‘సశక్తికరణ్‌’ అవార్డులపై కేటీఆర్‌ హర్షం

2 Apr, 2021 03:50 IST|Sakshi

మంత్రి ఎర్రబెల్లి, పీఆర్‌ అధికారులు సుల్తానియా, రఘునందన్‌కు సన్మానం  

హైదరాబాద్‌: దీనదయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్‌ పురస్కారాల్లో భాగంగా రాష్ట్రానికి 12 జాతీయ అవార్డులు రావడం పట్ల మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావును ఆయన సన్మానించారు. రాష్ట్రానికి అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

గురువారం ప్రగతి భవన్‌లో ఎర్రబెల్లిని కలసిన సందర్భంగా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేస్తూ, జాతీయస్థాయిలో రాష్ట్రానికి చెందిన 9 ఉత్తమ గ్రామ పంచాయతీలు, 2 మండలాలు, ఒక జిల్లా పరిషత్‌లకు అవార్డులు రావడం పట్ల కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ వరుసగా అవార్డులు సాధించడం గొప్ప విషయమని, సీఎం కేసీఆర్‌ వినూత్నంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్న కారణంగానే గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం ముందడుగు వేస్తోందని కేటీఆర్‌ అన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అసలైన గ్రామ స్వరాజ్య స్థాపన కేసీఆర్‌ హయాంలో జరుగుతోం దన్నారు. ఇదే తరహా పనితీరుని కొనసాగిస్తూ, రాష్ట్రానికి మరింత పేరు వచ్చే విధంగా పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు