మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాలు.. అర్ధరాత్రి హైడ్రామా

24 Nov, 2022 07:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. కుమారులు ఇళ్లు, బంధువులు ఇళ్లు, కార్యాలయాలు, సోదరులు ఇళ్లలో కూడా తనిఖీలు ముగిశాయి.  రెండు రోజుల పాటు 65 బృందాలతో 48 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో 10.50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు ముగియడంతో పంచనామా రిపోర్ట్‌ను అధికారులు మంత్రికి ఇచ్చారు. సోమవారం ఐటీ ఎదుట హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు.

మరోవైపు.. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. టర్కీ నుంచి హైదరాబాద్‌కు ఆయన వస్తున్నారు. కాగా, మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాల్లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. తన పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డితో ఐటీ అధికారులు బలవంతంగా సంతకం చేయించుకున్నారంటున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. లేనివి ఉన్నట్లు రాయించుకుని సంతకం చేసుకున్నారని ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి.. గన్ మాన్  సెక్యూరిటీ లేకుండా కేవలం డ్రైవర్‌తో మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్‌కి చేరుకున్నారు.

తాను లేని సమయంలో తన కుమారుడితో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి సంతకం చేయించుకున్నారని బోయినపల్లి పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు. హాస్పిటల్‌లో ఉన్న తన కొడుకుతో బలవంతంగా సంతకం చేపించుకుంటున్నారని, ఇండ్లల్లో చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.

‘‘వీళ్లు ఐటీ అధికారులు కాదు.. రక్త పిశాచులు.. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా రాస్తున్నారు. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. గందరగోళంగా రైడ్స్ చేసారు. మా దగ్గర ఎటువంటి డబ్బు దొరకలేదు. మెడికల్ కాలేజీకి సంబంధించి అన్ని అబద్ధాలు రాశారని’’ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు.
చదవండి: Telangana: సోదాలు, దాడుల కాలమిది!

మరిన్ని వార్తలు