Vamsiram Builders: కొనసాగుతున్న ఐటీ సోదాలు.. హవాలా రూపంలో నగదు..

7 Dec, 2022 12:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ఆర్థిక అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుస దాడులు నిర్వహిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ వంశీరామ్‌ బిల్డర్స్‌పై ఆదాయ పన్ను శాఖ అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ చైర్మన్‌ సుబ్బారెడ్డి నివాసంతోపాటు కార్యాలయాల్లో మంగళవారం రాత్రి పొద్దుపోయే దాకా సోదాలు జరిపిన అధికారులు బుధవారం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, సోదాల్లో భాగంగా వంశీరామ్‌ బిల్డర్స్‌ ఉద్యోగుల ఖాతాల్లో భారీగా లావాదేశీలు గుర్తించారు. 15 బృందాలతో 19 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. ఈ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ రెండు రాష్ట్రాల్లోనూ నిర్మాణాలు సాగిస్తోంది. కాగా, మొదటి రోజు సోదాల్లో భాగంగా వంశీరామ్‌ బిల్డర్స్‌ పెద్దఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు తమ సోదాల్లో గుర్తించినట్లు సమాచారం. ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఖాతాల్లో నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు.. ఆ ఖాతాలన్నీ సంస్థ బినామీ ఖాతాలుగా గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ సంస్థ లావాదేవీల్లో మనీల్యాండరింగ్‌ కోణం కూడా అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ఈ సంస్థ తన వినియోగదారులకు విక్రయించిన నివాస, వాణిజ్య సముదాయాలకు సంబంధించిన లావాదేవీల్లో సగం మొత్తాన్ని వైట్‌గా, మరో సగం బ్లాక్‌గా వసూలుచేసినట్లు సమాచారం. 

తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటి నుంచి నిధులు మళ్లించారని చెబుతున్నారు. దాడుల్లో పలు కీలక పత్రాలు, పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా సంస్థ పెద్దఎత్తున ఇతరులతో ఆస్తులకు సంబంధించి చేసుకున్న ఒప్పంద పత్రాలను కూడా అధికారులు తీసుకెళ్లినట్లు సమాచారం. అధికారులు మంగళవారం ఉదయం నుంచి మొత్తం 36 ప్రాంతాల్లో ఈ సోదాలు చేసినట్లు అధికారవర్గాల సమాచారం. వినియోగదారుల నుంచి నగదు రూపంలో తీసుకున్న మొత్తాన్ని యాజమాన్యం హవాలా ద్వారా తరలించినట్లు చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించి ఐటీ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. వంశీరామ్‌ సంస్థ నగరంలోనూ, ఇతర ప్రాంతాల్లో పెద్దఎత్తున వెంచర్లను వేసింది. నివాస ప్రాంతాల కంటే అధికంగా వాణిజ్య భవనాలను విలువైన ప్రాంతాల్లో నిర్మించింది.  

మరిన్ని వార్తలు