తల్లిపాలలోనూ ప్లాస్టిక్‌!

10 Oct, 2022 00:39 IST|Sakshi

విచ్చలవిడిగా ఆ వస్తువుల వాడకంతో ప్రమాదం

అమ్మ పాలలో ప్లాస్టిక్‌ అవశేషాలను గుర్తించిన ఇటలీ శాస్త్రవేత్తలు

34 మంది నుంచి పాలు సేకరించి.. రామన్‌ మైక్రో స్పెక్ట్రోస్కోపీతో విశ్లేషణ

అందులో 26 మంది పాలలో మైక్రో ప్లాస్టిక్‌ అవశేషాలు గుర్తింపు

ఇవి పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపవచ్చన్న అంచనాలు

ఆహారం నిల్వ, ప్రాసెసింగ్, రవాణా, తినడం.. ఇలా అన్ని దశల్లో చేరుతున్న ప్లాస్టిక్‌

సూక్ష్మ కణాలతో కలుషితమై గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి..

ఇటీవల మనుషుల రక్తంలోనూ ప్లాస్టిక్‌ అవశేషాలను గుర్తించిన శాస్త్రవేత్తలు

దీంతో దుష్పరిణామాలపై స్పష్టత లేదంటున్న ఐసీఎంఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: సృష్టిలో స్వచ్ఛమైన పదార్థమంటే టక్కున గుర్తొచ్చేది అమ్మ పాలే. కానీ ఇప్పుడా తల్లి పాలు సైతం కలుషితం అవుతున్నాయి. విచ్చలవిడిగా పెరిగిపోయిన ప్లాస్టిక్‌ రక్కసి చివరికి తల్లి పాలలోనూ చేరుతోంది. ఆ రూపంలో శిశువుల శరీరంలోనికీ వెళుతోంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు ప్రతి పనిలో, ప్రతిచోటా ప్లాస్టిక్‌తో ముడిపడిపోయిన పరిస్థితే దీనికి కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

ప్లాస్టిక్‌ సంచులు, డబ్బాలు, పాత్రల్లో వేసిన ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ప్లాస్టిక్‌ బాటిళ్లతో నీళ్లు, ఇతర పానీయాలు తాగుతున్నప్పుడు అతి సూక్ష్మ ప్లాస్టిక్‌ ముక్కలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. పీల్చే గాలి ద్వారా ప్లాస్టిక్‌ కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి. మనుషుల రక్తంలో కూడా ప్లాస్టిక్‌ ముక్కలు ఉన్నట్టు కొద్దిరోజుల కింద శాస్త్రవేత్తలు తేల్చారు. అలాంటిది చివరికి తల్లిపాలలోనూ ప్లాస్టిక్‌ చేరినట్టు ఇటలీ వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

పరిశీలన సాగిందిలా..: స్త్రీ వైద్యులు, శాస్త్రవేత్తల బృందం యూనివర్సిటీ ఆస్పత్రిలో 34 మంది తల్లుల నుంచి నిర్ణీత మొత్తంలో పాల నమూనాలను సేకరించింది. వాటిని రామన్‌ మైక్రో స్పెక్ట్రోస్కొపీ సాంకేతికత సాయంతో విశ్లేషించింది. ఈ సందర్భంగా 26 మంది పాలలో సూక్ష్మ ప్లాస్టిక్‌ అవశేషాలను గుర్తించారు. ఆ మైక్రో ప్లాస్టిక్‌ కణాలు ఏ రకమైనవి, వాటి పరిణామం, రంగులను నిర్ధారించారు. కొందరి పాలలో అయితే రెండు, మూడు రకాల మైక్రో ప్లాస్టిక్‌లు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా ఆహారాన్ని ప్యాకింగ్‌ చేయడానికి, నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి ఉపయోగంచే ప్లాస్టిక్‌ రకాలేనని తేల్చారు.

రకరకాలుగా కలుషితం
ఆహారం, కలుషిత గాలి ద్వారా ప్లాస్టిక్‌ మన శరీరంలోకి చేరుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆహార పదార్థాల ఉత్పత్తి మొదలు.. నిల్వ, రవాణా, వండటం, వడ్డించడం, చివరి ప్లాస్టిక్‌ చెంచాలతో తినడం వరకు అన్ని స్థాయిల్లో ప్లాస్టిక్‌ చేరుతోంది. ఆహారం ద్వారా శరీరంలోకి వెళుతోంది. ఇక ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగంతో అతి సూక్ష్మ ప్లాస్టిక్‌ కణాలు గాలిలో చేరుతున్నాయి. శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి, వాటి నుంచి రక్తంలో ప్రవేశించి శరీర భాగాలన్నింటికీ వెళుతున్నాయి.

సముద్రాలు, నదులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం 3.6 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లో చేరినట్టు అంచనా. ప్లాస్టిక్‌ ఉత్పత్తులు నీటిలో కలవడం, వాటి నుంచి అతిచిన్న ముక్కలు నీటిలోకి, జలచరాల్లోకి చేరడం, వాటిని ఆహారంగా తీసుకుంటున్న మన శరీరంలోకి చేరడం జరుగుతోంది. ఇదంతా అత్యంత సూక్ష్మస్థాయిలో ముంచుకొస్తున్న ప్రమాదమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాల్సిందే..
భారత ఆహార ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ), ఐసీఎంఆర్‌ సంస్థల వివరాల ప్రకారం మన దేశంలో మానవాళిపై ప్లాస్టిక్‌ కణాల ప్రభావంపై పరిశోధన జరగలేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ఈ అంశంలో సరైన స్పష్టత లేదని ఐసీఎంఆర్‌ అంటోంది. తల్లిపాలలోనూ ప్లాస్టిక్‌ కణాలు చేరుతున్నాయని తేలిన నేపథ్యంలో ఈ అంశంపై పరిశోధనలు మరింతగా జరగాల్సి ఉంది. మన దేశంలో ప్లాస్టిక్‌ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించాల్సిన అవసరముంది. ప్రభుత్వాలు కఠిన నిబంధనలు తీసుకురావాలి.
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

గర్భిణులు, బాలింతలు ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలి
తల్లిపాలలో ప్లాస్టిక్‌తోపాటు లెడ్‌ వంటి భారలోహల అవశేషాలు ఉన్నాయన్న కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. తల్లి పాలలో ప్లాస్టిక్, లెడ్‌ అవశేషాలతో జరిగే నష్టంపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టతా లేదు. కానీ పుట్టినబిడ్డకు తల్లి పాలు అత్యంత కీలకం. అందువల్ల గర్భిణులు, బాలింతలు ప్లాస్టిక్‌ వినియోగానికి వీలైనంత దూరంగా ఉండాలి. ప్లాస్టిక్‌ ప్యాకేజింగ్‌తో ఉండే ఆహారం తీసుకోవద్దు.
– డాక్టర్‌ బబిత మాటూరి, సీనియర్‌ గైనకాలజిస్ట్‌ 

ప్రమాదం ఎంత వరకు?
తల్లి పాలలోని ప్లాస్టిక్‌ అవశేషాలతో బిడ్డకు ప్రమాదం కలగవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న వైద్య నిపుణులు చెప్తున్నారు. చిన్నారుల మెదడు, నాడీ మండలంపై ప్రభావం చూపడంతోపాటు హార్మోన్ల అసమతుల్యతకు దారి తీయవచ్చని.. ఇది ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అయితే తల్లి పాలలోని మైక్రోప్లాస్టిక్‌ ద్వారా జరిగే దుష్పరిణామాలపై ఎలాంటి రుజువులు లేవని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది. ఇప్పటివరకు ఈ అంశంపై మన దేశంలో ఎలాంటి పరిశోధన జరగలేదని, పాశ్చాత్య దేశాల్లో కూడా లోతైన పరిశోధనలేవీ లేవని తెలిపింది. 

మరిన్ని వార్తలు