ఆ విషయంలో వెనుకబడ్డ చట్టసభ సభ్యులు

31 Aug, 2020 08:36 IST|Sakshi

నిధులు కొండంత.. ఖర్చు గోరంత!

ఏసీడీపీ నిధుల వ్యయంలో వెనకబడ్డ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

ఐదేళ్లలో రూ.1,440 కోట్లలో రూ.974.85 కోట్లే వెచ్చించిన ఎమ్మెల్యేలు

ఎమ్మెల్సీల కోటాలో రూ.460.5 కోట్లు విడుదల.. ఖర్చు రూ.254.08 కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ) కింద ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను వినియోగించుకోవడంలో చట్టసభల సభ్యులు వెనకబడి ఉన్న ట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో అత్యవసర కార్యక్రమాలు, అభివృద్ధి పనులను వేగంగా జరపాలనే ఉద్దేశంతో ఏటా ప్రభుత్వం విడుద ల చేస్తున్న ఏసీడీపీ నిధుల్లో సగం మేర ఖజానాలోనే మూలుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎంపీ ల్యాడ్స్‌ తరహాలో క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తున్నప్పటికీ వినియోగం మాత్రం పూర్తి స్థాయిలో ఉండడంలేదు. ఒక్కో సభ్యుడికి ఏటా రూ.3 కోట్ల చొప్పున ప్రభుత్వం ఇస్తుండగా... వీటిని తమ విచక్షణాధికారంతో ఖర్చు చేసే వెసులుబాటు ఉంది. 
(చదవండి: బెంజి కార్లలో వచ్చి కల్లు తాగుతున్నారు.. )

ఐదేళ్లలో 1,900 కోట్లు...
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2014–15 వార్షిక సంవత్సరం నుంచి 2018–19 వార్షిక సంవత్సరం వరకు ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏసీడీపీ నిధుల కింద రూ.1,900 కోట్లు విడుదల చేసింది. అయితే వీటిలో కేవలం రూ.1,228.93 కోట్లు ఖర్చు చేశారు. అంటే విడుదల చేసిన నిధులలో కేవలం 64.66 శాతం మాత్రమే ఖర్చు చేయగా.. మిగతావన్నీ ఖజానాలో మూలుగుతున్నాయి. ఖర్చు కాని నిధులను క్యారీఫార్వర్డ్‌ చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ సకాలంలో వీటిని వినియోగించకపోవడంతో ఆశిం చిన ప్రయోజనం కలగడం లేదు. 

ఎమ్మెల్యేలు కాస్త నయం...
ఏసీడీపీ కార్యక్రమం కింద విడుదలైన నిధులను ఖర్చు చేయడంలో ఎమ్మెల్సీల కంటే ఎమ్మెల్యేలు కాస్త ముందు వరుసలో ఉన్నారు. ఐదేళ్లలో ఎమ్మెల్యే కోటాలో ప్రభుత్వం రూ.1,440 కోట్లు విడుదల చేయగా... ఇప్పటివరకు రూ.974.85 కోట్లు (67.69 శాతం)ఖర్చు చేశారు. ఎమ్మెల్సీల కోటాలో రూ.460.5 కోట్లు విడుదల చేస్తే ఇప్పటివరకు రూ.254.08 కోట్లు (55.17శాతం)మాత్రమే ఖర్చు చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలు కాస్త ఎక్కువ నిధులు ఖర్చు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది.
(చదవండి: తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు)

మరిన్ని వార్తలు