు సానుకూలతతో ఉన్నాయని తెలిపినట్లుగా సమాచారం. శ్రీశైలం, సాగర్, పులిచింతల విషయంలో రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో వాటిని మొదటగా బోర్డులు తమ ఆధీనంలోకి తీసుకొని పర్యవేక్షణ మొదలు పెట్టాలని సూచించినట్లుగా తెలిసింది. మిగతా ప్రాజెక్టులపై చర్చించేందుకు వీలైనంత త్వరగా బోర్డు భేటీలు నిర్వహించి రాష్ట్రాల అభిప్రాయం కోరాలని చెప్పినట్లుగా బోర్డుల వర్గాలు తెలిపాయి.  

వరుస భేటీలు పెట్టిన బోర్డులు
గెజిట్‌ అమలుకు మరో వారం రోజులే సమయం ఉన్న నేపథ్యంలో, బోర్డులు తమ పనిలో వేగం మరింత పెంచనున్నాయి. వచ్చే ఆది, సోమ వారాల్లో రెండు బోర్డుల సబ్‌ కమిటీల భేటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఆ వెంటనే పూర్తి స్థాయి స్పెషల్‌ బోర్డు భేటీలను ఈ నెల 12న నిర్వహించనున్నాయి. ఈ మేరకు గురువారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల కార్యదర్శులకు బోర్డులు లేఖలు రాశాయి. ఏయే ప్రాజెక్టులను బోర్డుల పరిధిలో ఉంచాలన్న దానిపై ఈ సమావేశాల్లో మరింత స్పష్టత తీసుకోనున్నాయి.  

మరిన్ని వార్తలు