Work From Home డెల్టాప్లస్‌ భయాలు.. రెండేళ్ల వరకు వర్క్‌ ఫ్రం హోం..

30 Jun, 2021 18:23 IST|Sakshi

ఫ్లెక్సిబుల్‌ పని విధానాలకు మొగ్గు

సుదీర్ఘ వర్క్‌ ఫ్రం హోంకు సిద్ధమైన 30 టెక్‌ దిగ్గజ కంపెనీలు

దేశంలో 24 నెలల వరకు 20 శాతం మంది ఇంటి నుంచే పని

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తుండటంతో అన్నిరకాల కార్యకలాపాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. అయితే ఇప్పుడు డెల్టాప్లస్‌తో వచ్చే థర్డ్‌వేవ్‌ భయాలు అందరినీ వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో ఆఫీసుల నుంచి పనిచేయడం ఏ మేరకు శ్రేయస్కరమనే దానిపై పరిశ్రమలు, మార్కెట్, ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. వ్యాక్సినేషన్‌ పుంజుకుంటున్న నేపథ్యంలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడంపై తర్జన భర్జన పడుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితులు, వర్క్‌ ఫ్రం హోంతో చేకూరిన లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నాయి. వారంలో కొద్ది రోజులు ఇంటినుంచి, కొద్ది రోజులు ఆఫీసుకెళ్లి పని చేసే ‘హైబ్రిడ్‌’ విధానానికి చాలా సంస్థలు మొగ్గుచూపుతన్నాయి. కొన్ని సంస్థలు పూర్తిగా వర్క్‌ ఫ్రం హోం ఇస్తున్నాయి. పెద్ద కంపెనీలు తీసుకునే నిర్ణయాన్నే ఎక్కువ మటుకు మధ్య, చిన్న తరహా సంస్థలు కూడా పాటించే అవకాశాలున్నాయని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

రెండేళ్ల దాకా 20 శాతం వర్క్‌ ఫ్రం హోం 
పలు ఐటీ దిగ్గజ కంపెనీలు, టెక్‌ స్టార్టప్‌ కంపెనీలు ఇప్పటికే ‘హైబ్రిడ్‌ వర్కింగ్‌ మోడల్‌’ను మొదలుపెట్టేశాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్, ఇతర టెక్‌ స్టార్టప్‌లు హైబ్రిడ్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఉద్యోగులు ప్రతీరోజు ఆఫీసుకు రావాల్సిన అవసరం లేకుండా మినహాయింపులు, సర్దుబాట్లు చేశాయి. వచ్చే 12–24 నెలల వరకు దేశంలోని మొత్తం 50 కోట్ల మంది వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం దాకా ఇళ్ల నుంచే పనిచేసే అవకాశాలున్నట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ సావిల్స్‌ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గేటెడ్‌ కమ్యూనిటీల్లోని క్లబ్‌హౌజ్‌లు, కమ్యూనిటీ సెంటర్ల నుంచి పనిచేసేందుకు వీలుగా వర్క్‌ స్టేషన్‌ ఏర్పాట్లను సైతం కొన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు చేస్తున్నాయి.  

ఏ కంపెనీ ఎలా చేస్తోందంటే... 
మళ్లీ థర్డ్‌వేవ్‌ వచ్చినా రాకపోయినా ‘పర్మినెంట్‌ రిమోట్‌ వర్కింగ్‌’విధానం లేదా సుదీర్ఘకాలం వర్క్‌ ఫ్రం హోం పాటించేందుకు 30 కంపెనీలు సిద్ధమయ్యాయి. ‘అమెజాన్‌’కు ప్రపంచవ్యాప్తంగా 92 వేల మంది ఉద్యోగులున్నారు. వారానికి రెండు రోజులు ‘వర్క్‌ ఫ్రం హోం’చేయొచ్చని ఇటీవల ఆ సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్‌ సర్వీసులు నిర్వహిస్తున్న అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ తమ ఉద్యోగులు వచ్చే సెప్టెంబర్‌ 6 దాకా ఇళ్ల నుంచే పని చేయొచ్చంది. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ బిజినెస్‌లో ఉన్న ‘అట్లాసియన్‌’సంస్థ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్‌ఫ్రం హోం ఇచ్చింది. తమ ఉద్యోగులు శాశ్వతంగా ఇళ్ల నుంచే పని చేయొచ్చని ‘ఫేస్‌బుక్‌’సంస్థ వెల్లడించింది. 

90 దేశాల్లో సాఫ్ట్‌వేర్, సపోర్ట్, సర్వీసెస్‌కు సంబంధించి కస్టమర్లు కలిగిన ‘హబ్‌స్పాట్‌’మార్కెటింగ్, సేల్స్‌ సంస్థ ఉద్యోగులకు వారంలో సగం రోజులు వర్క్‌ఫ్రం, సగం రోజులు ఆఫీసు నుంచి పనిచేసే సౌలభ్యాన్ని కల్పించింది. 33 నుంచి 50 శాతం మంది ఉద్యోగులకు శాశ్వతంగా ఇళ్ల నుంచి పనిచేసేందుకు అవకాశం ‘ఇన్ఫోసిస్‌’ఇచ్చింది.

‘మైక్రోసాఫ్ట్‌’వారంలో 50 శాతం ఇళ్ల నుంచి పనిచేసేందుకు అనుమతినిచ్చింది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ సంస్థ ‘రెడిట్‌’శాశ్వతంగా వర్క్‌ ఫ్రం హోంకు అనుమతిస్తోంది. ప్రముఖ పారిశ్రామిక విద్యుత్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ‘సీమెన్స్‌’లోని 1.4 లక్షల ఉద్యోగులు వారానికి 2, 3 రోజులు శాశ్వతంగా వర్క్‌ఫ్రంహోం చేసేందుకు అవకాశమిచ్చింది.ట్విట్టర్‌ తమ ఉద్యోగులకు నిరవధికంగా వర్క్‌ఫ్రంహోం లేదా ఆఫీసుల నుంచి పనిచేసే అవకాశం కల్పించింది. మ్యూజిక్, కామెడీ తదితర స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌ను అందిస్తున్న స్వీడన్‌ కంపెనీ ‘స్టాటిఫై’తమ ఉద్యోగులు ఆఫీసులో, ఇళ్ల నుంచి లేదా కంపెనీ అందుబాటులోకి తెచ్చిన కో వర్కింగ్‌స్పేస్‌ల నుంచి పనిచేసే సౌలభ్యం కల్పించింది. 

మరిన్ని వార్తలు