మల్లారెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌.. 'మరో 3 నెలలు మమ్మల్ని చావగొడతారు'

24 Nov, 2022 15:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోదాల సందర్భంగా విధులకు ఆటంకం కలిగించారన్న ఐటీ అధికారుల వ్యాఖ్యలపై తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తాను సంతకం చేసిన తర్వాతే అధికారులు బయటకు వెళ్లారని.. ఎవరి విధులకు అడ్డుపడలేదని చెప్పారు.

వందకోట్లు బ్లాక్‌మనీ ఉన్నట్లు రాసి  నా కొడుకుతో బలవంతంగా సంతకం చేయించారని ఆరోపించారు. కొడుకు సంతకం పెట్టిన ఫైల్స్‌ చూపించడం లేదన్నారు. ఇలాంటి రైడ్‌ను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఇంతమంది సీఆర్‌పీఎఫ్‌ బలగాలను ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలన్నారు.

'తప్పులు చూపిస్తే ఫైన్‌ కడతాం.. మేము దొంగలమా? ఇంత అరాచకమా?. నాకొడుకును ఆస్పత్రిలో చేర్చినట్లు కూడా మాకు చెప్పలేదు. ఇంకా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై రైడ్స్‌ ఉంటాయి. ఎన్నిరైడ్స్‌ జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం' అని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. 

మల్లారెడ్డిపై కేసు నమోదు
అంతకుముందు, మల్లారెడ్డిపై బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఐటీ అధికారి ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్‌తో ఈ కేసును దుండిగల్‌ పీఎస్‌కు బదిలీ చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని ఐటీ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో 342, 353, 201, 203, 504, 506, 353, 379 రెడ్‌విత్‌ R/W 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఐటీ అధికారులపై భద్రారెడ్డి ఫిర్యాదు
ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి కుమారుడు పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తమపై ఐటీ అధికారులు దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. దీంతో ఐటీ అధికారులపై 384 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

చదవండి: (మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు