ఆఫీస్‌ సంస్కృతి మళ్లీ పెరగాలి

11 Sep, 2022 04:03 IST|Sakshi

ఐస్ప్రౌట్‌ ప్రీమియం సెంటర్‌ను ప్రారంభం 

ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ 

పౌరాణిక ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్‌ స్పేస్‌ 

పాల్గొన్న మై హోమ్‌ చైర్మన్‌ జూపల్లి, దర్శకుడు శేఖర్‌ కమ్ముల 

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ పరిణామాల నేపథ్యంలో కొనసాగుతున్న వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి స్వస్తి పలికి ఆఫీస్‌ సంస్కృతిని పునరుద్ధరించుకోవాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తెలిపారు. ఆఫీస్‌ వర్క్‌స్పేస్‌ విభాగంలో అంకుర సంస్థలకు ప్రోత్సాహమందించే ఐస్ప్రౌట్‌ బిజినెస్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో శనివారం హైటెక్‌ సిటీలోని మై హోమ్‌ వేదికగా ప్రీమియం సెంటర్‌ ప్రారంభించింది.

ఈ ప్రారంభోత్సవానికి మై హోమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌ రావు, ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ... ఇలాంటి వినూత్న వేదికల వల్ల మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. విభిన్న రీతిలో పౌరాణిక సంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణం ఉద్యోగులకు మళ్లీ ఆఫీస్‌లో పనిచేయాలనే ఆతృతను పెంచుతుందన్నారు.

మహాభారత సంప్రదాయ ఇతివృత్తంతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ స్పేస్‌ ఆకట్టుకుందని, ఇలాంటి వేదికలు మరింత విస్తరించాలని జూపల్లి రామేశ్వర్‌ రావు పేర్కొన్నారు. ఐస్ప్రౌట్‌ బిజినెస్‌ సెంటర్‌ సీఈవో పాటిబండ్ల సుందరి మాట్లాడుతూ... వ్యాపార రంగంలో వినూత్న ఆలోచనలున్న వారిని మంచి ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చడానికి అవసరమైన అంతర్గత నిపుణుల బృందం తమవద్ద ఉందన్నారు.  నగరంలోనే కాకుండా విజయవాడ, చెన్నై, పూణే, బెంగళూరు, నోయిడా, గుర్గావ్, కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబైలలో కూడా తమ వర్కింగ్‌ స్పేస్‌లను ప్రారంభించనున్నామన్నా రు. కార్యక్రమంలో సహ వ్యవస్థాపకులు శ్రీని, ప్రాజె క్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శేషు, మణివణ్ణన్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు