ఇదే తొలిసారి, రూ.740 కోట్ల భారీ పెట్టుబడి

8 Jul, 2021 05:39 IST|Sakshi

మంత్రి కేటీఆర్‌కు పెట్టుబడి వివరాలు అందజేసిన సంస్థ ప్రతినిధులు

 లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఈ పెట్టుబడి మైలురాయి: కేటీఆర్‌   

సాక్షి, హైదరాబాద్‌: లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి చిరునామాగా ఉన్న తెలంగాణలో రూ.740 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు కెనడాకు చెందిన ఇవాన్‌ హో కేంబ్రిడ్జ్‌ సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌ శివారులోని జీనోమ్‌ వ్యాలీలో 10 లక్షల చదరపు అడుగుల ల్యాబ్‌స్పేస్‌ ఏర్పాటుకు ఈ పెట్టుబడిని వినియోగించనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుతో వర్చువల్‌ విధానంలో ఆ సంస్థ భారతీయ విభాగం సీనియర్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. కెనడాకు చెందిన ఓ పెట్టుబడి సంస్థ దక్షిణాసియాలోని లైఫ్‌సైన్సెస్‌ రంగంలో ఇంత భారీ పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారని వారు మంత్రి కేటీఆర్‌కు వివరించారు.

మౌలిక వసతుల కల్పనలో మైలురాయి
లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ‘ఇవాన్‌ హో కేంబ్రిడ్జ్‌’ పెట్టుబడి మైలురాయిగా నిలిచిపోతుందని మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. ఇప్పటికే రెండు వందలకు పైగా లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్న జీనోమ్‌ వ్యాలీలో తాజా పెట్టుబడితో లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి మరింత ఊతం లభిస్తుందన్నారు. లేబొరేటరీ స్పేస్‌ పెరగడంతో పాటు పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన మౌలిక వసతులు పెరుగుతాయన్నారు. సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో ఇవాన్‌ హో కేంబ్రిడ్జ్‌ సంస్థ భారతీయ విభాగం ఎండీ చాణక్య చక్రవర్తి, సీనియర్‌ ప్రతినిధులు శిల్పి చౌదరి, హరేకృష్ణ, సంకేత్‌ సిన్హాతో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్, డైరెక్టర్‌ లైఫ్‌సైన్సెస్‌ శక్తి నాగప్పన్‌ పాల్గొన్నారు. 

చిన్న పరిశ్రమలకు చేయూతనివ్వండి కేంద్ర మంత్రి నిర్మలకు మంత్రి కేటీఆర్‌ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎస్‌ఎంఎస్‌ఈ) ఊరటనిచ్చేలా కేంద్రం మద్దతు ప్రకటించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు బుధవారం లేఖ రాశారు. ఎలాంటి రాబడులు లేని సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈల రుణాల చెల్లింపుపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు మారటోరియం విధించడంతో పాటు రుణాలపై వడ్డీ ఎత్తేయాలని కో రారు. నాలుగో త్రైమాసికంలో ఎస్‌ఎంఎస్‌ఈలు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కేంద్రం  మద్దతు అవసరం ఉందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా గతేడాది నుంచి ఈ పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గుర్తు చేశారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ ఎస్‌ఎంఎస్‌ఈలపై రాష్ట్రం ఆంక్షలు విధించలేదని వివరించారు. ఎస్‌ఎంఎస్‌ఈలు తయారు చేసిన ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్‌లో ఇబ్బందులతో కార్యకలాపాలు నిలిచిపోయాయని పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు