ఉచిత నీటి  పథకానికి తప్పని తిప్పలు!

30 Mar, 2021 08:11 IST|Sakshi

ఆధార్‌ అనుసంధానంలో సాంకేతిక సమస్యలు

అపార్ట్‌మెంట్‌ వాసులకు తప్పని అవస్థలు

ఏప్రిల్‌ 30 వరకు గడువు పెంచిన జలమండలి 

సాక్షి, హైదరాబాద్‌: ఉచిత నీటి సరఫరా పథకం కింద లబ్ధి పొందేందుకు అవసరమైన ‘నల్లా కనెక్షన్‌–ఆధార్‌’ అనుసంధానం నగరంలో ప్రహసనంగా మారింది. ముఖ్యంగా 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకాన్ని పొందేందుకు అపార్ట్‌మెంట్‌లలో ప్రతీ ఫ్లాట్‌ యజమాని విధిగా నల్లా కనెక్షన్‌కు ఆధార్‌ నెంబరు అనుసంధానం చేసుకోవాలన్న నిబంధన కష్టతరంగా మారింది. గ్రేటర్‌ పరిధిలో సుమారు లక్ష వరకు ఫ్లాట్స్‌ యజమానులున్నారు. వీరంతా తమ ఆధార్‌ నెంబరును అనుసంధానం చేసుకునే క్రమంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

ఆధార్‌ కార్డులో ఉన్న ఫోన్‌ నెంబరును ప్రస్తుతం చాలా మంది వినియోగించని కారణంగా ఓటీపీ పాత నెంబరుకు వెళ్లడం.. పలు అపార్ట్‌మెంట్లలో ప్రస్తుతం ఉన్న బల్క్‌ నల్లా కనెక్షన్‌ బిల్డర్‌ పేరిట ఉండడం..కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్‌లో అప్పటికే నల్లా కనెక్షన్‌ నెంబరుకు అనుసంధానమైన ఒక ఫ్లాట్‌ యజమానికి ఓటీపీ వెళుతోంది. సదరు వ్యక్తి అందుబాటులో లేని పక్షంలో సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు  వెబ్‌సైట్‌లో తరచూ తలెత్తుతోన్న సాంకేతిక సమస్యలు వినియోగదారులకు చుక్కలు చూపుతుండడం గమనార్హం. వినియోగదారుల సౌకర్యార్థం ఈ ప్రక్రియను జలమండలి క్షేత్రస్థాయి సిబ్బంది ఆధ్వర్యంలో లేదా మీ సేవా కేంద్రాల్లో పూర్తిచేసుకునే అవకాశం కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు.

ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి.. 
జలమండలి పరిధిలో మొత్తంగా 9.80 లక్షల నల్లాలున్నాయి. వీటిలో ఇప్పటివరకు సుమారు 2 లక్షల మంది మాత్రమే తమ ఆధార్‌ నెంబరును నల్లా కనెక్షన్‌ నెంబరు(క్యాన్‌)కు అనుసంధానం చేసుకోవడం గమనార్హం. మెజార్టీ వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తిచేసుకోకపోవడంతో మున్సిపల్‌ పరిపాలన శాఖ అనుమతితో జలమండలి ఏప్రిల్‌ 30 వరకు గడువును పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని రకాల ఉచిత పథకాలకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరన్న నిబంధన విధించడంతో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. 

ఫ్లాట్స్‌ వినియోగదారుల ఆధార్‌ అనుసంధానం ఇలా.. 
► అపార్ట్‌మెంట్‌ వాసులు ముందుగా జలమండలి వెబ్‌సైట్‌..https://bms.hyderabadwater.gov.in/20kl/ను సంప్రదించాలి. ఇందులో ఉచిత నీళ్ల పథకం..ఆధార్‌   అనుసంధానం అన్న ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. 

► ముందుగా తమ అపార్ట్‌మెంట్‌కున్న నల్లా కనెక్షన్‌ (క్యాన్‌)కు అనుసంధానమైన మొబైల్‌ నెంబరుకు ఓటీపీ వెళ్తుంది. 
► ఈ ఓటీపీని ఎంటర్‌ చేస్తేనే ఎక్స్‌ఎల్‌ షీట్‌ ఓపెన్‌ అవుతుంది.  

► ఇందులో ఫ్లాట్‌ యజమాని పేరు, ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ (పీటీఐఎన్‌) నెంబరు, ఆధార్‌ నెంబరును నమోదు చేయాలి.  
► ఆధార్‌ నెంబరుకు లింక్‌చేసిన మొబైల్‌ నెంబరుకు మరో ఓటీపీ మెసేజ్‌ వెళుతుంది. దీన్ని ఎంటర్‌చేస్తేనే ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. 

►  ప్రతీ ఫ్లాట్‌ వినియోగదారుడూ విధిగా ఈ ప్రక్రియను వేర్వేరుగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. 
► సుమారు 50 ఫ్లాట్స్‌ ఉన్న అపార్ట్‌మెంట్‌ వాసులు అందరూ ఒకేసారి కాకుండా రోజుకు పది మంది చొప్పున ఈప్రక్రియను చేపడితేనే అనుసంధానం సులువు అవుతుంది. 

►  ఈ సమస్యలో ఇబ్బందులుంటే జలమండలి క్షేత్రస్థాయి కార్యాలయాలు లేదా 155313 కాల్‌సెంటర్‌ నెంబరును సంప్రదించాలని జలమండలి సూచించింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు